పెద్ద పెద్ద సినిమా హీరోలు రాజకీయాల్లో ఒక్కొక్కరుగా విఫలమవుతున్నారు. తాము ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారో ఆ లక్ష్యం నెరవేరకపోతే నిరాశపడిపోతున్నారు. కొందరు తమ దుకాణాలను మూసేసి మళ్ళీ సినిమాల్లో వెడలిగిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
కొందరు కిందా మీదా పడుతూ కుంటుకుంటూ పోతున్నారు. కొంతకాలంగా ఈ ట్రెండ్ చూస్తున్నాం. రాజకీయాల్లోకి వచ్చిన సినిమా హీరోలు సొంతంగా పార్టీ పెట్టినవారు కావొచ్చు, ఇతర పార్టీల్లో చేరినవారు కావొచ్చు నిలకడగా రాజకీయ రంగంలో ఉండటం లేదు. కొందరికి మినహాయింపు ఉందనుకోండి. అది వేరే విషయం.
పెద్ద హీరోలు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుంటే వారి లక్ష్యం ఒక్కటే… ముఖ్యమంత్రి అయిపోవాలి. అంతకు తక్కువ స్థానాన్ని వారు ఊహించలేరు. ముఖ్యంగా సొంత పార్టీ పెట్టుకున్న హీరోల ఆలోచనా ధోరణి ఈ విధంగానే ఉంటుంది. కానీ సినిమాలు ఉన్నట్లుగా రాజకీయాలు ఉండవు అనే సంగతి పెద్ద హీరోలకు అర్ధం కావడంలేదు.
సినిమాలో హీరో ఏ పనైనా ఈజీగా చేసేయగలడు. ఒకేసారి వందమందిని మట్టి కరిపించగలడు. ఒక్క రోజులో అవినీతిపరుల భరతం పట్టగలడు. ఇలా వాస్తవంలో చేయని ఎన్నో పనులు సినిమాల్లో చేస్తుంటారు. సాధారణంగా సినిమా వాళ్ళు వాళ్ళు నటించే పాత్రలతో ప్రభావితమవుతుంటారు.
కాబట్టి రాజకీయాల్లోనూ తమ హీరోయిజం కొనసాగాలని అనుకుంటారు. దీంతో రాజకీయాల్లో విఫలమైతే తట్టుకోలేరు. ప్రజా సేవ చేయాలంటే అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమనుకుంటారు. కానీ సేవా కార్యక్రమాలతోనూ రాజకీయ నాయకులకంటే, ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ ఇమేజ్ సంపాదించుకోవచ్చని సోనూ సూద్ నిరూపించలేదా ?
వాస్తవానికి చేతుల్లో అధికారం ఉన్న మంత్రులు కూడా చేయలేని ఎన్నో పనులు సోనూ సూద్ అవలీలగా చేశాడు. సేవా కార్యక్రమాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా, ఏ పని చేయడానికైనా స్వేచ్ఛ ఉంటుంది. కానీ రాజకీయాల్లో, అధికారంలో ఆ స్వేచ్ఛ ఉండదు. అనేక నిబంధనల అడ్డంకులు ఉంటాయి. అనేక మొహమాటాలు ఉంటాయి.
నిజానికి సూపర్ స్టార్లు, మెగా స్టార్లు, పవర్ స్టార్లు, లోక నాయకులు, తలైవాలు రాజకీయాల జోలికి పోకుండానే సమాజంలో నిజమైన హీరోలుగా మారొచ్చు. కానీ ఆ పని చేయకుండా రాజకీయాల్లోకి దిగి విఫలమవుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ … తమిళ సూపర్ స్టార్ కమలహాసన్.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించి డీఎంకే అధికార పగ్గాలు చేపట్టడంతో కమల హాసన్ నిరాశలో మునిగిపోయాడట. ఎన్నికల్లో ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. స్వయంగా కమల్ హాసనే పోటీ చేసి కూడా ఓడిపోయారు. దాంతో కమల్ హాసన్ పార్టీ కంటే ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేనే బెటర్ అనే కంపేరిజన్లు బాగా పుట్టుకొచ్చాయి.
ఇదే సమయంలో… ఓటమి తర్వాత కమల్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి నేతలు జంప్ అవుతున్నారు. కమల్ హాసన్ రాజకీయాలకు గుడ్‌బై చెబుతారు కాబట్టే నేతలు వేరే దారి చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.66 ఏళ్ల కమల్ హాసన్ రాజకీయాల్లో మార్పు తెస్తానని రాజకీయాల్లోకి వచ్చారు.
ఆయనలాగే దేవుడు శాసించాడంటూ రాజకీయాల్లోకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్నప్పుడు అనారోగ్యం పాలై పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. కమల్ హాసన్ మాత్రం తానేంటో చూపిస్తానని రంగంలోకి దిగి చతికిలపడ్డారు. గత పదేళ్లుగా కమల్ హాసన్‌కి వెండి తెరపై వెలుగులు లేవు.
పార్టీ పెట్టి దూసుకెళ్లడానికి ఆయన యువనేత కాదు. అందువల్ల ఆయనతో నడిచేవారు కరవయ్యారు. దానికి తోడు తమిళనాడులో మొదటి నుంచి డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య అధికారం చేతులు మారుతోంది.
అదే సమయంలో డీఎంకే పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం, ఆ పార్టీ అధినేతగా స్టాలిన్ రణ రంగంలోకి దిగడం వంటివి ఆ పార్టీకి కలిసొచ్చాయి. దాంతో ప్రజలు కమల్ హాసన్ వైపు అస్సలు చూడలేదు.ఈ పరిణామాలన్నీ లెక్కలోకి తీసుకున్న కమల్ హాసన్ ఫలితాలు చూసి తీవ్ర నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ కార్యకర్తలు కూడా ఫలితాల తర్వాత కనిపించట్లేదు.
చాలా మంది నేతల లాగే… పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ఇంకా నీరుగారిపోయింది. ఇక ఇప్పట్లో ఎన్నికలు లేవు. డీఎంకే మీద విమర్శలు చేయడానికైనా కనీసం సంవత్సరం పడుతుంది. ఇక ఎప్పటికి అధికారం దక్కుతుందో తెలియదు. అందువల్ల కమల్ హాసన్ కూడా గుడ్‌బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది.
ఏపీలో గతంలో చిరంజీవి ఎపిసోడ్ తెలిసిందే కదా. ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినా కేంద్రంలో సహాయ మంత్రి అయ్యాడు. దాని తరువాత రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఆశలు నెరవేరకపోయినా పళ్ళ బిగువున రాజకీయాల్లో కొనసాగుతున్నాడు.