సోషల్ కాజ్‌ల విషయంలో తెగ రెస్పాండ్ అవుతారు… సామాజిక సందేశాలు బోలెడన్ని ఇస్తారు.. అవినీతిపై ధ్వజమెత్తుతారు.. నోట్లరద్దును స్వాగతిస్తారు.. జీఎస్టీతో అద్భుతాలు జరుగుతాయని అంటారు… అంతేనా, రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారు, ప్రజాప్రతినిధులు అయిపోతారు, రాజకీయ పార్టీలు గట్రాలకు అయితే లోటేలేదు. ఇక సినిమాల్లో ఇచ్చే సందేశాలు అయితే సరేసరి.
ఈ రకంగా సినిమా వాళ్లు.. తమంతటి మంచివాళ్లు, తమంతటి దేశభక్తులు, తమంతటి గొప్ప మనుషులు మరెవరూ లేరన్నట్టుగా కలరింగులు ఇచ్చేస్తూ ఉంటారు. యావత్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నది ఇది. ఇక దక్షిణాదిన సరేసరి. ఇక్కడ సినిమా వాళ్లు దేశభక్తులు, మేధావులు, రాజకీయ నేతలు.. అన్నీవాళ్లే. ఇంకా చెప్పాలంటే సినిమా వాళ్లు సౌతిండియాలో దేవుళ్లు. వీళ్లు నీతుల బొంతకు ఒక అంతుఏమీ ఉండదు.
మరి ఇలాంటి సినిమా వాళ్ల నీతులు, నిజాయితీలు సినిమాలకు పరిమితం అయినవేనని వేరే చెప్పనక్కర్లేదు. కానీ వీరాభిమానులు ఇలాంటి విషయాలను ఒప్పుకోరు. సినిమా వాళ్లు.. వాళ్లెవరైనా.. వారిని దేవుళ్లలా చూసే నేచర్ చాలామంది రక్తంలో ఇమిడిపోయింది. వాళ్ల సంగతిని అలా పక్కకు వదిలేస్తే… మరోవైపు సినిమా వాళ్ల అసలు బండారాలు ఒక్కొక్కటి అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి.
నీతులు చెబుతూ తారలుగా చలామణి అయ్యేవాళ్లు పన్నులు ఎగ్గొడుతున్నారు. ఒకరని కాదు.. ఇప్పటికే చాలామంది ఇలాంటి తరహాతో వార్తల్లోకి ఎక్కారు. ఈ మధ్యకాలంలోనే తారల కార్ల రిజిస్ట్రేషన్స్ అంతా ఒకస్కామ్ తరహాలో జరుగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ జాబితాలో ముందు వరసలో నిలిచింది మలయాళ సినీతార అమలపాల్. కోటి రూపాయలపై ధరపెట్టి బెంజికారు కొన్న అమలపాల్ దాని రిజిస్ట్రేషన్‌ను పాండిచ్చేరిలో చేయించింది. అలా ఎందుకు అంటే… పాండిచ్చేరిలో టాక్సులు తక్కువ. కేంద్రపాలిత ప్రాంతం అయినందున అక్కడ అన్నింటా పన్నుల రేటు తక్కువ. వాహనాలు కొనుగులుకు కూడా పాండిచ్చేరి స్వర్గధామం.
దాన్ని తెగ వినియోగించుకొంటూ ఉంటారు.. తమిళనాడు, కేరళ జనాలు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో తిరిగే వాహనాల రిజిస్ట్రేషన్లలో చాలావరకూ పాండిచ్చేరి రిజిస్ట్రేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఖరీదైన బైకులు, కార్లు. వీటిని సాధారణ జనాలు పాండిచ్చేరికి వెళ్లి కొనుక్కొని వస్తూ ఉంటారు. తద్వారా టాక్సులు తగ్గించుకొంటూ ఉంటారు.
ఈ దొడ్డిదారికి సినిమా వాళ్లు కూడా మినహాయింపు కాదు. అమలాపాల్ ఇదే తరహాలో వార్తల్లోకి వచ్చింది. అయితే ఇలాంటి పనిచేసింది కేవలం అమలపాల్ మాత్రమే కాదు. ఇంకా అనేక మంది తమిళ, మలయాళ చిత్రపరిశ్రమల వ్యక్తులు ఇదే తరహాలో పాండిచ్చేరికి వెళ్లి ఖరీదైన కార్లను కొని.. వాటిని పక్క రాష్ట్రాల్లో నడుపుకొంటూ ఉన్నారు. ఇదీ సినిమా వాళ్ల నిజాయితీ. కోటి రూపాయలు పెట్టి కారుకొనే స్తోమత ఉండి కూడా.. పదిలక్షల రూపాయల పన్నును అదనంగా చెల్లించడానికి మనసొప్పక అడ్డదారులు తొక్కుతున్నారు.
తనపై వచ్చిన ఈ వార్తల విషయంలో అమలపాల్ స్పందిస్తూ.. తనను అంతా వేధించేస్తున్నారన్నట్టుగా తెగబాధపడిపోయింది. తనను వెంటాడుతున్నారని, ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని ఉందని చెప్పుకొచ్చింది. మరి అంత ఫీలయ్యేపనేముంది. ఎంచక్కా పన్నును సరిగా చెల్లించి ఉంటే సరిపోయేది కదా. అమలపాల్ తనకారు కొనుగోలుకు నమోదు చేసిన అడ్రస్ విషయానికి వస్తే.. అదొక సింగిల్ రూమ్ అడ్రస్ అని తెలుస్తోంది. పాండిచ్చేరిలో ఏదో ఒక అడ్రస్ అవసరం కదా.. అందుకోసం కాస్త ఖరీదైన ఇంటిని కూడా రెంటుకు తీసుకోలేదీమె. ఒక చిన్న రూమ్‌ను అద్దెకు తీసుకుని పని కానిచ్చేసిందంటే.. వీళ్లు ఎంత ప్లాన్డ్‌గా చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. ఇంత ప్లాన్డ్‌గా చేసి.. మళ్లీ అమలపాల్ సానుభూతిని ఆశిస్తుండటం గమనార్హం.
