ఎవరినో మెప్పించాలని ఆరాటం, ఎలాగోలా అధికారాన్ని సంపాదించుకోవాలనే ప్రయత్నం, ఈ ప్రయత్నంలో అడ్డదారులను వెదుకుతున్నారు కానీ, అసలు దారిని మరిచారు! బహుశా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరిత్రలో అడ్డదారిలో సాధించిన విజయాలే ఎక్కువ కాబట్టి, అంతకు మించిన వ్యూహాలు ఆయనకు తెలియకపోవచ్చు! అయితే ఎటొచ్చీ రోజులు మారాయి.
చంద్రబాబు నాయుడి మార్కు దొడ్డిదారి పాలిటిక్స్ కు కాలం చెల్లింది. కానీ ఆయన మాత్రం అవే తంత్రాలను నమ్ముకున్నారు. కుతంత్రాలు చేసి అధికారాన్ని మళ్లీ అందుకోవాలనే తపన తప్ప చంద్రబాబు నాయుడి ప్రతిపక్ష వాసంలో మరో రాజకీయం ఏదీ కనిపించడం లేదు.
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా మారి ఏడాదిన్నర గడిచిపోయింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు పనితీరును ఒకసారి పరిశీలిస్తే.. ఆయన ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రెస్ మీట్లలో స్పందించిన తీరును గమనిస్తే.. జూమ్ ద్వారా ట్వీట్ల ద్వారా సాగుతున్నా ఆయన రాజకీయాన్ని విశ్లేషిస్తే… ఆయన మారలేదు అనే విషయం స్పష్టం అవుతుంది.
ఎంతసేపూ చంద్రబాబు నాయుడు అడ్డదారులను అన్వేషిస్తున్నారు కానీ, ధైర్యంగా పోరాడి, ప్రజల పక్షాన నిలిచి, వారికి చేరువై అధికారాన్ని పొందాలనే ఆసక్తిని ప్రదర్శించడం లేదు!
ప్రతిపక్ష వాసమంటే ప్రజాపోరాటాలు చేయాలి, ప్రజల మధ్యకు వెళ్లాలి, ఆల్రెడీ అధికారం నుంచి దిగిపోయారు కాబట్టి.. తను అనుసరించిన విధానాల్లో తప్పొప్పుల గురించి మాట్లాడగలగాలి, జరిగిన పొరపాట్లు ఏమిటో సమీక్షించుకోవాలి, ప్రజల ముందు వాటిని ఒప్పుకోగలగాలి, మరోసారి అధికారం ఇస్తే అలాంటి పొరపాట్లు జరగవనే భరోసాను వారికి ఇవ్వాలి! .
ఒక ప్రతిపక్ష నేత నుంచి ఎక్స్ పెక్ట్ చేసేది ఇదే! మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? అంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో సాధించిన విజయాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు, జగన్ గాలికి వచ్చాడట, గాలికి పోతారట!
పదేళ్ల పాటు ప్రతిపక్షంలో నిలిచి జగన్ ప్రజల ఆదరణను పొందారు. అది కూడా తొలి టర్మ్ లో కాదు.. తొలిసారి తన పార్టీతో ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తృటిలో అధికారాన్ని అందుకోలేకపోయారు. మోడీ గాలి అప్పుడు చంద్రబాబుకు కలిసి వచ్చింది, పవన్ కల్యాణ్ మద్దతు లాభించింది, అలా అన్ని కలిసి వస్తే .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఒకటిన్నర శాతం ఎక్కువ ఓట్లను పొంది చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు.
ఐదేళ్ల తర్వాత ఎన్నికలకు వెళ్లి అంతకు ముందు కలిసి వచ్చిన అంశాలు అండగా లేకపోవడంతో చిత్తు చిత్తు అయ్యారు! మరి దీన్ని బట్టి చూస్తే.. ఎవరు గాలికి వచ్చారు? ఎవరు గాలికి కొట్టుకుపోయారు?
మోడీ, పవన్ కల్యాణ్ ల అండతో గెలిచిన చంద్రబాబుది గాలి గెలుపా? వీళ్లంతా కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా తన సత్తా ఏమిటో చూపించిన జగన్ ది గాలి గెలుపా? ఈ విషయాలను అర్థం చేసుకునేంత మెదడు ఏపీ జనాలకు లేదు అనేది చంద్రబాబు నాయుడి బలమైన అభిప్రాయం.
