బాలయ్య సినిమాకూ తప్పలేదు

అన్ని ఏరియాల అందు నైజాం వేరయా అన్నది టాలీవుడ్ లెక్క. ఎప్పటి నుంచో తెలంగాణ ఏరియా మొత్తం నైజాం ఏరియాగా ఒకే డిస్ట్రిబ్యూటర్ కు అమ్మడం అన్నది వస్తోంది. ఆంధ్ర అంతా జిల్లాలు, ప్రాంతాల…

అన్ని ఏరియాల అందు నైజాం వేరయా అన్నది టాలీవుడ్ లెక్క. ఎప్పటి నుంచో తెలంగాణ ఏరియా మొత్తం నైజాం ఏరియాగా ఒకే డిస్ట్రిబ్యూటర్ కు అమ్మడం అన్నది వస్తోంది. ఆంధ్ర అంతా జిల్లాలు, ప్రాంతాల వారీ విడిపోయింది కానీ, నైజాం అలాకాదు. సింగిల్ డిస్ట్రిబ్యూటర్ ఏలుబడిలోనే వుంటూ వస్తోంది. ఆంధ్ర హీరోలకు కూడా నైజాం ఏరియా అంటే మొదట్నించీ భలే ఇష్టం. చాలామంది హీరోలు తమ రెమ్యూనిరేషన్ కింద నైజాం హక్కులు వుంచుకున్న రోజులు వున్నాయి. 

అలాంటి నైజాం ఏరియా ఇప్పుడు తెలుగు సినిమాకు కొరుకుడు పడడంలేదు. ఇక్కడ రాను రాను డిస్ట్రిబ్యూటర్లు కరువైపోయి, ఆఖరికి ఇద్దరే ఇద్దరు మిగిలారు. దిల్ రాజు, ఆసియన్ సునీల్. ఈ ఇద్దరు పైకి పోటీ దారులుగా వున్నా, లోలోపల ఏకమాటే అన్న గుసగుసలు వున్నాయి. దాంతో వీరు ఎలా అంటే అలా. కొనాలంటే కొంటారు. లేదూ అంటే లేదు. వీళ్లను కాదని ఏ నిర్మాతా చేయగలిగిందీ లేదు. 

ఈ ఇద్దరిలో ఆసియన్ సునీల్ కు నైజాంలో మూడు వంతులకు పైగా థియేటర్లు వున్నాయి. కానీ ఆయన సినిమాలు కొనరు. కేవలం అడ్వాన్స్ ల మీద తీసుకుని, ఆడిస్తారు. రేటు కట్టి, అడ్వాన్స్ ఇచ్చి, మరీ అవసరం అయితే ఎంజీ చేసుకుంటారు. ఇక దిల్ రాజు చకచకా సినిమాలు కొనేవారు కానీ కొన్ని సినిమాల విషయంలో దారుణంగా దెబ్బతిన్నారు. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇప్పుడు 40కోట్ల మేరకు నష్టాల్లో వుందని తెలుస్తోంది. దీంతో ఆయనా కొనడం తగ్గించారు.

ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా నైజాంలో ఈ ఇద్దరు డిస్ట్రిబ్యూటర్ల దయపైనే ఆధారపడి వుంది. ఒకవేళ వేరుగా ఎవరైనా కొన్నా థియేటర్లు ఇవ్వాల్సింది మళ్లీ వీరే. అందువల్ల ఎవ్వరూ కొత్తగా రంగ ప్రవేశం చేయడంలేదు. అదీ పరిస్థితి

పండగకు బాలయ్య-కెఎస్ రవికుమార్ సినిమా విడుదలవుతోంది. మిగిలిన ఏరియాలు బిజినెస్ చేస్తున్నా, నైజాం మాత్రం సునీల్ ద్వారా విడుదల చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అమ్మడం అన్నది లేదు. అడ్వాన్స్ మీద సినిమాను చేతిలో పెట్టడమే. పవన్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ లాంటి క్రేజీ హీరోల ప్రాజెక్టులు తప్ప మరే ప్రాజెక్టు అయినా నైజాంలో నో కొనుగోళ్లు.. ఓన్లీ రిలీజ్.