ఆస్ట్రేలియా క్రికెటర్‌ హ్యూస్‌ మృతి

ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్‌ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఓ దేశవాలీ క్రికెట్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బౌలర్‌ అబాట్‌ విసిరిన బంతి, వేగంగా హ్యూస్‌ తలకి తాకింది.…

ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్‌ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఓ దేశవాలీ క్రికెట్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బౌలర్‌ అబాట్‌ విసిరిన బంతి, వేగంగా హ్యూస్‌ తలకి తాకింది. దాంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు హ్యూస్‌. హుటాహుటిన అతనికి ప్రాధమిక చికిత్స చేసి, ప్రత్యేక హెలికాప్టర్‌తో ఆసుపత్రికి తరలించారు సహచరులు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న హ్యూజ్‌కి శస్త్ర చికిత్స కూడా జరిగింది. తాత్కాలికంగా కృత్రిమ కోమాలోకి పంపి వైద్యులు చికిత్స అందించారు. మృత్యువుతో మూడు రోజులపాటు పోరాడిన హ్యూస్‌, ఈ రోజు తుది శ్వాస విడిచాడు. హ్యూస్‌ మరణంతో ఒక్కసారిగా ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఒక్క ఆస్ట్రేలియానే కాదు, మొత్తం ప్రపంచ క్రికెట్‌ హ్యూస్‌ మరణ వార్తతో విలవిల్లాడిరది. మైదానంలో క్రికెటర్లకు గాయాలవడం సహజమేగానీ, ప్రాణం పోయేంత తీవ్రత గల గాయాలు తగలడం చాలా అరుదు. ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరగనున్న టెస్ట్‌ సిరీస్‌లో హ్యూస్‌ ఆడాల్సి వుంది. భారత బౌలింగ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొనగల అతికొద్దిమంది ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో హ్యూస్‌ ఒకడు. పాతికేళ్ళ హ్యూస్‌ మరణం అత్యంత దురదృష్టకరం.