మరో దిగ్భ్రాంతికరమైన ఉదంతం బయట పడింది. ఇంట్లో పనిచేసేందుకని తీసుకొచ్చిన ఇద్దరు నేపాలీ యువతులు గత కొంతకాలంగా ఓ ఇంట్లో రేప్‌కు, చిత్ర హింసలకు గురయ్యారు. ఒక ఎన్‌జి ఇచ్చిన సమాచారంతో ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆ ఇద్దరు మహిళలను రక్షించగలిగారు.
వివరాల్లోకి వెళితే… నేపాల్‌కు చెందిన ఇద్దరు యువతులు కొన్ని నెలల క్రితం హౌస్ మెయిడ్‌లుగా పనిచేసేందుకని ఇండియాకు వచ్చారు. సౌదీ అరేబియా ఎంబసీ అధికారిగా పనిచేసే వ్యక్తి ఇంట్లో పనికి కుదిరారు. పనిలో దిగిన వెంటనే వీరిని సౌదీలోని జెడ్డాకు తీసుకెళ్లారు. అక్కడ ఓ నెల ఉన్న అనంతరం తిరిగి సౌత్ ఢిల్లీ లోని గుర్‌గావ్‌లో ఒక అపార్ట్‌మెంట్లో ఉంచారు. ఇక అప్పటి నుంచి మొదలైంది వీరిపై అత్యాచార పర్వం.
పోలీసులకు ఆ మహిళలు చెప్పిన ప్రకారం… ఆ ఇంట్లో వీరిద్దరూ గృహ నిర్భంధానికి గురయ్యారు. వీరిని గుమ్మం దాటనివ్వలేదు. ఇంట్లో ఉన్న సౌదీ అరేబియన్ దేశస్తులు సహా ఆ ఇంటికి వచ్చిన అతిధులు కూడా వీరిపై అత్యాచారాలకు పాల్పడేవారు. కొట్టేవారు. చిత్రహింసలు పెట్టేవారు. వారు పెట్టిన చిత్ర హింసల గుర్తులు వారి వంటి నిండా ఉన్నాయి.
ఈ ఇద్దరు మహిళలను కాపాడిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ఆసుపత్రికి పంపారు. ఇంతకీ ఆ ఇంటిలో నివసించే అధికారి ఎవరనే దానిపై పోలీసులు ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. మరోవైపు భారత్, నేపాల్, సౌదీ… ఇలా ప్రస్తుతం ఈ కేసు మూడు దేశాలకు సంబంధించిన వ్యవహారంగా మారింది.