పవన్ సినిమాపై ముప్పేటదాడి

పవన్, బాలయ్య, సూర్య, విశాల్, రాజ్ తరుణ్ ఇలా సంక్రాంతికి ముస్తాబయిపోతున్న హీరోల జాబితా రోజు రోజుకూ పెరిగిపోతోంది. పవన్ కళ్యాణ్ సినిమా దగ్గర నుంచి రాజ్ తరుణ్ సినిమా వరకు అన్నీ సంక్రాంతి…

పవన్, బాలయ్య, సూర్య, విశాల్, రాజ్ తరుణ్ ఇలా సంక్రాంతికి ముస్తాబయిపోతున్న హీరోల జాబితా రోజు రోజుకూ పెరిగిపోతోంది. పవన్ కళ్యాణ్ సినిమా దగ్గర నుంచి రాజ్ తరుణ్ సినిమా వరకు అన్నీ సంక్రాంతి పండుగ హడావుడి మీద, సెలవుల మీద కన్నేసాయి. సెలవులు, పండగ సంగతి అలా వుంచితే థియేటర్లు ఎక్కడి నుంచి వస్తాయి? 

10న అజ్ఖాతవాసికి 100శాతం థియేటర్లు దొరుకుతాయి. అందులో సందేహం లేదు. కానీ రెండు రోజుల్లోనే జై సింహా సినిమా వస్తోంది. దాని కోసం కనీసం పాతిక శాతం థియేటర్లు అన్న ఖాళీ చేయాలి. ఈ సినిమాను నైజాంలో ఆసియన్ సునీల్ విడుదల చేస్తున్నారు. నైజాంలో మేజర్ థియేటర్లు అన్నీ ఆసియన్ చేతిలోనే వున్నాయి. అందువల్ల అజ్ఞాతవాసిని కొన్ని థియేటర్ల నుంచి అయినా లేపక తప్పదు. 

కానీ ఆ వెంటనే సూర్య సినిమా గ్యాంగ్ వస్తోంది. థియేటర్లు ఇవ్వకుండా వుండేందుకు వీలు లేదు. ఎందుకంటే ఈ సినిమాను తెలుగులోకి యువి సంస్థ తెస్తోంది. ఈ సంస్థకు ఆంధ్ర, సీడెడ్ లో థియేటర్లు ఎన్నో కొన్ని వున్నాయి. పైగా ఈ సంస్థకు గీతా, దిల్ రాజులతో వ్యాపార బంధాలు వున్నాయి. అందువల్ల అజ్ఞాతవాసి మరి కొన్ని థియేటర్లు వదులుకోవాలి.

ఇవి కాక విశాల్ అభిమన్యుడు..రాజ్ తరుణ్ రంగులరాట్నం వున్నాయి. వాటికి థియేటర్లు ఎవరు ఇస్తారో చూడాలి. పండుగ బరిలో దిగాలనుకున్న రాజ్ తరుణ్ మరో సినిమా రాజూగాడు బరిలోంచి తప్పుకుని, రిపబ్లిక్ డే టైమ్ కు వాయిదా పడింది. 

సంక్రాంతి పోటీ వల్ల సమస్య అనేది ఎవరికి అంటే కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకే. సూర్య, విశాల్ సినిమాలు తెలుగులో విడుదల అన్నది మార్కెట్ కీపప్ చేసుకోవడం కోసం తప్ప వేరు కాదు. బాలయ్య సినిమా బడ్జెట్ మరీ ఎక్కువగా లేదా తక్కువగా వుండదు. అందువల్ల సమస్య పెద్దగా రాదు. రాజ్ తరుణ్ సినిమా చిన్న సినిమా. 

కానీ అజ్ఞాతవాసి వ్యవహారం అలా కాదు. 100కోట్ల మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వసూళ్లు రాబట్టాలి. అలా రాబట్టాలంటే, కనీసం రెండు వారాలు ఫూర్తి స్థాయిలో థియేటర్లను తెచ్చుకుని, ఫుల్ రన్ కావాల్సి వుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించడం లేదు. థియేటర్ల అగ్రిమెంట్ల దగ్గరే ఏ సంగతీ తెలిసిపోతుంది. యువి, గీతా, ఆసియన్ థియేటర్లు ఫుల్ రన్ కు అగ్రిమెంట్ చేస్తారా అన్నది చూడాలి.

వీటన్నింటికి తోడు సినిమాల హిట్ అన్నింటికి మించి కీలకమైన వ్యవహారం. మరి సంక్రాంతి సినిమాలు నిర్మాతలను ఏం చేస్తాయో చూడాలి.