పాలపొంగు దేశభక్తి 

పూర్వ కాలంలో .. అంటే మరీ రాజుల కాలం కాదండోయ్.. ఓ ముప్పయ్, నలభయ్ ఏళ్ళ క్రితం అనుకోండి. అప్పట్లో స్కూళ్లలో పిల్లగాళ్లకు వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు పెట్టేవారు. ఈ పోటీలకు పాపులర్…

పూర్వ కాలంలో .. అంటే మరీ రాజుల కాలం కాదండోయ్.. ఓ ముప్పయ్, నలభయ్ ఏళ్ళ క్రితం అనుకోండి. అప్పట్లో స్కూళ్లలో పిల్లగాళ్లకు వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు పెట్టేవారు. ఈ పోటీలకు పాపులర్ సబ్జెక్ట్ ఏమిటంటే కత్తి గొప్పదా ? కలం గొప్పదా? అని. సరే … ఎవరైనా కలమే గొప్పది అంటారనుకోండి. అది వేరే విషయం.

ఈ కాలంలో దేశభక్తి గొప్పదా? దైవ భక్తి గొప్పదా? అంటే దైవ భక్తే గొప్పదని చెబుతారు. దైవ భక్తి అన్ని కాలాల్లోనూ ఉంటుంది. దేశభక్తి మాత్రం మన దేశం మీద ఎవరైనా దాడులు చేసినప్పుడే ఉవ్వెత్తున పెల్లుబుకుతుంది. అది పాల పొంగులాంటిది. ఎంత కాలమో ఉండదు. ఈ మధ్య సరిహద్దుల్లో భారత్ – చైనా సైన్యాల మధ్య ఘర్షణలు జరగడం, భారత సైనికులు ఇరవైమంది చనిపోవడం జరిగింది.

చైనావారు నలభయ్ మందికి పైగా చనిపోయారని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కొందరు నమ్ముతున్నారు. కొందరు నమ్మడంలేదు. సరే .. అదో కథలెండి. భారత సైనికులు ఇరవైమంది చనిపోగానే దేశవ్యాప్తంగా దేశభక్తి ఉవ్వెత్తున ఎగసిపడింది. వివిధ రంగాలకు చెందిన వారు దేశభక్తితో ఊగిపోతున్నారు. బాయ్ కాట్ చైనా అనే నినాదం మారుమోగుతోంది. చైనా వస్తువులను బహిష్కరించాలంటున్నారు.

మనం వాడే చైనా ఉత్పత్తులు అన్నిటిని మనమే తయారు చేసుకొని ఆ దేశాన్ని ఆర్ధికంగా దెబ్బ కొట్టాలంటూ ఉపన్యాసాలు దంచేస్తున్నారు. చైనా కంపెనీలను ఇండియాలోకి రానివ్వకూడదంటున్నారు. ఇలా ఎవరికీ తోచింది వారు చెబుతున్నారు. ఈ దేశభక్తి ఆవేశం ఎన్నాళ్ళు ఉంటుంది ? ఇది కొంతకాలమే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు లాక్ డౌన్ కదా. పాలకులైన, కంపెనీలైనా, అధికారులైనా… ఎవరైనా సరే గతంలో మాదిరిగా ప్రత్యక్షంగా మీటింగులు పెట్టుకోలేరు.

ఢిల్లీ నుంచి గల్లీ దాకా వర్చువల్ మీటింగులే. ఇందుకు ఎక్కువమంది జూమ్ యాప్ ఉపయోగిస్తున్నారు. అది చైనాదే, వివో, ఒప్పో స్మార్ట్  ఫోన్లు ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. అవి చైనా కంపెనీలే. దోమలను చంపే బ్యాట్లు కూడా చైనావే. ఓ పక్క చైనా వస్తువులను బహిష్కరించాలని గొంతు చించుకుంటున్నాం. మరో పక్క అవే వాడుతున్నాం. భారతీయుల ఇళ్లలో సగం చైనా వస్తువులే ఉంటాయి. ఊపిరి ఆగిపోతే బతకం కదా.

అలా చైనా వస్తువులు లేకపోతే బతకడం సాధ్యం కాదు. చైనా వస్తువుల ప్రత్యేకత ఏమిటో చాలామందికి తెలుసు. అవి చాలా చీప్. ఆర్ధికంగా బలహీనంగా ఉన్నవారు చైనా వస్తువులవైపే మొగ్గు చూపుతారు. అవి తక్కువ ధరలకు దొరుకుతాయి కాబట్టి కొంతకాలం తరువాత పాడైనా బాధపడరు. చైనా వస్తువులన్నీ మన దేశంలోనే తయారు చేసుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా? ఇండియాలో చైనా వస్తువులను నిషేధించడం సాధ్యమయ్యే పనికాదని చాలామంది భావిస్తున్నారు. చైనా ఏదైనా కొత్త ఉత్పత్తి మార్కెట్లో విడుదల చేసిందంటే ముందుగా ఎగబడి కొనేది మనమే.

తాజాగా చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ వన్ ప్లస్ 8 ప్రో మోడల్ సెల్ ఫోన్ మార్కెట్లో విడుదల చేసింది. ఆన్లైన్లో స్టాక్ మొత్తం భారతీయులు ఎగబడి కొన్నారు. చైనా దాడులు చేశాకే కదా ఇది జరిగింది. ప్రజల అవసరాల ముందు దేశభక్తి పనిచేయదు. అందులోనూ గాడ్జెట్స్ విషయంలో. గతంలోనూ చైనా ఫోన్లు ఇలాగే అమ్ముడయ్యాయి.

గాల్వాన్ ఘటన ప్రభావం తమ ఉత్పత్తులపై పడుతుందని చైనా కంపెనీలు భయపడుతున్నాయి. కానీ అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. దేశభక్తిని రెచ్చగొట్టే నాయకులే బొచ్చెడు చైనా వస్తువులు వాడుతుంటారు. ముందు ఈ నాయకులు తమ ఇళ్లల్లో ఉన్న చైనా వస్తువులను రోడ్లమీద తగలబెడితే బాగుంటుంది. 

చంద్రబాబు,ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై పరువునష్టం దావా

తండ్రి పాలిట రాక్షసిలా మారిన పూజా