అందుకే ఆయన నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు, తను ఏం చెబితే అదే జనాలు వింటారు, దాన్నే నమ్ముతారు అనే గుడ్డి నమ్మకంలోనే చంద్రబాబు నాయుడు ఇంకా ఉన్నారని స్పష్టం అవుతోంది. గోబెల్స్ ప్రచారం చేస్తే అదే నిజం అయిపోతుందనేది చంద్రబాబు నాయుడు ఇంకా నమ్ముతున్న సిద్ధాంతం.
ఆ రెండు పత్రికలే ఉన్న రోజుల్లో ఇలాంటి వ్యూహాలతో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వంటి ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రిని కూడా దించి, తను సీఎం కాగలిగాడేమో కానీ, సోషల్ మీడియా రోజుల్లో అలాంటి వ్యూహాలకు కాలం చెల్లిందని చంద్రబాబు నాయుడు ఇంకా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు!
ఎవరో రావాలి.. వారే గెలిపించాలి!
తను సొంతంగా గెలవగలిగేది లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పూర్తి స్పష్టత వచ్చేసినట్టుగా ఉంది. ఎవరో రావాలి తనను గట్టెక్కించాల్సిందే తప్ప తను సొంతంగా పొడవగలిగేది ఏమీ లేదని ఆయనకు క్లారిటీ వచ్చింది.
సొంత బలం మీద విశ్వాసం లేక చంద్రబాబు నాయుడు రాజకీయంగా మరింత పతనవాస్థలోకి కూరుకుపోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మళ్లీ అంటకాగడానికి చంద్రబాబు నాయుడు పడుతున్న పాట్లు ప్రహసనంగా మారాయి.
ఎలాగోలా మళ్లీ మోడీ పంచన చేరాలనేది చంద్రబాబు నాయుడి ప్రయత్నం. అయితే మోడీ ముందు సాగిలా పడే అవకాశమే దక్కడం లేదు. ఆ అవకాశాన్ని సృష్టించుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులను కూడా బీజేపీలోకి పంపించేశారు. మోడీ కి అనుకూల భజన చేస్తూ ఉన్నారు.
ఢిల్లీలో చీమ చిటుక్కుమన్నా చంద్రబాబు నాయుడు స్పందించేస్తూ ఉన్నారు. అమిత్ షాకు జ్వరమొచ్చిందంటే ఈయన కలవరపడుతున్నాడు. వెంటనే ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారు. మోడీ అక్కడ కొబ్బరి కాయ కొడితే ఇక్కడ చంద్రబాబు నాయుడు పూజలు చేస్తున్నారు! నూతన పార్లమెంట్ భవనం నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేయగానే చంద్రబాబు నాయుడు పరవశించి పోయారు. అభినందించేశారు. అలా అయినా తనను గుర్తిస్తారేమో అనేది చంద్రబాబు ఆశలా ఉంది.
అయితే చంద్రబాబు ఎత్తుగడలు మరీ చీప్ ట్రిక్స్ గా మారుతున్నాయని వేరే చెప్పనక్కర్లేదు. ఈ దిగజారడంలో చంద్రబాబు నాయుడుకు ఒక లోతంటూ హద్దుగా లేకుండా పోతోంది. బీజేపీ నేతల మీద అతి వినయాన్ని కూడా కనబరుస్తూ ఉన్నారు. ఈ అతి వినయం ధూర్త లక్షణం అని వేరే చెప్పనక్కర్లేదు. అందునా చంద్రబాబుతో గత టర్మ్ లో కలిసి కాపురం చేసింది బీజేపీ. అప్పుడు ఈయన చూపిన లీలలను వారు మరిచిపోలేరు!
ఎన్నికలు వచ్చేంత వరకూ బీజేపీతో కలిసి కాపురం చేసి.. తీరా ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు అడ్డం తిరిగిన తీరును, ఆయన చూపించిన అవకాశవాదాన్ని మోడీ అండ్ కో అస్సలు మరిచిపోలేదు! దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలున్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలకూ అధినేతలున్నారు. అయితే చంద్రబాబు అంతటి అవకాశవాద నేత మరొకరు కనిపించరు.
