ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు విస్తరణ, కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదంగా మారాయి. ఇందుకు సంబంధించిన జీఓపై తెలంగాణ ప్రభు త్వం అభ్యంతరం చెప్పింది. తెలంగాణలోని దాదాపు రాజకీయ పార్టీలు ఈ అంశం ఆధారంగా తెలంగాణలో సెంటిమెంట్ పెంచడానికి తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా ప్రాజెక్టులపై తన వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే, మరో వైపు రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ముఖ్యమంత్రులం ఇద్దరం కలిసే ఉన్నామని ప్రకటించడం ద్వారా తన పెద్దమనసు చాటుకున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా తెలంగాణలోని ప్రాజెక్టులపై తమ అభ్యంతరాలను నమోదు చేస్తూ, ఎక్కడా తెలంగాణ ప్రజలను కాని, తెలంగాణ ప్రభుత్వాన్ని కాని విమర్శించ కుండా, వారి మనసులు గాయపడేలా ప్రవర్తించకుండా మెచ్యూరిటీనీ ప్రదర్శించారు.
తెలంగాణకు నష్టం లేకుండా, రాయలసీమకు నీరు ఇవ్వడానికి మానవత్వంతో చూడాలని మాత్రమే విజ్ఞప్తి చేశారు. నీరు అన్నది చాలా పెద్ద సెంటిమెంటు. సాగుకు అయినా, దాహార్తికి అయినా ప్రాణప్రదమైన నీటికోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఘర్షణలు జరిగాయి. అందులోను ఏపీ ఉమ్మడి రాష్ర్టంగా ఉన్నప్పుడు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల మధ్య నీటి వివాదాలు ఎంతగా ఉండేవో చెప్పడం కష్టం. ఎప్పుడు ఏమి గొడవ జరుగుతుందో అన్న భయం ఉండేది. రాజకీయనేతలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రజలను రెచ్చగొట్టేవారు.
ప్రతిపక్షంలో ఉన్నవారు చేయడం ఒకఎత్తు అయితే అధికారంలో ఉన్నవారు చేయడం మరో ఎత్తు అవుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా కేసీఆర్, జగన్‌లు చాలా సంయమనంగా ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఎంత పెద్ద వివాదం వచ్చినా, అది ఆ అంశానికి మాత్రమే పరిమితం అవ్వాలి. దాని సామరస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఇరువైపులా ఆజ్యం పోసేలా వ్యవహరించకూడదు. సముద్రంలోకి వథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి కరువుతో కష్టాలు అనుభవిస్తున్న ప్రాంతాలకు నీరు ఇవ్వాలన్నది జగన్ లక్ష్యంగా భావించవచ్చు.
అయితే ఆయన కొత్తగా ఎత్తిపోతల పథకం చేపట్టదలచినప్పుడు ఆయా సంస్థల అనుమతి తీసుకోవచ్చు కదా అన్న వాదన సహజంగానే ముందుకు వస్తుంది. నిజమే! అలా జరిగితే మంచిదే. కాని ఆచరణలో గత అనుభవాలు అన్ని అలా శాస్త్రీయంగా ముందుకు వెళితే ఏ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేకపోతోంది. అదే ఎక్కడోచోట ఆరంభిస్తే అది ముందుకు సాగిపోతుంది. మొదటిసారిగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు వరదజలాల ఆధారంగా ప్రాజెక్టులు చేపట్టారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నికర జలాలనే రాయలసీమకు ఇవ్వాలంటూ ఆందోళనలు చేసేది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా వరద జలాల ఆధారంగా అదిక ప్రాజెక్టులు చేపట్టింది.
ఈ విషయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురించే ప్రస్తావించాలి. ఆయన ఉమ్మడి ఏపీలోని అన్ని ప్రాజెక్టుల పైళ్ల దుమ్ము దులిపారు. పోలవరం ప్రాజెక్టు, పులిచింతలతో సహా పోతిరెడ్డిపాడు విస్తరణ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, అలాగే తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులను చేపట్టారు. వీటిలో అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులు దాదాపు లేవనే చెప్పాలి. అయినా అవన్ని ముందుకు సాగాయి.
