రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సినీనిర్మాణ కంపెనీ వార్నర్ బ్రదర్స్ వారి పబ్లిసిటీ డిపార్టుమెంటులో కామెరాన్ షిప్ అనే అతను పనిచేసేవాడు. తన కంపెనీ నిర్మిస్తున్న సినిమాల గురించి, వాటిలో నటిస్తున్న తారల గురించి ఆసక్తికరమైన కథనాలు రాసి, మ్యాగజైన్లలో ప్రచురింప చేయడం, రేడియోలో ప్రసారం చేయించడం అతని పని. దేశం యుద్ధంలో మునిగి ఉంది కాబట్టి సినిమా పబ్లిసిస్టుల గిల్డ్ తమ తరఫున యుద్ధసహాయ నిధి సేకరించడం, సైన్యంలో చేరమని యువతను ప్రోత్సహించడం యిత్యాది పనులు చేసేది. ఆ గిల్డ్‌కు యితను చైర్మన్‌గా ఎన్నుకోబడ్డాడు. ఇది యిలా నడుస్తూండగానే అతని పనితీరు నచ్చి కంపెనీవారు అతనికి ప్రమోషన్ యిచ్చారు. ఇద్దరు సెక్రటరీలు, 75 మంది రచయితలు, మ్యాగజైన్, రేడియో కళాకారులు, వీళ్లందరూ ఉండడానికి సకల హంగులతో ప్రత్యేకమైన ఆఫీసు.. యిలా అన్నీ ఏర్పడ్డాయి. కంపెనీవారి పబ్లిక్ రిలేషన్స్ విభాగమంతా తన భుజస్కంధాలపైనే నడుస్తోందని అనుకుంటూ అతను వెర్రిగా పనిచేయసాగాడు. నెల గడిచేసరికి అతనికి కడుపులో మంట ప్రారంభమైంది. పైగా కడుపు నొప్పి. మీటింగుల్లో కూర్చోలేక పోతున్నాడు. కారు డ్రైవ్ చేస్తూండగా నాభి నుంచి గొంతుదాకా మండిపోయి, కాస్సేపు ఆగాల్సి వస్తోంది. వేళకు సరిగ్గా తినటం లేదు కాబట్టి అల్సరు వచ్చిందా? అది కాన్సర్‌కు దారి తీస్తుందా? అనే భయం వేసింది.
డాక్టరు దగ్గరకు వెళితే ఏం చెపుతాడో? ఏమో, ఎందుకొచ్చింది, వేళకు తింటే సరిపోతుందిగా అనుకుని టైముకి తినసాగడు. కానీ మంట తగ్గలేదు, పైగా రాత్రుళ్లు నిద్ర పట్టడం మానేసింది. బరువు తగ్గిపోసాగాడు. చివరకు యాడ్ రంగం వాళ్లు ఎక్కువగా వెళ్లే డాక్టరు దగ్గరకి వెళ్లాడు. ఆయన కొన్ని ప్రశ్నలడిగి, తర్వాత రకరకాల పరీక్షలు చేయించాడు. అన్నీ పూర్తయేసరికి రెండు వారాలు పట్టింది. ఆ తర్వాత కూర్చోబెట్టి ''నీ కడుపులో ఉన్నది పుండు కాదు, వర్రీ. నిన్ను పరీక్షించగానే నాకా విషయం తెలిసిపోయింది. కానీ ఆధారాలు లేకపోతే నమ్మవని యీ టెస్టులన్నీ చేయించాను. డబ్బు ఖర్చయితే ఐంది కానీ నీకు జ్ఞానోదయం ఐంది. చింతించడం మానేయ్, ఆటోమెటిగ్గా నొప్పులు, మంటలూ అన్నీ తగ్గిపోతాయి. కానీ యిది చెప్పినంత సులభం కాదు. నువ్వు ఆ స్థితికి వచ్చేవరకూ బండి నడవడానికి నిద్రమాత్రలు యిస్తున్నాను. అయిపోయాక మళ్లీ యిస్తా కానీ ఫీజు రెట్టింపు తీసుకుంటాను. మాత్రలు మానేసేవరకూ నీకీ శిక్ష తప్పదు.'' అన్నాడు. కామెరాన్ సిగ్గుపడ్డాడు – మంచి యవ్వనంలో దృఢంగా ఉన్నాను. నే మందులు తీసుకోవడవేమిటి? అని. కానీ మాత్రలు వాడడం, డాక్టరు దగ్గరకి వెళ్లి మళ్లీ చీటీ రాయించుకోవడం తప్పలేదు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికి, మనం జాగ్రత్తగా ఆలోచించి ఆ వర్రీ ఏదో తగ్గించుకోవాలి కానీ యిలా మాత్రలతో, రెట్టింపు ఫీజులతో ఎన్నాళ్లు నెట్టుకు వస్తాం అనుకున్నాడు. ఆలోచించగా ఆలోచించగా తన గురించి తాను ఉన్నదాని కంటె ఎక్కువగా ఊహించు కుంటున్నానేమోనని తోచింది.
