ఏపీలో చిన్న పార్టీ కానీ ఢిల్లీలో పెద్ద పార్టీ. దేశాన్ని ఏలే పార్టీ. అందుకే నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చినా బీజేపీ ఏపీలో బాగానే సౌండ్ చేస్తోంది. ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలు కూడా బీజేపీని ఏమీ అనకపోవడం, ఆ పార్టీతో చెలిమి కోసం వెంపర్లాడడం మరో అడ్వాంటేజ్.
దాంతో బీజేపీకి లేని ధైర్యం వచ్చేస్తోంది. అక్కడికి తానే ఏపీలో అతి పెద్ద పార్టీ అని కూడా భావిస్తోందేమో. వచ్చే ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లకు పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఉత్సాహంగా ప్రకటించేశారు. అసెంబ్లీ సీట్లు అన్నింటా మేమే పోటీకి దిగుతామని ఒక గొప్ప ప్రకటన చేశారు.
ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మీద బీజేపీ ఒక రోడ్డు మ్యాప్ సిద్ధం చేసిందని కూడా చెప్పారు. దాంతో ఏపీ అంతటా తిరిగి దున్నేస్తామని, జనాభిప్రాయం మాకే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ మీద కూడా విజన్ ఉందని, విశాఖను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తాము రెడీగా ఉన్నామని చెప్పారు.
విశాఖలో ఈ రోజు దాకా జరిగిన అభివృద్ధి అంతా కేంద్రానిదే అని జీవీఎల్ అంటున్నారు. ఉత్తరాంధ్రా సాగు నీటి ప్రాజెక్టుల మీద రాష్ట్రం శీతకన్ను వేసిందని, తాము పోరాటాలు చేసి అయినా న్యాయం జరిగేలా చూస్తామని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మొత్తం సీట్లకు బీజేపీ పోటీ చేస్తే మిత్ర పక్షం జనసేన సంగతేంటి అన్నది మాత్రం జీవీఎల్ చెప్పలేదు.
అంటే బీజేపీ సోలోగానే బరిలోకి దిగుతుందని కలరింగ్ ఇస్తున్నారా లేక ఎన్నికల నాటికి కూటమిగా వస్తారా అన్నది మాత్రం కమలనాధులు సస్పెన్స్ లోనే ఉంచేస్తున్నారు. అయితే ఏపీలో వైసీపీకి తామే అసలైన ఆల్టర్నేషన్ అని మాత్రం బీజేపీ పెద్దలు నిబ్బరంగా చెప్పుకుంటున్నారు.