భారత హాకీ జట్టు, భారత హాకీ అభిమానులకు.. అదిరిపోయే దివాళీ గిఫ్ట్ ఇచ్చింది. దాయాదిపైన బంపర్ విక్టరీతో, ఆసియా కప్ హాకీ ఛాంపియన్స్ టైటిల్‌ని గెల్చుకుంది. ఇంకేముంది, ఇది నరకాసుర వధ.. అంటూ 125 కోట్ల మంది భారతీయులు సంబరాల్లో మునిగి తేలారు. దీపావళి సంబరాలకు తోడు, హాకీలో భారత జట్టు జయకేతనంతో సంబరాలు మరింతగా మిన్నంటాయి.
చిత్రమైన విషయమేంటంటే లీగ్ దశలోనూ పాకిస్తాన్, టీమిండియా చేతిలో పరాజయం పాలయ్యింది. దాంతో పాకిస్తాన్ హాకీ అభిమానులు, ఫైనల్‌లో టీమిండియాపై తమ జట్టు గెలుస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ, దురదృష్టం పాకిస్తాన్‌నే వెంటాడింది. ఈ టోర్నీలో మంచి దూకుడు మీదున్న టీమిండియా.. ఫైనల్‌లోనూ పాకిస్తాన్‌ని చిత్తు చేయడం గమనార్హం.
మొదటి, రెండో గోల్ టీమిండియా ఖాతాలోనే పడ్డాయి. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా ఆ జట్టు రెండు గోల్స్ చేసింది. దాంతో రెండు జట్ల స్కోర్లూ సమం అయ్యాయి. 51వ నిమిషంలో భారత జట్టు గోల్ సాధిచడంతో ఆధిక్యంలోకి వెళ్ళింది భారత్. ఇక, ఆ తర్వాత ఎలాంటి అవకాశం ఇవ్వలేదు భారత ఆటగాళ్ళు, పాకిస్తాన్ ఆటగాళ్ళకి. ఓవరాల్‌గా టీమిండియా అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించింది. పాకిస్తాన్ జట్టు సైతం సర్వశక్తులు ఒడ్డినా, భారత్ ముందు ఓటమి చవిచూడక తప్పలేదు.
ఓ పక్క భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న దశలో, క్రికెట్ సహా అనేక క్రీడల్లో పాకిస్తాన్‌తో భారత్ సంబంధాలు తెంచుకున్న వేళ, పాకిస్తాన్‌పై భారత్ సాధించిన ఈ విజయం నిజంగానే అపురూపమైనది.