ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో 'ప్రత్యేక హోదా' అనేది అర్థంకాని బ్రహ్మపదార్థంలా తయారైంది. ఫిలాసఫీ (తత్వశాస్త్రం) సామాన్యులకే కాదు, కొందరు పండితులకూ అర్థంకాదు. అర్థంకాని సబ్జెక్టును ఫిలాసఫీ అంటాం. ప్రత్యేక హోదా కూడా ఓ ఫిలాసఫీలా మారింది. ఇందులో జవాబు దొరకని అనేక ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకు మోదీ, బాబు ఎలాగూ జవాబులు చెప్పరు. చివరకు వారి అనుకూల మీడియాకూ అయోమయంగానే ఉన్నట్లుంది.
'ఆంధ్రజ్యోతి' అధినేత వేమూరి రాధాకృష్ణ రాసిన తాజా 'కొత్త పలుకు'లో కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉన్నాయి. ఈ వారం కొత్త పలుకు సారాంశం సింపుల్‌గా చెప్పాలంటే ఏపీ ప్రజలకు రాధాకృష్ణ ఇచ్చిన అమూల్యమైన సందేశం. మరోలా చెప్పాలంటే హితోక్తి. ఏమిటది? 'కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తీసుకోండి. ప్రత్యేక హోదా కోసం గొడవ చేస్తే మీరే నష్టపోతారు. ఆ తరువాత మీ ఇష్టం'..ఇదీ ఆయన చెప్పిన విషయం.
సాధారణంగా మన ఇళ్లలో పెద్దవారు పిల్లలకు ఫలాన వాళ్లతో అనవసరంగా గొడవ పెట్టుకోవద్దని, చూసీచూడనట్లు పొమ్మని, వాళ్లు ఏమైనా అన్నా పట్టించుకోవద్దని చెబుతుంటారు. ఆ ఫలాన వాళ్లతో తమ పిల్లలు గొడవపడితే తమవాళ్లకే హాని జరుగుతుందనే భయం. రాధాకృష్ణ కూడా ఇలాగే చెప్పారు. 'మోదీ మనస్తత్వం తెలిసినవారెవ్వరూ ఆయనతో సున్నం పెట్టుకోవాలని సూచించరు' అన్నారు. మోదీ చాలా మొండోడు, బలవంతుడని చెప్పడమన్నమాట.
ఈ సంగతి తెలిసిన చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరించారని, దీంతో ఏపీకి మేలు జరిగిందని వేమూరి సెలవిచ్చారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలకు జవాబు కావల్సివుంది.
'వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదా పొందే అర్హతలు లేవు. ఈ విషయాన్ని నేను గతంలోనే స్పష్టం చేశాను' అని రాశారు. నిజమే. 'హోదా' నిబంధనల ప్రకారం ఏపీకి అర్హత లేదు. అలాంటప్పుడు ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటులో యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎందుకు ప్రకటించారు? 'ఐదేళ్లు కాదు..పదేళ్లు కావాలి' అంటూ అప్పటి ప్రతిపక్ష నేత వెంకయ్య నాయుడు ఎందుకు పట్టుబట్టారు? హోదా విషయం విభజన చట్టంలో లేకపోయినా తాము అమలు చేసి తీరుతామని ఎందుకు చెప్పారు? ఇదే విషయం ఎన్నికల ప్రచారంలో మోదీ, వెంకయ్య, బాబు ఎందుకు చెప్పారు? హోదా పదేళ్లు కూడా కాదు, పదిహేనేళ్లు ఇవ్వాలని బాబు ఎందుకు డిమాండ్ చేశారు? మోదీ అధికారంలోకి వచ్చాక కూడా చాలాకాలంపాటు 'హోదా ఇస్తాం..ఇస్తాం' అని ఎందుకు ఊరించారు? 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని' అని చంద్రబాబు ఎందుకు అన్నారు? కొంతకాలం తరువాత హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎందుకు నిర్థారించారు?…ఈ ప్రశ్నలన్నింటికీ సామాన్యులకు అర్థమయ్యేలా పాలకులు, వారి అనుకూల మీడియా జవాబులు చెప్పాలి.
ప్రత్యేక హోదా పొందిన ఏ రాష్ట్రమూ అభివృద్ధి చెందలేదంటున్నారు. అలాంటప్పుడు హోదా అనే కాన్సెప్టు ఎందుకు పుట్టింది? ప్రత్యేక హోదా పొందిన ఉత్తరాఖండ్‌లో రాయితీల కోసం బోగస్ కంపెనీలు పెట్టారని, తెలుగోళ్లు కూడా ఈ పనిచేశారని వేమూరి రాశారు. ఏపీకి హోదా ఇస్తే నిజమైన కంపెనీలు రావని చెప్పడం ఆయన ఉద్దేశం. 'కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే ఇప్పుడైనా ఇవ్వొచ్చని, అలా ఇచ్చినా కూడా ఉపయోగం ఏమీ ఉండకపోవచ్చని 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా పనిచేసిన వేణుగోపాలరెడ్డి స్పష్టం చేశారు' అని వేమూరి రాశారు. అంటే హోదా వేస్ట్ అనే కదా. ఆయన ఇదే వ్యాసంలో మరో చోట 'ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ఒత్తిడికి కేంద్రం తలొగ్గితే పలు ఇతర రాష్ట్రాలూ ప్రత్యేక హోదా కావాలని పట్టుబడతాయి. ఆ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి'..అని చెప్పారు వేమూరి.
ఈ వైరుధ్యమేమిటి? అసలు ఎందుకూ పనికిరాదన్న ప్రత్యేక హోదా కోసం ఇతర రాష్ట్రాలు ఎందుకు పట్టుబడతాయి? హోదా వృథా అనే విషయం ఆ రాష్ట్రాలకు తెలియదా? హోదాపై పాలకుల్లోగాని, మీడియాలోగాని ఎందుకు స్పష్టత లేదు? 2014లో రాష్ట్రం విడిపోయిన బాధలో ఉన్న ఏపీ ప్రజలను సంతోషపెట్టేందుకు, వారిలో భరోసా కల్పించేందుకు కాంగ్రెసు, బీజేపీ, టీడీపీ నాయకులంతా కలిసి వారిని మభ్యపెట్టారు. రాని ప్రత్యేక హోదా వస్తుందని నమ్మబలికారు. బాధలో ఉన్నవారు సహజంగానే ఉపశమనం కోసం ఏం చెబితే అది నమ్మేస్తారు కదా. ఏపీ జనం అలాగే నమ్మారు. ఆ తరువాత నెమ్మదిగా మోదీ, అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు తమ ముసుగులు తీసి విశ్వరూపం చూపించారు.