హైకోర్టు విభజన: ‘లాక్‌’ చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు – హైద్రాబాద్‌ హైకోర్టు విభజన విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. అసలు, అది తమకు సంబంధించిన విషయమే కాదన్నట్లు మీడియా ముందుకొచ్చి ఏవేవో చెప్పేశారు కేంద్ర న్యాయ శాఖ…

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు – హైద్రాబాద్‌ హైకోర్టు విభజన విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. అసలు, అది తమకు సంబంధించిన విషయమే కాదన్నట్లు మీడియా ముందుకొచ్చి ఏవేవో చెప్పేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు ఏర్పాటవ్వాల్సి వుంది. ప్రస్తుత హైకోర్టు తెలంగాణలో వుంది గనుక, ఆంధ్రప్రదేశ్‌లో ఆ రాష్ట్రానికి కొత్త హైకోర్టు ఏర్పడాలి. అంతా సజావుగా జరిగితే వివాదమేంది.? 

పదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు హైద్రాబాద్‌ ఉమ్మడి రాజధాని గనుక, హైకోర్టుని కూడా ఉమ్మడి హైకోర్టుగా మార్చేశారు. 'హైద్రాబాద్‌ హైకోర్ట్‌ – ఫర్‌ ది స్టేట్స్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రప్రదేశ్‌'గా ఉమ్మడి హైకోర్టుకి నామకరణం చేసిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ఎంత అడ్డగోలుగా తయారైందో చెప్పడానికి, ఇదొక ఉదాహరణ మాత్రమే. విభజన చట్టం అంతా తాను రాయించినదేనని చెప్పుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, హైకోర్టు వివాదంలో మాత్రం గుస్సా అవుతుంటారు. అదో పెద్ద కామెడీ. 

అధికార పక్షం ఏదన్నా విషయంలో ఇరుక్కుపోయినప్పుడు, ఇలాంటి వివాదాలు అనూహ్యంగా తెరపైకొస్తుంటాయి. తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌, మల్లన్నసాగర్‌ వివాదాన్ని తెరపైకి తెచ్చింది మొదలు, తెలంగాణలో విపక్షాలు చెలరేగిపోతున్నాయి. అది అధికార పార్టీకి సంకటంగా మారింది. చిత్రంగా ఈ టైమ్‌లోనే హైకోర్టు విభజన అంశం వివాదాస్పదమయ్యింది. అంతా యాదృశ్చిక్కమే అనుకోవాలా.? 

ఇక, కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ హైకోర్టు విభజనపై స్పష్టత ఇచ్చేశారు. ఆ స్పష్టత ఏంటంటే, హైకోర్టు విభజనలో తమ జోక్యం ప్రస్తుతానికి ఏమీ వుండబోదని. విభజనకు సంబంధించి పిల్‌ దాఖలయ్యిందనీ, అది విచారణ దశలో వుందనీ, తాము కూడా హైకోర్టుకు సమాధానం చెప్పామనీ, ఈ పరిస్థితుల్లో తాను ఏం మాట్లాడినా అది సబబుగా వుండదనీ, న్యాయశాఖ మంత్రిగా తాను ఆ పని చేయలేననీ సెలవిచ్చారు సదానంద. వారెవ్వా, అదిరిందయ్యా సదానందా.! 

ఇంకోపక్క, కేసీఆర్‌ని విభజన చట్టం చదువుకోవాల్సిందిగా సదానంద ఉచిత సలహా ఇచ్చేశారు. అందులో వున్న విషయమేంటంటే, ఆంధ్రప్రదేశ్‌ సొంతంగా హైకోర్టు ఏర్పాటు చేసుకునేదాకా ప్రస్తుత హైద్రాబాద్‌ హైకోర్టు, ఇరు రాష్ట్రాలకీ సేవలు అందించాలి. సో, తెలంగాణ అరిచి గీ పెట్టినా విభజన చట్టం ప్రకారం, హైకోర్టు విభజన జరగదుగాక జరగదు, ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటయ్యేదాకా. 

చివరగా సదానంద ఇంకో పంచ్‌ వేశారండోయ్‌. చిన్న విషయానికీ పెద్ద విషయానికీ కేంద్రంపై నోరు పారేసుకోవడం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి అలవాటేననీ, ఢిల్లీలో ఆయన ధర్నాలు చేస్తుంటారనీ, అలాగే కేసీఆర్‌ కూడా ధర్నాలు చేయాలనుకుంటే స్వాగతిస్తామనీ, తాము చెప్పాల్సిన సమాధానం చెబుతామనీ చెప్పారాయన. 

అన్నట్టు, తెలంగాణలో న్యాయవాదుల పోరాటం ఉధృతరూపం దాల్చుతోంది. పోలీసులకీ, న్యాయవాదులకీ మధ్య యుద్ధ వాతావరణం చోటుచేసుకుంటోంది. ఇదే ఉమ్మడి రాష్ట్రంలో అయితే, సీమాంధ్ర పాలకులు తమ లాయర్లపై లాఠీలు ఝులిపిస్తున్నారని ఇదే కేసీఆర్‌ గగ్గోలు పెట్టేవారు. ఇప్పుడా ఛాన్స్‌ ఆయనకు లేదు మరి. ఇప్పటికే ఇద్దరు జడ్జీలను హైకోర్టు సస్పెండ్‌ చేయగా, ఈ రోజు మరో ముగ్గురు జడ్జీలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ప్రవర్తనా నియావళిని ఉల్లంఘించి ఘలాటా చేస్తున్నారన్నది ఆ న్యాయమూర్తులపై ఆరోపణ. అదే సమయంలో, హైకోర్టు విభజన కోరుతూ ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు కొందరు న్యాయవాదులు. 

మొత్తమ్మీద, హైకోర్టు విభజన అంశం రోజురోజుకీ ముదిరి పాకాన పడ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఇప్పట్లో ఏర్పాటయ్యేలా కనిపించడంలేదు. విభజన చట్టం ప్రకారం ఇప్పట్లో హైద్రాబాద్‌ హైకోర్టు విభజన జరిగేలా లేదు. తెలంగాణలో న్యాయవాదులు ఆందోళన విరమించేలా లేరు. కేంద్రం కల్పించుకునే అవకాశమూ కన్పించడంలేదు. మరి, ఈ సమస్యకు పరిష్కారమేదీ.?