కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరికీ తోచిన సహాయం వారు చేస్తున్నారు. ఇక్కడ సహాయం చేయడమంటే శక్తిమేరకు విరాళాలు ఇవ్వడమని అర్థం. వివిధ రంగాలలోని దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. దక్షిణాదిలోని నాలుగు చిత్ర పరిశ్రమలు అంటే తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలలోని నటీనటులు, రచయితలు, అన్ని విభాగాల టెక్నీషియన్లు విరాళాలు ఇచ్చారు.
తెలుగు విషయానికొస్తే ఇప్పటివరకు టాప్ హీరోలు చాలామంది భారీగా విరాళాలు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని బాహుబలి ప్రభాస్ వరకు విరాళాలు అందించారు. ఇప్పటివరకు విరాళాలు అందించిన హీరోల్లో ప్రభాసే టాప్. ఆయన నాలుగు కోట్లు విరాళంగా అందించారు. మూడు కోట్లు ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇవ్వగా, మిగిలిన కోటి రూపాయల్లో తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలు విరాళంగా అందించారు.
చిరంజీవి కోటి రూపాయలు ఇవ్వగా, ఆయన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంతకు రెట్టింపు ఇచ్చారు. మహేష్ బాబు కోటి, జూనియర్ ఎన్ఠీఆర్ 75 లక్షలు, రామ్ చరణ్ 70 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ 20 లక్షలు, నితిన్ 20 లక్షలు, సాయి ధరమ్ తేజ్ పది లక్షలు, దర్శకుడు అనిల్ రావిపూడి పది లక్షలు … ఇలా ఎందరో విరాళాలు అందించారు.
కొందరు పెద్ద నటులు ఇంకా ఇవ్వలేదు. త్వరలో ఇస్తారేమో. ఇదిలా ఉండగా, నిన్నటి వరకు టాప్ హీరోయిన్లు, నటీమణులు ఎవరూ విరాళాలు ఇచ్చినట్లు వార్తలు రాలేదు. తమిళ, కన్నడ, మళయాళ పరిశ్రమలను అలా పక్కనుంచితే తెలుగు చిత్రసీమలోని హీరోయిన్లు ఎవరూ విరాళాలు ప్రకటించినట్లు సమాచారం లేదు. సినీ తారల విరాళాల గురించి ఓ చానెల్లో ప్రసారమైన కథనంలో నటుల గురించిన సమాచారమే ఉంది తప్ప నటీమణుల గురించి లేదు.
తెలుగు చిత్రసీమలో ఎందరో టాప్ హీరోయిన్లు ఉన్నారు. వారు తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ నటిస్తుంటారు. తెలుగు సినిమాల ద్వారానే టాప్ రేంజ్ కు వెళ్లిన హీరోయిన్లు ఉన్నారు. మరి వీరు విరాళాలు ప్రకటించినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. విరాళాలు ఇచ్చినా పేర్లు బయట పెట్టుకోలేదా? తెలియదు. అయితే మొదటిసారిగా హీరోయిన్ ప్రణీత పేరు బయటకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా చిత్రసీమలోని చిన్న కళాకారులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
వారిలో ఒక్కో కుటుంబానికి రెండు వేల చొప్పున లక్ష రూపాయల సాయం అందిస్తున్నట్లు ప్రణీత ప్రకటించింది. ఈమె దారిలో టాప్ హీరోయిన్లు నడుస్తారేమో చూడాలి. ప్రభుత్వనికి విరాళాలు ఇవ్వని కొందరు రోజువారీ ఆదాయంతో జీవిస్తున్న కళాకారులకు, వివిధ విభాగాల్లోని వారికి, తమ దగ్గర పనిచేస్తున్నవారికి సహాయం చేస్తున్నారు. ఈ విపత్తు సమయంలో ఎలాంటి సహాయం చేసినా అది గొప్ప విషయమే కదా.