ఇక ఇదొక్క వ్యవహారమే కాదు.. సినిమా వాళ్ల ఆర్థిక అవకతవకలకు, పన్నులు ఎగ్గొడుతున్న వ్యవహారాలు వెలుగులోకి రావడానికి లోటు ఏమీలేదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం కూడా ఇలాంటిదే వెలుగులోకి వచ్చింది. నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించిన పారితోషకంపై టాక్స్ అవకతవకకు పాల్పడ్డాడు అనేది జూనియర్‌పై వచ్చిన ఆరోపణ. అయితే తను టాక్స్ కట్టాల్సిన అవసరమే లేదని జూనియర్ స్పష్టం చేశాడప్పుడు.
ఆ సినిమా షూటింగ్ పూర్తిగా యూకేలో జరిగిందని.. తను విదేశంలో పనిచేసి పొందిన పారితోషకానికి ఇండియన్ గవర్నమెంట్‌కు టాక్స్ కట్టాల్సిన అవసరం లేదని జూనియర్ వాదించాడు. కేవలం ఎన్టీఆర్ మాత్రమేగాక.. ఆ తరహాలో విదేశాల్లో షూటింగులు జరుపుకున్న వివిధ సినిమాల హీరోలు, హీరోయిన్లు కూడా ఈ క్లాజ్‌నే చూపి పన్ను కట్టనట్టుగా వార్తలు వచ్చాయి. మరి పైకి సినిమాల్లో చాలానీతులు చెప్పే సినిమా వాళ్లు.. ఇలాంటి క్లాజులు ఉపయోగించుకొంటూ వైట్‌కాలర్ రూపంలోనే పన్నులు చెల్లించకుండా తప్పించుకోవడం విశేషం.
ఇక దక్షిణాదిన చాలామంది స్టార్ హీరోలు పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. ఐటీశాఖకు ఇలా పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితాలో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కూడా ఒకసారి బుక్ అయ్యాడు. మమ్ముట్టీ కూడా ఐటీశాఖకు డ్యూ కట్టాల్సి వచ్చింది. తర్వాత వాళ్లు సెటిల్ చేసుకున్నారు. వీళ్లు సినిమాల్లో చాలా ఉదాత్తమైన పాత్రలు వేస్తూ ఉంటారు. మోహన్‌లాల్ అయితే మిలటరీలో కూడా చేరి తన దేశభక్తిని నిరూపించుకున్నాడు. అయితే ఇన్‌కమ్ టాక్స్ సరిగా చెల్లించి మాత్రం భక్తిని చాటుకోలేకపోయాడు లాల్. తర్వాత వివాదం పరిష్కారం అయ్యిందనుకోండి.
ఇక మరో స్టార్ హీరో చెన్నైలోని బంధువుల ఇంట్లో కోట్ల రూపాయల డబ్బు లభించింది. దాని కథ ఏమైందో ఎవరికీ తెలియదు. అభిమానుల లెక్కల్లో దేవుళ్లుగా చలామణి అయ్యేవాళ్లుకూడా తమ వ్యవహారాలు ఏవీ పారదర్శకంగా ఉంచడంలేదని వేరే చెప్పనక్కర్లేదు. దేవుడు అనిపించుకునే హీరో ఎంత పారితోషకం తీసుకుంటున్నాడు.. అతడు నిరుపేదే అనుకుందాం. మరి అవే విషయాలను పారదర్శకంగా ఉంచవచ్చు కదా.
ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా ఉంటుంది సినిమా వాళ్ల నిజాయితీ. ఆ మధ్య నల్లధనం మీద 'శివాజీ' అంటూ ఒక పెద్ద సినిమానే తీశారు. ఆ సినిమా అంతా ఆర్థికనేరాల గురించి తెగ చర్చించారు. జాతికి సందేశం ఇచ్చారు. మరి అదే సినిమాకు హీరో ఎంత పారితోషకం తీసుకున్నాడు, అంత ఉదాత్తమైన కథను తెరకెక్కించిన దర్శకుడెంత తీసుకున్నాడు. నిర్మాతకు ఎంత మిగిలింది.. అనే విషయాలను పారదర్శకంగా పెట్టలేదు ఎందుకని? నీతులు బయటకు చెప్పడానికే ఉంటాయా?
తమ విషయాల్లో ఏమాత్రం పారదర్శకంగా ఉండలేని వీళ్లు.. దైవ సమానులు అవుతారా? ఇదేనా దైవత్వం? సినిమా వాళ్లు కూడా మనుషులే.. వాళ్లకూ సర్వబలహీనతలూ ఉన్నాయి.. అని అనేక విషయాలు రుజువు చేస్తున్నాయి. వాళ్ల ఎఫైర్లు, రెండు .. మూడు పెళ్లిళ్లు.. ఇతర బలహీనతలు.. అన్నీ బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్లు ఆర్థిక వ్యవహారాల్లో కూడా అవకతవకలకు పాల్పడటం పరమరొటీన్‌గా సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో వీళ్ల నిజాయితీ ఏమిటో స్పష్టం అవుతోంది. దీనికి ఎవరూ మినహాయింపులా కనిపించడంలేదు. అందరూ దొంగలే.. కొందరు దొరుకుతున్నారు.. కొందరు వెలుగుతున్నారు అంతే తేడా!