ఎట్టకేలకు హైద్రాబాద్ మెట్రో రైలు కూతకు సిద్ధమయ్యింది. నిజానికి రెండున్నరేళ్ళ క్రితమే హైద్రాబాద్ మెట్రోరైల్ పరుగులు తీయాల్సి వున్నా, 'కొన్ని కారణాల వల్ల' అది ఆలస్యమయ్యింది. ఆ కారణాలేంటన్నవి జగమెరిగిన సత్యమే. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పనులు ప్రారంభం కాగా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తాలూకు సెగల నేపథ్యంలో 'మెట్రోరైలు' పనులు కొంత ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చీరాగానే మెట్రోరైలు ప్రారంభోత్సవం జరిగితే.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతుందని, కావాలనే తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ఆలస్యం చేసిందనే వాదనలూ లేకపోలేదు.
ఇక, చంద్రబాబు హయాంలోనే మెట్రోరైలుకి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నుంచి క్లియరెన్స్ వచ్చిందన్నది టీడీపీ వాదన. ఆ లెక్కన తెలంగాణ టీడీపీ నేతలు, మెట్రోరైల్ క్రెడిట్‌ని తమ ఖాతాలోకే వేసేసుకుంటున్నారు. ఇదిలా వుంటే, కాంగ్రెస్ పార్టీ ఆ ఘనతను తమ ఖాతాలో వేసేసుకుంటోందనుకోండి.. అది వేరే విషయం. నిజానికి, ముఖ్యమైన అనుమతులన్నీ హైద్రాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకి లభించింది కాంగ్రెస్ హయాంలోనే. అదీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడే.
టీడీపీ, కాంగ్రెస్‌తోపాటుగా వైఎస్సార్సీపీ సైతం 'క్రెడిట్'ని ఏరుకునే పనిలో బిజీగా వుంది. 'ప్రియతమనేత..' అంటూ హైద్రాబాద్ మెట్రోరైలు కోసం వైఎస్ పడ్డ కష్టం గురించి ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. ఇందులో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. కానీ, ఎవరు మొదలెట్టారు అన్నది రాజకీయాల్లో పెద్దగా ఇంపార్టెన్స్ దక్కించుకోదు. ఎవరి హయాంలో ప్రారంభమయ్యిందన్నదాన్నిబట్టే 'క్రెడిట్' ఆధారపడి వుంటుందన్నమాట.
పోలవరం ప్రాజెక్ట్ ఎఫ్పుడు ఎవరి హయాంలో ప్రారంభమయ్యింది.? వైఎస్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఆ పనులు చంద్రబాబు హయాంలో వేగం పుంజుకున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగా ఆ ప్రాజెక్ట్ పూర్తయితే సరే సరి.. లేకపోతే, 'ఆ ఘనత నాదే..' అని చంద్రబాబు చెప్పుకోవడం తప్ప, అది ఆయన ఖాతాఓలకి వెళ్ళదు. వైఎస్ ప్రారంభించిన చాలా ప్రాజెక్టుల తాలూకు క్రెడిట్‌ని చంద్రబాబు తన ఖాతాలో వేసేసుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.?
రాజకీయాల్లో ఈ 'క్రెడిట్' వ్యవహారాలు ఇలాగే వుంటాయి. సో, ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. మెట్రోరైల్ ప్రాజెక్ట్ ఘనత టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. 'మేం వచ్చాకనే పనులు వేగం పుంజుకున్నాయ్..' అని గులాబీ దండు అప్పుడే ప్రచారం షురూ చేసేసింది. కానీ, ఎప్పుడో సిద్ధమైపోయిన ప్రాజెక్ట్‌ని 'రాజకీయ వ్యూహాలతో' ఆలస్యం చేసిన టీఆర్ఎస్, ఆ ఖాతాని తన ఖాతాలో వేసుకోవడానికి పడ్తున్న పాట్లు మాత్రం హాస్యాస్పదం అవుతున్నాయి.