ఇప్పుడు వాటి ఫలితాలు కూడా ప్రజలకు అందు తున్నాయి. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లే యత్నం చేస్తున్నది గమనిస్తున్నాం. అవన్ని రైతులకు, ప్రజలకు ఉపయోగపడితే ఆయ నను అభినంధించవలసిందే. ఆ క్రమంలో కొత్తగా ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ పలు రకాలుగా నీటి ప్రాజెక్టులను చేపట్టాలని ఆలోచించారు. ఉన్నంతలో పోతిరెడ్డి పాడు కాల్వను 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని, కొత్తగా ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా కష్ణా జలాలలో ఏపీ వాటాను పూర్తిగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే గుంటూరు జిల్లా వరకు ఆ నీటిని పూర్తిగా వాడుకుంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కష్ణా జలాలను వాడుకోవచ్చన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తుంది. పోలవరం నుంచి బనకచర్ల క్రాస్ వరకు 65 వేల కోట్లతో గోదావరి నుంచి రాయలసీమకు నీటిని తీసుకువెళ్లాలని ప్రతిపాదించినా, అది పూర్తి కావడానికి చాలా సమయంపడుతుంది. ఈలోగా కష్ణాలో వచ్చే వరదనీటిని, అలాగే అక్కడ నిల్వ ఉండే నీటిని సమర్థంగా వాడుకోవడానికి ఈ కొత్త ప్రాజెక్టులను చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం వీటిపై అభ్యంతరం చెప్పగా, కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు కురిపిస్తూ నిరసనలు చేపట్టాయి.
బీజేపీ కొత్త అధ్యక్షుడు బండిసంజయ్ అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాయడం, ఆయన దానిపై స్పందించడం జరిగాయి. కష్ణాబోర్డు ఈ విషయంపై దష్టి పెట్టింది. ఏపీ అధికారులను పిలిచి వివరణ తీసుకున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రాజెక్టులపై పిర్యాదు చేసింది. దాంతో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా వివరణ కోరింది. దీనిని బట్టి అర్థం అవుతోంది ఏమిటి? ప్రభుత్వాలు చట్టాలను పాటించాల్సి ఉన్నా, ప్రజల అవసరాలు, నీటికి ఉన్న ప్రాధాన్యత రీత్యా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నాయి.
ఇది తప్పు అనుకుంటే తప్పు.. తప్పనిసరి అనుకుంటే తప్పనిసరి అని చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న భారీ ప్రాజెక్టులపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. తాత్కాలిక ప్రాజెక్టులపైనే ఎక్కువ ఆసక్తి కనబరిచారు. భారీ ప్రాజెక్టులు రాజకీయంగా పెద్దగా ఉపయోగపడవని ఆయన నమ్మకం. కాని రాజశేఖరరెడ్డి మాత్రం అలా అనుకోలేదు. కొందరు ఆయనను ఈ విషయమై ప్రశ్నిస్తే ఎక్కడో చోట, ఎవరో ఒకరు ఆరంభిస్తే, అవి ముందుకు సాగుతూనే ఉంటాయి.. తద్వారా ప్రజలకు ఉపయోగం అని సమాధానం ఇచ్చారు. నిజంగానే ఆయన అలాగే ముందుకు వెళ్లారు.
ఉదాహరణకు పోలవరం చంద్రబాబు మొదటి హయాంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ఆ తర్వాత వచ్చిన రాజశేఖరరెడ్డి దానిని సీరియస్‌గా తీసుకుని భూ సేకరణ మొదలు అనేక అనుమతులు తీసుకోవడం వంటివాటిని చేపట్టారు. దురదష్టవశాత్తు ఆయన మరణించారు. తదుపరి ప్రాజెక్టు జాప్యం అయింది. మళ్లీ చంద్రబాబుకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అప్పుడు ఆయన పోలవరం ప్రాజెక్టుపై కన్నా పట్టిసీమ లిప్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత పోలవరంపై కొంత దష్టి పెట్టినా, ఆయన పదవీకాలం ముగిసింది.
పోలవరం పూర్తి చేసే గొప్ప అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నారు. పులిచింతల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరం చెబుతారని చంద్రబాబు అసలు ఆ ప్రాజెక్టు జోలికి పోలేదు. కాని రాజశేఖరెడ్డి నల్గొండ జిల్లాలో ఎవరెవరు దానిని వ్యతిరేకిస్తున్నారో గమనించి, వారందరిని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. రాయలసీమలో హంద్రీ-నీవా వంటి వాటికి ఒకటికి రెండుసార్లు శంకుస్థాపనలకు చంద్రబాబు ప్రాముఖ్యత ఇచ్చారే కాని దానిని పూర్తి చేయడానికి శ్రద్ధ కనబరచలేదు. రాజశేఖరరెడ్డి అందుకు భిన్నంగా రాయలసీమ ప్రాజెక్టులకు ఒక ఊపు తెచ్చారు. ముఖ్యంగా కీలకమైన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తెలంగాణ, కోస్తా ఆంధ్రకు చెందిన కొందరు నేతలు అభ్యంతరం చెప్పినా, పట్టించుకోకుండా ముందుకు వెళ్లి పూర్తి చేశారు.
