ఈ ఏడాది ఆగస్టు కళ్లా కోవిడ్-19 అన్ని వేరియెంట్స్ పై పూర్తి విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది యూనైటెడ్ కింగ్డమ్. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం స్పందించింది. ఈ ఏడాది ఆగస్టు కళ్లా యూకే పరిధిలో కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రసక్తే ఉండదనేంత ధీమాగా స్పందించింది.
ఇప్పటి వరకూ 51 మిలియన్ల మందికి పైగా ఒక దశ వ్యాక్సినేషన్ జరిగిందట యూకే పరిధిలో. ఈ ఏడాది జూలై కళ్లా దేశంలోని యుక్త వయసులోని వారితో సహా అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఆ తర్వాత బూస్టర్ డోస్ లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రణాళికను రచించారట.
కోవిడ్ పై తమ విజయానికి మరెంతో సమయం లేదని.. ఈ ఏడాది ఆగస్టు కళ్లా తాము కరోనా పై పూర్తి విజయాన్ని సాధించగలమనే ధీమాను యూకే వ్యక్తం చేస్తూ ఉంది. బూస్టర్ డోస్ ప్రక్రియ పూర్తవ్వడానికి సమయం పట్టినా, ఆ లోపే తమ దేశంలో కరోనా వ్యాప్తి ఉండదని యూకే ధీమాను వ్యక్తం చేస్తోంది.
ఒక్క వేరింయట్ అని కాదు, ఏ వేరియెంట్ కూడా వ్యాప్తిలో ఉండదని అక్కడి ఆరోగ్య శాఖ ధీమాను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకూ యూకే పరిధిలో కరోనా కేసులు పతాక స్థాయికి చేరాయి. రోజుకు యాభై వేల స్థాయిలో కూడా అప్పుడు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వేవ్ తగ్గిపోయింది.
ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య రెండు వేల స్థాయిలో ఉన్నాయి. మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్న దేశం కావడంతో ఆ మాత్రం కేసులను డీల్ చేయడం వారికి పెద్ద కష్టం కావడం లేదు. వ్యాక్సినేషన్ విషయంలో కూడా వేగంగా స్పందించింది ప్రభుత్వం.
ఇప్పటికే చాలా మేర జనాభాకు ఒక దశ వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. దీంతో కరోనా ఏ వేరియంట్ ను మార్చుకుని వచ్చినా విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నట్టుంది అక్కడి ప్రభుత్వం.