ఆ పార్టీల్లో కూడా ఆ కూటమిలో కొన్నాళ్లు, ఈ కూటమిలో కొన్నాళ్లు ఉండేవున్నాయి. అయితే చంద్రబాబులా రాత్రికి రాత్రి కూటములు మార్చేసి, పాత వాళ్లపై రాళ్లు వేసే రకాలు మాత్రం ఎవ్వరూ లేరు! అంతటి పచ్చి అవకాశవాది చంద్రబాబు మాత్రమే. ఈ సినిమాను మోడీ, అమిత్ షాలకు చూపించారు చంద్రబాబు నాయుడు.
అన్నింటికీ మించి గత ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి తరఫున ఖర్చులు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడే అనే ప్రచారం ఉండనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబును మోడీ అయినా ఎందుకు నమ్ముతాడు? రాజకీయాలంటేనే విలువలు లేనివి కావొచ్చు, కానీ అందులోకూడా మరీ బరితెగించే చంద్రబాబును ఎవరైనా ఎందుకు విశ్వాసంలోకి తీసుకుంటారు? అనేవి ఇంగితజ్ఞానం ఉన్న ఏ ఒక్కరైనా వేసే ప్రశ్నలు! అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఆత్మవిమర్శ చేసుకున్నట్టుగా కనిపించరు.
సామాన్య ప్రజలే గాక ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవారే ఈ తీరును ఛీత్కరించుకుంటున్నా.. చంద్రబాబు నాయుడు మాత్రం చలనం లేకుండా అవే రాజకీయాలే చేస్తూ ఉంటారు. ఎన్నికల ముందు బీజేపీని తిట్టి, కాంగ్రెస్ ను పొగిడి, ఇప్పుడు మళ్లీ మోడీ భజన చేస్తున్న చంద్రబాబు నాయుడు అటూ ఇటూ ఎటూ కాకుండా పోతున్నారు!
పరిస్థితి ఇలా ఉంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీకి దగ్గర అయితే తప్ప తను గెలవలేనన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ పార్టీని ఆకట్టుకోవడానికి చీప్ ట్రిక్స్ అన్నీ ప్రయోగిస్తున్నారు. ఎవరో రావాలి తనను గెలిపించాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు.. టీడీపీ భవితవ్యాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తోంది!
చేతిలో ఉన్నది పవన్ కల్యాణ్ మాత్రమే!
చంద్రబాబును బీజేపీ వాళ్లు ఛీత్కరించుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వీక్ గా ఉన్న చోట తాము పాగా వేస్తున్న వైనాలను గమనించి బీజేపీ వాళ్లు చంద్రబాబును దూరం పెట్టడానికే ఫిక్సయినట్టుగా కనిపిస్తున్నారు. బెంగాల్ లో అయినా, తెలంగాణలో అయినా.. మరో చోట అయినా ప్రతిపక్ష పార్టీ వీక్ గా ఉన్నప్పుడే తాము ప్రతిపక్షంగా నిలవొచ్చు అనే వ్యూహంపై కమలం పార్టీ వ్యూహకర్తలకు క్లారిటీ వచ్చింది.
ఈ నేపథ్యంలో వారు ఏపీలో కూడా ముందు తెలుగుదేశం పార్టీకి తాము ప్రత్యామ్నాయంగా నిలవాలనే లెక్కలతో ఉన్నారు. అందుకే చంద్రబాబును దూరదూరంగానే పెడుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు చేతిలో ఉన్న పేక ముక్క పవన్ కల్యాణ్ మాత్రమే!
పవన్ కల్యాణ్ ను బీజేపీ దరి చేర్చింది కూడా చంద్రబాబు నాయుడే అనేది బహిరంగ సత్యం. చంద్రబాబు చేతిలో వాడబడటాన్ని ఇప్పటికీ ఆస్వాధిస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్ మాత్రమే కావొచ్చు. తిరుపతి బై పోల్ విషయంలో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు నాయుడు జోకర్ గా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక ఏపీలో ఆసక్తిదాయకమైన రాజకీయ వేదిక కాబోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో సాధించుకున్న మెజారిటీలో ఇప్పుడు తమ వెంట ఎంత ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నిరూపించుకోవాల్సి ఉంది. అదే సమయంలో రెండో స్థానం ఎవరికి దక్కుతుంది? అనేది మరో ఆసక్తిదాయకమైన ప్రశ్న. ఈ రెండో స్థానం గనుక బీజేపీ సాధిస్తే..ఏపీలో తెలుగుదేశం పార్టీ దుకాణం మూసి వేయడానికి సమయం ఆసన్నమవుతున్నట్టే.
ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పని తీరును గమనించినా, ఆ పార్టీ అధినేత పూర్తిగా జనానికి దూరం అయిపోయిన పరిస్థితులను పరిశీలించినా, ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షంగా టీడీపీ కన్నా బీజేపీనే యాక్టివ్ గా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో, జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ సాధించిన విజయాల నేపథ్యంలో ఏపీ బీజేపీకి కూడా కొత్త ఉత్సాహం వచ్చింది.
తిరుపతి బై పోల్ లో పోటీ చేసి తాము బలపడిన వైనాన్ని చూపించాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కన్నా ఎక్కువ ఓట్లను సాధించి, తామే ప్రతిపక్షం అని నిరూపించుకోవాలని బీజేపీ గట్టిగానే కష్టపడుతోంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? అలా కాదు.. ఏపీలో తమ ప్రతిపక్ష పాత్ర ఉందని నిరూపించుకోవాలి. తామే రెండో స్థానంలో ఉన్నట్టుగా నంబర్లలో చూపాలి!
అందుకోసం ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లాలి, తన పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలి.. అయితే అలా చేస్తే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతారు? చంద్రబాబు రాజకీయమే వేరేలా ఉంటుంది కదా, అందుకే తిరుపతిలో అసలు బీజేపీనే బరిలోకి దిగకుండా తన పార్ట్ నర్ ను రంగంలోకి దించారు చంద్రబాబు నాయుడు.
తిరుపతి చుట్టూ పవన్ కల్యాణ్ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. అక్కడి రైతులనే పరామర్శిస్తున్నారు, తిరుపతిలో తన అన్న ఎప్పుడో గెలిచిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.. ఇవన్నీ గుర్తు చేసి తిరుపతి బై పోల్ లో జనసేన అభ్యర్థిని బరిలోకి దించాలి! ఇది పవన్ కల్యాణ్ లెక్క కాదు, చంద్రబాబు లెక్క!
తిరుపతిలో బీజేపీ కాకుండా.. బీజేపీ సపోర్ట్ తో జనసేన బరిలోకి దిగితే అప్పుడు పరిస్థితి మొత్తం చంద్రబాబు కంట్రోల్ లోకి వస్తుంది. జనసేన అభ్యర్థి బరిలోకి దిగుతాడు కానీ.. పోటీ నామమాత్రం అవుతుంది. జనసేన యాక్టివ్ గా ప్రచారం చేయదు, బీజేపీ శ్రేణుల ఉత్సాహం నీరు గారి పోతుంది, చంద్రబాబు ఏం చేప్తే అదే జనసేన చేస్తుంది.
తిరుపతి బరిలో బీజేపీ కాకుండా జనసేన నిలబడితే చాలు..రెండో స్థానం ఎలాగూ టీడీపీనే దక్కించుకుంటుంది. అలా రాష్ట్రంలో రెండో స్థానంలో తామే ఉన్నట్టుగా నిరూపించుకోవాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ లో పవన్ కల్యాణ్ పావుగా ఉపయోగపడుతూ ఉన్నారు.
తాను రాజకీయంగా బలపడటం అంటే.. అవతల వాళ్లు రాజకీయంగా వీక్ కావడం లేదా వాళ్లు వచ్చి తనను సపోర్ట్ చేయడం తప్ప మరోటి కాదనే రాజకీయాన్నే చంద్రబాబు నాయుడు నమ్ముకున్నారు. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు.
ప్రతిపక్ష నేతగా జగన్ ఏం చేశారు?
ఏడాదిన్నర గడిచినా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ చేపట్టిన కార్యక్రమంగా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటీ లేదు! అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ టీడీపీకి ఏ అవకాశం ఇవ్వడం లేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అలాగని ఇప్పటి వరకూ జగన్ కు ప్రజా వ్యతిరేకత వస్తాయేమో అనే అంశాలు లేకపోలేదు. వాటిని తెలుగుదేశం అందుకోలేకపోతున్న వైనం స్పష్టం అవుతూ ఉంది.