అప్పట్లో చంద్రబాబు ఆద్వర్యంలోని టిడిపి నేతలు ఎక్కడివారు అక్కడి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టారు. మాజీ మంత్రి దేవినేని ఉమా వంటి వారు ప్రకాశం బ్యారేజీ వద్ద పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పెద్ద నిరసన చేపట్టారు. రాయలసీమకు నీటిని దోచుకు వెళుతున్నారని కూడా ఉమా తదితరులు ఆరోపిస్తుంటే, చంద్రబాబు మౌనంగా ఉండేవారు. ఆ తర్వాత అణతీకారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రి అయిన ఉమామహేశ్వరరావు అసలు పోతిరెడ్డిపాడు తామే నిర్మించామన్నంతగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసుకునేవారు.
ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ముఖ్యమంత్రి ెదాలో పోతిరెడ్డిపాడును మరింత విస్తరించాలని ప్రతిపాదిస్తే, రాయలసీమేక చెందిన చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం ఆయన బలహీనతకు నిదర్శనం. ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందో అన్న భావనతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. వస్తున్న విమర్శలకు తప్పనిసరి పరిస్థితిలో సమాధానం చెబుతూ అసలు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును తామే పూర్తి చేశామని సంచలన విషయం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆయన అనేక విషయాలలో మాట మార్చారు. ఇది కూడా అంతేనని అనుకోవాలి. ఇక తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటీపడి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
రాయలసీమకు కేసీఆర్ నీరు ఇస్తామని అంటున్నారని, దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చుతున్నారని విమర్శిస్తున్నారు. చిత్రం ఏమిటంటే ఇప్పుడు ఈ విమర్శలు చేస్తున్నవారిలో పలువురు గతంలో కాంగ్రెస్ టైమ్‌లో మంత్రులుగా ఉండి, ఆ ప్రాజెక్టులను సమర్దించినవారే.జలహారతులు ఇచ్చినవారే.కాని రాష్ర్టం విడిపోయింది. రాజకీయాలు మారిపోయాయి.అందుకే ఈ విమర్శలు. దీని ఆదారంగా తెలంగాణలో పార్టీని పెంచుకోవాలన్నది వారి లక్ష్యం అని అర్థం చేసుకోవచ్చు. నిజంగానే ఏ జిల్లా అయినా ఎడారిగా మారుతుంటే ఎవరూ అంగీకరించరాదు. దక్షిణ తెలంగాణకు దీనివల్ల నష్టం జరుగుతుంటే ప్రభుత్వం కాని, రాజకీయ పార్టీలు కాని ఒప్పుకోరాదు. కాని వరద జలాలను వాడుకోవడం ద్వారా రెండువైపులా ప్రజలకు మేలు చేసేలా స్కీములు ఉన్నప్పుడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తగదు. ఈ విషయంలో కేసీఆర్‌ను మెచ్చుకోవాలి.
రాయలసీమకు నీరు ఇవ్వడాన్ని ఆయన సమర్థించిన తీరు బాగుంది. గోదావరి నుంచి తీసుకోవాలని ఆయన సూచించడం తప్పుకాదు. కాని ఆయనకు నీటిపారుదల గురించి తెలియని విషయం లేదంటే అతిశయోక్తి కాదు. అయితే సాంకేతికంగా ఏపీ ప్రభుత్వ కొత్త ప్రాజెక్టులను వ్యతిరేకించవచ్చు. కాని ప్రాక్టికల్‌గా ఆలోచించి ఏపీ ప్రభుత్వం కనుక తన వాటా మాత్రమే ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకు వెళితే అభ్యంతరం చెప్పకూడదు. అలాగే తెలంగాణలో కూడా పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులకు వారి వాటాలో నీటిని తీసుకు వెళ్తుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభ్యంతరం చెప్పకూడదు.
వరద నీరు వస్తున్నప్పుడు ప్రాజెక్టులు నిండిన తర్వాత కిందకు సముద్రంలోకి పోయే నీటిని రెండు రాష్ట్రాలు ఎంత ఎక్కువ వీలైతే అంత మొత్తాన్ని తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు సాగించాలి. అప్పుడే వీరు ప్రజలకు న్యాయం చేసినట్లు అవుతారు. వీటన్నిటిని మించి ఈ ప్రాజెక్టులపై ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని సెటిల్ చేసుకుంటే మంచిది. అది సాధ్యం కాకపోతే, ఈ ప్రాజెక్టుల వివాదాన్ని దీని వరేక పరిమితం చేసి, మిగిలిన విషయాలలో కేసీఆర్, జగన్‌లు కలిసి ముందుకు సాగడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేసినవారు అవుతారు. కేసీఆర్, జగన్‌లు ఈ విషయంలో క్లారిటీతోనే ఉన్నట్లు కనిపిస్తుంది. అంతవరకు సంతోషించవలసిన అంశమే.