‘మా’ ఎన్నికలకు నాలుగు రోజుల మాత్రమే గడువు వుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ దఫా ప్రత్యర్థులు బలంగా ఢీకుంటున్నారు. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు పరస్పరం వ్యక్తిగత దూషణలకు, తీవ్రస్థాయిలో హెచ్చరికలకు వెనకాడడం లేదు. ‘మా’ ఎన్నికల్లో ఇదో ప్రమాదకర పరిణామంగా చెప్పొచ్చు. ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్ అనే అంశాన్ని ప్రత్యర్థులు చాలా బలంగా తెరపైకి తెస్తూ, ఎన్నికల్లో దెబ్బ కొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టే కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో నటుడు, దర్శకుడు రవిబాబు వినూత్నంగా ప్రకాశ్‌రాజ్‌పై నెగెటివిటీ పెంచే ప్రయత్నం చేశారు. ‘మా’ ఎన్నికల్లో ఎలాంటి వారిని ఎన్నుకోవాలో ఆయన ఓ వీడియోను విడుదల చేయడం గమనార్హం. ఇందులో ప్రకాశ్‌రాజ్ పేరు ఎత్తకుండానే ,ఆయన నాయకత్వంపై చురకలు అంటించారు. మన సంస్థ.. మనం నడుపుకోలేమా? మనకి చేతకాదా? అంటూ ఓ ఆలోచనాత్మక ప్రతిపాదనను ‘మా’ సభ్యుల ముందు పెట్టారు.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే…
‘లోకల్, నాన్‌లోకల్ వివాదంపై మాట్లాడాలనుకోవడం లేదు. ఏదో ఒక ప్యానల్‌కు ఓటు వేయమని చెప్పాలనుకోవడం లేదు. మనకి ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఉన్నారు. మన దర్శక నిర్మాతలు మాత్రం బయటవాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారు. వాళ్ల డిమాండ్లకు ఒప్పుకొని మరీ ఆఫర్లు ఇస్తున్నారు. అదే మాదిరిగా కెమెరామెన్లు, మేకప్మేన్లు.. ఇలా ఒక్కటేమిటి.. సినిమాకు సంబంధించిన చాలా విభాగాల్లో మన వాళ్లకంటే బయటవాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారు.
ఈ విషయాన్ని పక్కనపెడితే.. నటీనటుల సంక్షేమం కోసం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం మనం ఓ చిన్న సంస్థ ‘మా’ ను ఏర్పాటు చేసుకున్నాం. ఇది మన కోసం మనం పెట్టుకున్న సంస్థ. అలాంటి ఒక చిన్న సంస్థలో పని చేయడానికి కూడా మనలో ఒకడు పనికిరాడా? దీనికి కూడా మనం బయట నుంచే మనుషులను తెచ్చుకోవాలా? ఇది మన సంస్థ.. మనం నడుపు కోలేమా? మనకి చేతకాదా? ఒక్కసారి ఆలోచించండి’ అంటూ రవిబాబు ప్రశ్నలు సంధించారు.
రవిబాబు ఎవరి గురించి మాట్లాడారో అందరికీ తెలుసు. ఎన్నికల సమయం సమీపించే కొద్ది ఇలాంటి సందేశాత్మక, ఆలోచనాత్మక వీడియోలు, పోస్టులు మరిన్ని తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. వీటిని తిప్పికొట్టేందుకు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ముందున్న ప్రణాళిక ఏంటనేది ఇప్పుడు కీలక ప్రశ్న.