కేసిఆర్ వెళ్లారా? పిలిచారా?

రాజకీయ వర్గాల్లో ఒకటే హడావుడి. ఉన్నట్లుండి కేసిఆర్ ఢిల్లీలో తేలారు. శాలువాలు కప్పుతూ, రాష్ట్రం కోసం కేంద్రం ఇవ్వాల్సిన, రావాల్సిన, కోరాల్సిన డిమాండ్ లిస్ట్ ఇస్తూ పోతున్నారు. ఇదంతా చూసి మీడియా రకరకాల కథనాలు…

రాజకీయ వర్గాల్లో ఒకటే హడావుడి. ఉన్నట్లుండి కేసిఆర్ ఢిల్లీలో తేలారు. శాలువాలు కప్పుతూ, రాష్ట్రం కోసం కేంద్రం ఇవ్వాల్సిన, రావాల్సిన, కోరాల్సిన డిమాండ్ లిస్ట్ ఇస్తూ పోతున్నారు. ఇదంతా చూసి మీడియా రకరకాల కథనాలు వండేస్తోంది.

కేంద్రంపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్న కేసిఆర్ మాట మార్చేసారని, హైదరాబాద్ వేదికగా ప్రతిపక్షాలను ఒకటి చేస్తానని అని బీరాలు పలికిన ఆయన, ఇప్పుడు తనే స్వయంగా మోడీ దగ్గరకు వెళ్లిపోయారని వార్తా కథనాలు వచ్చేసాయి.

దీనికి భిన్నమైన కబుర్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కేసిఆర్ ను ఢిల్లీ రావాలని అమిత్ షా నే లోపాయకారీగా కబురు చేసారన్నది ఆ కబుర్ల సారాశం. దాని ఫలితంగానే కేసిఆర్ చాలా సైలంట్ గా ఢిల్లీకి పయనమై వెళ్లారని, ఢిల్లీ పెద్దలు కబురు చేయడం వల్లనే వెంట వెంటనే వారి అపాయింట్ మెంట్లు దొరికేసాయని అంటున్నారు.

లేదూ అంటే అంత సడెన్ గా కెసిఆర్ టూర్ ఫిక్స్ చేసుకోవచ్చు కానీ, అపాయింట్ మెంట్లు దొరకడం కష్టమని, పైగా కేసిఆర్ వ్యవహారాలు ఇటీవల చూస్తున్న తరువాత అలా అపాయింట్ మెంట్ లు ఇచ్చే అవకాశం చాలా తక్కువ అని అంటున్నారు.

అసలు ఇంతకీ ఢిల్లీ పెద్దలు కోరి మరీ కేసిఆర్ ను పిలిపించి వుంటారా? అలా పిలిపించి వుంటే ఎందుకు అయి వుంటుంది? దీనికి ఆన్సర్ సింపుల్. రైతుల ఉద్యమం కారణంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత ఎక్కువవుతోంది.

ప్రస్తుతానికి ఇది కేవలం ఢిల్లీ పరిసర ప్రాంతాలకే పరిమతం అయింది. రైతుల బంద్ పిలుపు తో మాత్రం ఆంధ్ర, తెలంగాణ కూడా స్పందించాయి. తెలంగాణలో బంద్ ను అధికార పక్షం కాస్త గట్టిగా నిర్వహించింది. 

ఇలాంటి నేపథ్యలో పోరు సాగిస్తున్న రైతులు, తమ ఉద్యమాన్ని దేశ వ్యాప్తం చేయాలనే ఆలోచనలు చేస్తున్నారు. డిసెంబర్ 18ని డెడ్ లైన్ గా పెట్టారు. కానీ మోడీ ప్రభుత్వం దిగివచ్చేలా లేదు. ఈ ఉద్యమాన్ని వీలయినంత కట్టడి చేయాలని చూస్తోంది.

అందులో భాగంగానే కేసిఆర్ ను పిలిపించారని తెలుస్తోంది. ఉద్యమాన్ని దక్షిణాదికి పాకకుండా చేయాలంటే తెలంగాణ కీలకం. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లతో పెద్దగా సమస్య లేదు. తెలంగాణ లో కాస్త కట్టడి చేయగలిగితే ఉద్యమాన్ని ఉత్తరాదిలోని మూడు నాలుగు రాష్ట్రాలకు పరిమితం చేయొచ్చు.

ఇంతకీ కేసిఆర్ భాజపా పెద్దల మాట మన్నిస్తారా? లేదా? నిజంగానే ఢిల్లీ పెద్దలు పిలిస్తేనే కేసిఆర్ వెళ్లారా? అన్నది భవిష్యత్ లో రైతుల ఉద్యమాన్ని కేసిఆర్ భుజంపై వేసుకోవడం, మానేయడం అనేదాన్ని బట్టి వుంటుంది. 

అటూ ఇటూ ఎటూ కాలేక!