వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం, మ్యారీడ్ లైఫ్ ను హ్యాపీగా సాగించడం మాటల్లో చెప్పినంత తేలికకాకపోవచ్చు! ప్రేమతో చేసుకున్న పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల విషయంలో అయినా ఆనందం అనేది ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఎలా? అనే ప్రశ్న అంత తేలికగా సమాధానం చెప్పేదీ కాదు! వాస్తవానికి ఇద్దరు మనుషులు కలిసి జీవించడమే తేలిక కాదు. అవసరార్థం కలిసి ఉండటం, స్నేహమో, ప్రేమో, పరస్పర అవగాహన.. ఇవన్నీ ఒక ఎత్తు. వివాహం మరో ఎత్తు!
ఎంత క్లిష్టమైనది అయినా.. వివాహం అనేది మనిషి ప్రాథమిక అవసరాల్లో ఒకటిగా ఉంది. మరో తోడు కోసం, కుటుంబం కోసం.. ఇలా మొదలుపెడితే, ప్రేమ, శృంగారం, ప్రిస్టేజ్.. ఇలా వివాహ వ్యవస్థ వర్థిల్లడానికి వందల కారణాలుంటాయి! ఇలా వివాహం అనివార్యమే అయినప్పటికీ.. వైవాహిక జీవితంలో మాత్రం ఆనందాన్ని వెదుక్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందమయం చేసుకోవడం గురించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూనే ఉండాలి మనిషి.
ఇలాంటి అవసరం లేకుండా కూడా ఆనందమయంగా వైవాహిక జీవితాన్ని సాగించే వాళ్లూ ఉండరని కాదు. అలాంటి వారు కూడా ఎంతో మంది ఉండవచ్చు. అయితే రోజులా మారడం, పరిస్థితులు మారిపోవడంతో.. వైవాహిక జీవితాన్ని సవ్యంగా ఉంచుకోవడానికి కూడా ప్రత్యేకంగా కసరత్తులు చేయక తప్పని పరిస్థితి. ఈ అంశం గురించి ఫ్యామిలీ కౌన్సెలర్లను ఆశ్రయించే వారూ లేకపోలేదు. మరి అలాంటి ఎక్స్ పర్ట్స్ సజెషన్స్ ఏమిటనేది చూస్తే..
సవ్యమైన కమ్యూనికేషన్!
ఎంత పెద్ద సమస్య అయినా కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతుందంటారు. దంపతుల మధ్యన కూడా అంతే! ఏ అంశం విషయంలో అయినా సైలెంట్ గా ఉండిపోవడం కంటే.. ఆ అంశం గురించి ఓపెన్ గా మాట్లాడుకోవడం, చర్చించుకోవడం ద్వారా దాన్ని పరిష్కరించుకోవచ్చు. మాట్లాడితే గొడవ జరగొచ్చు కూడా! గొడవ జరిగినా.. అందులోంచి కూడా ఒక పరిష్కారం వచ్చే అవకాశాలు చాలా వరకూ ఉంటాయి!
నో ఫోన్ పాలసీ!
ఈ రోజుల్లో ఫోన్ లేకుండా గంటైనా గడవడం కష్టమే. ఫోన్ అంటే మాట్లాడుకోవడానికే కాదు. స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు జనాలు. టీవీ కూడా అవసరం లేదు. జస్ట్ ఫోన్ ఉంటే చాలు. ఇలా జీవితాల్లోకి ఫోన్ పూర్తిగా చొరబడిపోయింది. ఇది సహజంగానే దంపతుల మధ్యన కూడా దూరాన్ని పెంచుతుంది. ఎంత కాదన్నా ఇది నిజం. అందుకే కనీసం రాత్రి ఎనిమిది తర్వాత అయినా నో ఫోన్ పాలసీని అమలు పరుచుకుంటే.. దగ్గరితనం పెరిగే అవకాశాలు మెరుగవ్వడం ఖాయం!
ప్రతి రోజూ ముద్దు!
రోజుకోసారి అయినా మీ పార్ట్ నర్ ను ముద్దు పెట్టుకోండి అనేది ఒక సలహా. ప్రత్యేకించి మగాడు చొరవ చూపాల్సిన అంశం ఇది. మీ లేడీని రోజుకోసారి ఏదో ఒక సందర్భంలో ముద్దు పెట్టి మురిపెంగా చూసుకుంటే ఆ ప్రేమ వ్యక్తీకరణ ద్వారా ఆమె మీ పట్ల చాలా సానుకూలంగా మారవచ్చు!
అభిప్రాయాన్ని తీసుకోవడం!
మగువలంటే మగాళ్లకు చులకన. ప్రత్యేకించి కొన్ని విషయాల్లో వారి అభిప్రాయాలను తీసుకోవడం చిన్నతనంగా భావిస్తాడు పురుషుడు. ఇది వారిని బాగా చిన్నబుచ్చుకునేలా చేస్తుంది. అయితే వీలైన సందర్భాల్లో అభిప్రాయాలను తీసుకోవడం చాలా మంచి పద్ధతి. ఆ అభిప్రాయంలో లోతుపాతులు వేరే సంగతి. అయితే ముఖ్యమైన అంశాల్లో ఆమె అభిప్రాయాన్ని కూడా అడగడం ఆమెకు ఉత్తేజాన్ని ఇస్తుంది.
చిన్న చిన్న ట్రిప్స్!
రొటీన్ జీవితం నుంచి బయటకు తీసుకురావడంలో చిన్న పాటి ట్రిప్ప్ లేదా సిటీ దాటలేని పరిస్థితుల్లో కనీసం ఏ రెస్టారెంట్ కో వెళ్లి భోంచేసి కాసేపు బయట తిరిగిరావడం పెద్ద రిలీఫ్. ఎలాంటి యాక్టివిటీస్ ను ప్లాన్ చేసుకోకుండా వెళ్లాల్సిన డేట్స్ ఇవి!
గ్రాటిట్యూడ్ ను ఎక్స్ ప్రెస్ చేయాలి!
పరస్పరం ఈ భావన ఉంటే ఆ దంపతుల మధ్యన ఎలాంటి సమస్యలూ ఉండకపోవచ్చు. పరస్పరం గ్రాటిట్యూడ్ ను ఎక్స్ ప్రెస్ చేసుకోవడమో లేదా కనీసం మనసులో ఆ భావన ఉన్నా చాలు.. మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగిపోవడానికి!