ఆస్ట్రేలియా క్రికెటర్ హ్యూస్ మృతి పట్ల అతని స్నేహితుడు సీన్ అబోట్ కన్నీరు మున్నీరయ్యాడు. ‘నా చేతుల్తో నేనే చంపేసుకున్నాను నా స్నేహితుడ్ని..’ అంటూ సహచరుల వద్ద అబోట్ విలపిస్తోంటే, అతన్ని ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు.
మూడు రోజుల క్రితం జరిగిన దేశీయ మ్యాచ్‌లో భాగంగా బ్యాటింగ్ సైడ్‌లో ఫిలిప్ హ్యూస్ వుంటే, ఫాస్ట్ బౌలర్ సీన్ అబోట్ బౌలింగ్ సైడ్ వున్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులు. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో, అబోట్ విసిరిన బంతి, హ్యూస్ తలకు తాకింది. తల వెనుక చెవి కింది భాగంలో బంతి తగలడంతో, హ్యూస్ అక్కడే కుప్పకూలిపోయాడు.
క్రికెట్లో బ్యాట్స్‌మెన్‌కి బంతి తగలడం మామూలే గనుక, బౌలర్‌కి అసలు విషయం అర్థం కావడానికి కాస్సేపు పట్టింది. బంతి తగలగానే వెళ్ళి ‘సారీ’ చెప్పేశాడుగానీ, మిత్రుడు కిందపడి, చలనం లేని స్థితిలో వుండడంతో ఆందోళన చెందాడు అబోట్. చకచకా ప్రాథమిక చికిత్స అందించారు అక్కడే వున్న డాక్టర్లు. వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో హెలికాప్టర్ అంబులెన్స్‌ని రప్పించి, ఆసుపత్రికి తరలించారు.
కానీ, దురదృష్టం ఫిలిప్ హ్యూస్ని వెంటాడిరది. క్రికెట్లో ఘోర దుర్ఘటన నమోదయ్యింది. క్రికెట్ సంగతెలా వున్నా, అబోట్ని జీవితాంతం వెంటాడే తప్పు జరిగిపోయింది. ‘నీ తప్పేం లేదు.. అనుకోకుండా జరిగిందది..’ అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్‌లోని ప్రముఖులు అబోట్కి చెబుతున్నా.. స్నేహితుడిని కోల్పోయానని, తన వల్లే హ్యూస్ మరణించాడని బోరున విలపిస్తూనే వున్నాడు.