ఇప్పటికే వివాదాలమయమైంది ఇంద్రకీలాద్రి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపై జరిగిన అపచారాలు, అక్రమాలు అన్నీఇన్నీ కావు. మొన్నటికిమొన్న అర్థరాత్రి క్షుద్ర పూజల వివాదంతో రచ్చకెక్కిన కీలాద్రి, తాజాగా సీసీ కెమెరాల వివాదంతో మరోసారి అట్టుడికిపోతోంది.
దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఈమధ్య విశ్రాంతి గృహాలు (డార్మెటరీలు) ఏర్పాటుచేశారు. కేవలం ఇవి విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే కాదు. భక్తులు స్నానాలు చేసిన తర్వాత దుస్తులు మార్చుకునే గదులు కూడా ఇందులోనే ఉన్నాయి. అయితే భద్రత పేరుచెప్పి ఆ గదుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం, తాజాగా వివాదానికి కేంద్ర బిందువైంది. పైగా ఆ కెమెరాల్ని మహిళలు దుస్తులు మార్చుకునే గదుల్లో ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది.
దుస్తులు మార్చుకుంటున్న కొంతమంది మహిళలు ఈ విషయాన్ని గ్రహించి, ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని అధికారులు తమదైన శైలిలో సమర్థించుకున్నారు. కాంట్రాక్టులో భాగంగా పడుంటాయనే ఉద్దేశంతో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని, మహిళలు దుస్తులు మార్చుకునే గదుల్లో మాత్రం దృశ్యాలు రికార్డు చేయడం లేదని బుకాయించారు.
కానీ కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి చూసిన భక్తులకు మహిళలు దుస్తులు మార్చుకునే గదులు కూడా తెరపై కనిపించడంతో అవాక్కయ్యారు. ఇదే విషయంపై ప్రశ్నిస్తే అవి ఖాళీ గదులని, అక్కడ మహిళలు కనిపించలేదు కదా అని మళ్లీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత తమ తప్పును అంగీకరించింది పాలకమండలి. ఈరోజే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, వెంటనే సీసీ కెమెరాలు తొలిగిస్తామని ప్రకటించింది.