జగన్ ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితులను గమనిస్తే.. టీడీపీ జగన్ కు అవకాశాలను ఇచ్చింది. వాటిని ఆధారంగా చేసుకుని జగన్ రోడ్డెక్కారు. ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు నాయుడి వైఫల్యంపై జగన్ చెలరేగిపోయారు. నంద్యాల ఉప ఎన్నిక వరకూ తను చేసిన పోరాటం సరిపోలేదని జగన్ కు స్పష్టంగా అర్థమైంది. అందుకే పాదయాత్రను చేపట్టారు.
సుదీర్ఘ కాలం పాటు, అనేక ఆటంకాలను ఎదుర్కొని జగన్ ఆ యాత్రను పూర్తి చేశారు. మీడియా సపోర్ట్ అంతంత మాత్రం, పోరాడారు. నిరుత్సాహ పరిచే అంశాలు ఎన్ని ఉన్నా జగన్ ఎక్కడా నిస్పృహకు లోను కాలేదు. పోరాటపటిమను వదులుకోలేదు.
కేవలం చంద్రబాబు విధానాలనే కాదు.. అప్పుడు మోడీ విధానాలను తప్పు పట్టడానికి కూడా జగన్ వెనుకాడలేదు. ప్రత్యేక హోదా అంశంలో ఢిల్లీ స్థాయిలో ధర్నాలను, దీక్షలను చేపట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీజేపీని కూడా అప్పుడు లక్ష్యంగా చేసుకున్నారు. అలా కేంద్ర విధానాల మీద కూడా జగన్ మొహమాటం లేకుండా, భయం లేకుండానే స్పందించారు.
ఇప్పుడు చంద్రబాబు విషయానికి వస్తే.. కేంద్ర విధానాల మీద స్పందించేంత ధైర్యమే లేదు! ఎంతసేపూ వాళ్ల ముందు సాగిలాపడటానికి చేసే ప్రయత్నాలే కానీ, చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఇక హామీల విషయంలో చంద్రబాబుకు జగన్ అవకాశమే ఇవ్వడం లేదు. అయినా ప్రభుత్వం ఉన్నాకా.. దానిపై అసంతృప్త వర్గాలు ఉండనే ఉంటాయి, వాటినే ప్రతిపక్షం కలుపుకుపోవాలి.
టీడీపీ నుంచి అలాంటి ప్రయత్నాలు లేవు, ముందు ముందు ఉండే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే.. సొంతంగా పోరాడే శక్తి, ఓపిక, చాతుర్యం, ఉత్సాహం, ఆసక్తి.. ఇవేవీ చంద్రబాబులో కనిపించడం లేదు. ఆయన అడ్డదారులనే నమ్ముకున్నారు. అలాగే మాట్లాడుతున్నారు. ఇక చంద్రబాబు తనయుడి సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఏతావాతా చంద్రబాబు తదుపరి రాజకీయానికి అడ్డదారులే ఆధారం అయ్యేట్టున్నాయి.
ఇదేనా రాజకీయ చాణక్యం?
చంద్రబాబు నాయుడును ఆయన అనుకూల మీడియా రాజకీయ చాణుక్యుడిగా అభివర్ణిస్తూ ఉంటుంది. ఆయన దొడ్డిదారి రాజకీయాలకు పెట్టిన పేరు అది.
ఎన్టీఆర్ ను దించేయడం, స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మెజారిటీ లేకపోయినా జడ్పీ చైర్మన్లను, మేయర్లను తమ వాళ్లను గెలిపించుకోవడం, ఒక్కో ఎన్నికల్లో ఒక్కో కూటమితో జత కట్టడం, తిట్టిన వాళ్లనే పొగడటం, పొగిడిన వాళ్లను తిట్టడం, వెన్నుపోట్లు పొడవడం, పొత్తు పెట్టుకున్న వాళ్లనే చిత్తు చేయడం, వాళ్ల భజనా వీళ్ల భజనా చేయడం, ఎవరి ముందు అయినా సాగిలా పడటం.. ఇదీ చంద్రబాబు నాయుడి మార్కు రాజకీయం.
దీన్ని రాజకీయ చాణక్యం అంటారో, ఛీ కొట్టించుకోవడం అంటారో.. ప్రజలకే తెలుసు! ఇదే రాజకీయాన్నే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా నమ్ముకున్నారని మాత్రం స్పష్టం అవుతోంది. ఈ తరంలో ఈ తరహా రాజకీయం ఫలితాలు మరింత ఛీ కొట్టించుకునేలా ఉంటాయని రానున్న రోజుల్లో స్పష్టత రావడం ఖాయం!