'నా కోడీ కుంపటీ' కథలో ఒక ఊళ్లో ఓ ముసలమ్మ వద్ద ఉన్న కోడి తెల్లవారు ఝామునే కూయగానే ఊరంతా లేచేవారు. ఈవిడ దగ్గరున్న కుంపటి దగ్గరకు వచ్చి చలి కాచుకునేవారు. ఇలా ఏళ్లతరబడి జరగడంతో ముసలావిడకు అనిపించసాగింది – నా కోడీ కుంపటీ లేకపోతే యీ ఊళ్లో తెల్లవారదు, ఎవడూ నిద్రలేవడు, చలి కాచుకోడు అని. ఓ సారి ఊరి మీద అలిగి, తన కోడీ కుంపటీ పట్టుకుని పొరుగూరు వెళ్లిపోయింది. మధ్యాహ్నం తన వూరి నుంచి వస్తున్నవాళ్లని ఆపి, ''నా కోడికూత లేకుండానే అందరూ ఎలా లేచారు?'' అనడిగింది. అతడు నవ్వి వెళ్లిపోయేసరికి, ఆమెకు అర్థమై పోయింది. లోకం నా చుట్టూ తిరగటం లేదు. నే ఉన్నా లేకపోయినా కాలచక్రం ఆగదు అని. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు – నువ్వు నిమిత్తమాత్రుడివి, మీ బంధుగణాన్ని నువ్వు కాకపోతే వేరే వాడు చంపుతాడు, ..అఫ్కోర్స్ ఆ వేరేవాడు నేనే అనుకో, నీ ధర్మం నువ్వు చేయి. అదే పదివేలు అని. మనమందరమూ అర్జునుళ్లమే, భూభారమంతా మనమే మోసేస్తున్న ఫీలింగుతో బాధపడుతూంటాం. అంత సీనేం లేదు.
'నేను కాబట్టి నిన్ను భరిస్తున్నాను. నేనంటూ లేకపోతే ఎవర్ని పెళ్లాడుదువు?' అని అడిగిందట ఒకామె. నువ్వు కాకపోతే మీ అమ్మని పెళ్లాడేవాణ్ని అన్నాడట భర్త. అంతేకదా, ఎవరో ఒకరు. ఈవిడ పుట్టలేదు కదాని పెళ్లి మానేయడు కదా. నేను కాబట్టి యీ పని చేయగలుగుతున్నాను అనుకోవడం తప్పు. నువ్వు కాకపోతే యింకోడు చేస్తాడు. నువ్వు యీ క్షణం భూమినుంచి చోటు ఖాళీ చేసినా భూభ్రమణం ఆగదు. మరోడు వచ్చి ఖాళీ పూరిస్తాడు. 'ఏ జిందగీ కే మేలే, దునియా మేఁ కమ్ న హోంగే, ఆఫ్సోస్ హమ్ న హోంగే' అని పాత హిందీ పాట. నువ్వెళ్లిపోయినా ఈ లోకంలో జీవితపు వేడుకలు ఆగవు, ఖర్మేమిటంటే నువ్వు మాత్రం ఉండవు అంటాడు కవి. మనం పోయాక కూడా లోకం హుషారుగా ఉంటుందని అలగవద్దు. నువ్వు మీ అమ్మమ్మ దగ్గర పెరిగావు, ఆవిడ చచ్చిపోయినపుడు ఎంతో ఏడ్చావ్, బెంగ పెట్టుకున్నావ్.. ఎంతకాలం? వారం? తర్వాత మామూలుగా బడికి వెళ్లావుగా! అమ్మానాన్నా పోయారు, శోకసముద్రంలో మునిగావ్. నెల? రెణ్నెళ్లు? మళ్లీ రొటీన్లో పడ్డావుగా! భర్త పోయాడు, ఆవిడ జీవచ్ఛవంలా అయిపోయింది, ఎన్నాళ్లు? ఏడాది!? తర్వాత సాధారణ జీవితంలో పడిందిగా. రేపు నువ్వు పోయినా నీ భార్యాబిడ్డలంతే. మహా అయితే యితరుల కంటె ఎక్కువకాలం బాధపడవచ్చు. కానీ బాధ్యతలు, లోకవ్యవహారాలు రొటీన్లో పడేట్లు చేస్తాయి. అలాగే ఉద్యోగం. నువ్వు పోయావు కదాని కంపెనీకి తాళం వేసేయరు. నీ అంతటి సమర్థుడు దొరక్కపోతే నీకిచ్చేదానిలో సగంసగం జీతం యిచ్చి యిద్దర్ని పెట్టుకుంటారు. 'తూ నహీ, ఔర్ సహీ' అంటారు హిందీ వాళ్లు. 'సోమరాజో కామరాజో' అంటుంది ''ముత్యాలముగ్గు''లో హలం. లోకం నిన్ను త్వరగానే మర్చిపోతుంది. అందుకే 'ఇవాళ ఛస్తే రేపటికి రెండు..' అనే సామెత పుట్టింది. ఇటీజ్ జస్ట్ ఏ నెంబర్. 'కారే రాజుల్?' అని అడిగాడు పోతన. ఎంతోమంది మహారాజులు, చక్రవర్తులు పుట్టారు, గిట్టారు. వాళ్ల గురించి 'కింగ్ ఈజ్ డెడ్..'' అంటూనే అదే గుక్కలో తర్వాతి రాజు గురించి ''..లాంగ్ లివ్ ద కింగ్'' అన్నారు. ఇంతోటి నువ్వు లేవని నీ ఆఫీసు కూలిపోతుందా?
