తన ప్రమాణ స్వీకారోత్సవానికి అతిధిగా వచ్చిన డీఎంకే ముఖ్య నేత ఎంకే స్టాలిన్ ను అప్పట్లో తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2019లో ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన అతిథుల్లో స్టాలిన్ ఒకరు.
తన తనయుడిని తీసుకుని మరీ వచ్చారు స్టాలిన్. ఈ క్రమంలో ఆ కార్యక్రమానికి హాజరైనందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, స్టాలిన్ ను తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి అని సంబోధించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
రెండేళ్లలో తమిళనాడు రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. రజనీకాంత్ రాజకీయ ఊగిసలాట, అన్నాడీఎంకే గట్టి పోటీ ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. జయలలిత లేకపోయినా అన్నాడీఎంకే మంచి పోటీ ఇచ్చింది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో చిత్తైన రీతిలో కాకుండా.. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గట్టి పోటీ ఇచ్చింది.
అయితే కనీస మెజారిటీ కన్నా మెరుగైన స్థాయిలోనే సీట్లను సంపాదించి డీఎంకే అధికారాన్ని దక్కించుకుంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన చిరకాల వాంఛను తీర్చుకున్నారు. తన ప్రమాణ స్వీకార వేళా విశేషం స్టాలిన్ విషయంలో జగన్ మాట వాస్తవం అయ్యింది.
కరోనా పరిస్థితుల నేఫథ్యంలో ఎలాంటి హంగామా లేకుండా స్టాలిన్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.