ప్రపంచాన్ని ఉగ్రవాదం ఎప్పుడూ వణికిస్తూనే ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు సమాయత్తమవుతూనే ఉన్నాయి. రామాయణంలో రాముడు రావణుడితో యుద్ధం చేసేటప్పుడు బాణాలతో వాడి తలకాయలు ఎగరగొడుతుంటే అవి మళ్లీ పుట్టుకొచ్చేవని చెబుతుంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదుగాని, ఉగ్రవాదాన్ని అంతో ఇంతో అరికడుతున్నామని ప్రభుత్వాలు అనుకునేలోగానే కొత్త రూపంలో పుట్టుకొచ్చి సవాలు విసురుతోందన్నది వాస్తవం. ఒకప్పుడు బిన్ లాడెన్ పేరు చెబితే ప్రపంచం వణికిపోయింది. అమెరికా వాడిని చంపేసి ఎక్కడో సముద్రం అడుగున పడేసిందని అన్నారు. తాలిబన్లు కూడా గడగడలాడించారు. ఇంకా వారి ఉనికి కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు అల్‌ఖైదా అంటే అమ్మో అనేవారు. మరి ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని గజగజలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ పేరు వినగానే అమ్మో…అమ్మమ్మో అనాలా?
ఇస్లామిక్ స్టేట్నే సంక్షిప్తంగా ఐఎస్ అంటున్నారు. దీని అసలు పేరు ఐఎస్ఐఎస్. అంటే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. అయితే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ అల్-షామ్ అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఐఎస్‌గా పాపులర్ అయింది. ఈ ఉగ్రవాద సంస్థ సాగిస్తున్న మారణ¬మానికి అంతు లేకుండా ఉంది. దీని అకృత్యాల వార్తలు ప్రచురించని పత్రిక, ప్రసారం చేయని టీవీ ఛానెల్ లేదు. తాలిబన్లు ఐఎస్ ఉగ్రవాదుల ముందు పనికిరారు. భారత దేశంలోని యువతతోపాటు అనేక దేశాల్లోని యువజనులు ఐఎస్‌లో చేరడానికి తహతహలాడుతున్నారు. ఐఎస్‌లో చేరేందుకు అనేకమంది యువకులు అక్రమంగా దేశ సరిహద్దులు దాటి వెళుతున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మొన్నీమధ్య భారతీయ ప్రొఫెసర్లను అపహరించుకుపోయింది కూడా ఐఎస్ ఉగ్రవాదులే. పాశ్యాత్య దేశాలకు చెందిన పలువురు జర్నలిస్టులను కిరాతకంగా హతమార్చారు. మొన్నీమధ్య 'సెక్సువల్ జిహాద్' పేరుతో 19 మంది మహిళలను, బాలికలను చంపేశారు. వారు చేసిన నేరం మిలిటెంట్లతో లైంగిక చర్యల్లో పాల్గొనకపోవడమే. ఐఎస్ అకృత్యాలు ఎంత చెప్పుకున్నా తరగవు.
ఈ ఉగ్రవాద గ్రూపు మొత్తం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్లాన్ చేస్తోందట…! ప్రపంచాన్నే అన్నప్పుడు అందులో ఇండియా కూడా ఉంటుంది కదా. అవును…ఉంది. భారత ఉపఖండం (ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ మొదలైనవి) సహా ప్రపంచంలోని విస్తారమైన భాగాన్ని ఆక్రమించాలనుకుంటోందట. ఇదంతా యాభై ఏళ్ల తర్వాతో, వందేళ్ల తర్వాతో కాదు. కేవలం ఐదేళ్లలోనే. అంటే 2020 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలనుకుంటోంది. ప్రపంచాన్ని ఎలా ఆక్రమించాలో ఐఎస్ మ్యాప్ కూడా తయారుచేసింది. ఈ విషయాలన్నీ బీబీసీ రిపోర్టర్ అండ్రూ హాస్కిన్ తన కొత్త పుస్తకం 'ఎంపైర్ ఆఫ్ ఫియర్: ఇన్సైడ్ ది ఇస్లామిక్ స్టేట్' అనే పుస్తకంలో వివరించారు. 'ఇస్లామిక్ ప్రపంచం' ఐఎస్ లక్ష్యం. ఐఎస్‌లో యాభై వేల మంది సభ్యులున్నారు. దీని ఆస్తులు రెండు బిలియన్ పౌండ్లు. ఇరాక్, సిరియాలోని గ్యాస్ నిక్షేపాలపై పాక్షికంగా దీని నియంత్రణ ఉంది. అమెరికా, రష్యా సహా అరవై దేశాలు ఐఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి.
ఈ టెరర్రిస్టు గ్రూపును అబు ముసబ్ అల్-జర్ఖావీ అనే అతను స్థాపించాడు. 2020 నాటికే ఇస్లాం విజయం సాధించాలని 1996లోనే ఏడు దశల కార్యక్రమం ఐఎస్ రూపొందించింది. ఈ ఉగ్రవాద సంస్థను పూర్తిగా నిర్మూలించలేమని, ఇది క్యాన్సర్ మాదిరిగా పుట్టుకొస్తూనే ఉంటుందని హస్కెన్ పేర్కొన్నారు. భారత్‌పై దాడులు చేస్తామని ఐఎస్ఐఎస్ ఇదివరకే ప్రకటించింది. అందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈమధ్య అమెరికన్ మీడియా తెలియచేసింది. బీబీసీ రిపోర్టర్ చెబుతున్నదాన్ని చూస్తే ఐఎస్ చాలా శక్తిమంతమైందని అర్థమవుతోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థ ఇదే. అంగబలం, అర్థబలం రెండూ ఉన్నప్పుడు తిరుగేముంది?