సరిగ్గా యివే ఉపమానాలతో కాదు కానీ, యిలాటి ధోరణిలో ఆలోచించాక అతనికి తట్టింది – తను ఊరికే యిదవుతున్నానని. 'ఈ బెట్టీ డేవిస్, జేమ్స్ కాగ్నీ నువ్వు కంపెనీలోకి రాని క్రితం నుంచి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తారలు. నువ్వు వ్యాసాలు రాయడం మానేసినంత మాత్రాన వాళ్ల డిమాండు తగ్గదు. వార్నర్ బ్రదర్స్ ఏనాటి కంపెనీ! నువ్వు చేసే పబ్లిసిటీ మీదే కంపెనీ నడుస్తోందనుకోకు. అది తీసే సినిమాల క్వాలిటీ బాగా లేకపోతే నీ పబ్లిసిటీ అంతా గంగపాలే. నా కారణంగానే కంపెనీ నడుస్తోందని భ్రమ విడిచిపెట్టు. ఇంత పెద్ద ప్రపంచయుద్ధం నడుపుతున్న ఐసెన్ హోవర్, మెక్ ఆర్థర్ వాళ్లు హాయిగా నిద్రపోగలుగుతున్నారు. ఈ పాటి ఉద్యోగానికే నువ్వు కళవెళ పడి నిద్రను దూరం చేసుకుంటున్నావు. అనారోగ్యాన్ని పిల్చుకుని వస్తున్నావ్.' అని తనకు తానే బుద్ధి చెప్పుకున్నాడు. కొన్ని వారాలకే అతని ఆరోగ్యం చక్కబడింది. కడుపులో ఏ మంటా లేదు.
నేను చాలాకాలం పాటు ఉద్యోగిగా ఉన్నాను కాబట్టి ఉద్యోగి మనస్తత్వం నాకు బాగా తెలుసు. 'మా ఆఫీసులో ఎవ్వడూ పనికి రాడు. నేను ఒఖ్కరోజు వెళ్లకపోతే ఆఫీసులో ఏ పనీ నడవదు అనుకుంటూ తమ ఆరోగ్యాన్ని, కుటుంబజీవితాన్ని దెబ్బ తీసుకున్నవారిని అనేకమందిని చూశాను. ఒకసారి నా సహోద్యోగి చెప్పాడు – 'మా నాన్న బెంగుళూరు బిఇఎల్లో పెద్ద ఉద్యోగంలో పనిచేశారు. సుగర్‌తో సహా సకల రోగాలు ఉండేవి. రిటైరయ్యాక మా స్వగ్రామం వెళ్లి వ్యవసాయం చేయసాగాడు. ఇప్పుడు రోగాలన్నీ మాయం.' అని. నా కది బాగా నచ్చి ఆ థీమ్‌పై 'అధికారాంతమున..' అనే కథ రాసి ముఖ్యపాత్రకు ఆయన పేరే రాధాకృష్ణ అని పెట్టాను. 'ఎమ్బీయస్ కథలు' శీర్షిక కింద అది యీ సైట్లో యిచ్చాను. అది షార్ట్ఫిల్మ్గా వస్తే మధ్యవయస్కులెందరికో ఉపయోగపడుతుందని నా నమ్మకం. ఉద్యోగాన్ని, వ్యక్తిగత జీవితాన్ని బాలన్స్ చేసుకోగలగాలి. లోకమంతా తన చుట్టూనే తిరుగుతోందనే భ్రమలోంచి బయటకు రావాలి. తన పరిమితులు తను తెలుసుకోవాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2017)