ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయిందని మీడియా కోడై కూస్తోంది. కేంద్రం కలగజేసుకుని ఆర్థిక ఎమర్జన్సీ ప్రకటించాలని, వీలైతే ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతిపాలన విధించాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. రాష్ట్రనిధులను సంక్షేమ పథకాల పేర పప్పుబెల్లాల్లా పంచిపెడ్తున్నారు తప్ప, అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని నిపుణులు సైతం మొత్తుకుంటున్నారు. నాయకులందరికీ ఎన్నికలలో హామీలు యివ్వడం పరిపాటి అని, వాటిలో సగం కాదు, పావు వంతు చేసినా ప్రజలు తృప్తిపడతారనీ, జగన్ చూడబోతే నవరత్నాలే కాక, యింకా కొత్త కొత్త రత్నాలు, వైఢూర్యాలను కూడా చేర్చడం విడ్డూరంగా వుందని, పైగా క్రమేపీ చేసుకుంటూ పోకుండా ఒకేసారి యింత భారాన్ని తలకెత్తుకోవడం తలకు మించిన భారమని, యివి కొనసాగించలేక ఎన్నికల ముందు చతికిల పడితే రాజకీయంగా అనర్థమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘కొనసాగించలేనని జగన్‌కూ తెలుసు, జైలుకి వెళ్లడానికి ముందు పథకాలను తారస్థాయికి తీసుకెళితే, తనను జైలుకి పంపడం చేత అవి ఆగిపోయాయని చెప్పి సామాన్యులను ప్రతిపక్షాలపై ఉసిగొల్పవచ్చని అతని వ్యూహం.’ అని రాజకీయ పండితులు జోస్యం చెపుతున్నారు.
ఇవన్నీ వింటూ కూడా జగన్ తన పద్ధతిని మార్చుకోవడం లేదు. తన హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని, ఎంతసేపూ అప్పులకు వడ్డీ కట్టుకుంటూనే వుండిపోవాలని ఆయన భావిస్తున్నారా? పాతికేళ్లు సిఎంగా వుందామనుకునే వ్యక్తి అభివృద్ధి గురించి పట్టించుకోకుండా పేదల చేత ఆహాఓహో అనిపించుకుని తృప్తిపడితే అది రాజకీయచతురత అనిపించుకుంటుందా? వచ్చే ఎన్నికలలో నెగ్గకపోయినా ఫర్వాలేదు, ‘మనసున్న మారాజు’గా ప్రజల గుండెల్లో నిల్చిపోతే చాలు అనుకుంటున్నారా జగన్? ఐదేళ్లపాటు రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటమాడితే భావితరాలు తనను క్షమించవన్న ఎఱిక లేదా ఆయనకు? ప్రతీ ముఖ్యమంత్రికీ తన పదవీకాలం కొనసాగాలనే ఆశయం, ఆశ వుండడం సహజం. ఈ తరహా పాలనాధోరణితోనే మళ్లీ ఎన్నికవుతాననే ధీమా ఆయన కుందా? తన చర్యలను ఆయన ఏ విధంగా సమర్థించుకోగలడు? జగన్ ప్రెస్‌మీట్‌లు పెట్టరు. ఇంటర్వ్యూలు యివ్వరు. ఆయన ‘మన్‌కీ’ బాత్ ఏమిటో ‘మనకి’ తెలియదు. అందువలన ఊహించవలసినదే. ఊహిద్దాం.
జగన్ వచ్చాక ఆంధ్రలో అభివృద్ధి ఆగిపోయిందని అంటున్నారు కాబట్టి అసలు అభివృద్ధి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. గతంలో అన్ని స్థాయిల ప్రజలూ బతకగలగడాన్ని అభివృద్ధి అనేవారు. క్లాసులో అత్తెసరు మార్కులు వచ్చినవాడికి గుమాస్తా ఉద్యోగం వస్తే, ఫస్ట్ క్లాస్ వచ్చినవాడికి ఆఫీసరు పోస్టు వచ్చేది. డిస్టింక్షన్ వచ్చినవాడు గ్రూపు వన్ పరీక్షలకు కూర్చునేవాడు. ఇప్పుడు బిఏ, బియస్సీ, బికాంలు చదివేవారు తగ్గిపోయారు. ఇంజనీర్ కావాలి, యుఎస్ వెళ్లి డాలర్లు సంపాదించాలన్న కోరికతో అందరూ పరుగులు పెట్టడంతో మామూలు డిగ్రీలకు విలువ లేకుండా పోయింది. అమెరికాలో ఏదో ఒకటి చేసైనా, ఆస్తులు సంపాదించడమే అభివృద్ధికి హాల్‌మార్క్ అనే భావం బలపడి, సొంతూర్లో మూమూలు ఉద్యోగం చేస్తూ తృప్తిగా బతికేవాడు మనిషి కాడనే అభిప్రాయాన్ని వ్యాప్తి చెందింది.
సినిమాల పరంగా చెప్పాలంటే గతంలో అని బడ్జెట్లలోనూ సినిమాలు తయారయ్యేవి. ఇప్పుడు 2 కోట్లలో లేదా 50 కోట్లలో! మధ్యరకమే లేకపోవడాన్ని అభివృద్ధి అందామా? బాహుబలి తర్వాత తెలుగు సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది అన్నారు. ఎక్కడికీ వెళ్లలేదు. సక్సెస్ రేటు 10-15 శాతమే, కరోనా కాలంలో సినీకార్మికులు మలమలమాడారు అంటున్నారు చిరంజీవి. ఒక్క బాహుబలిని చూపించి తెలుగు సినీరంగం అభివృద్ధి చెందేసింది అని చెప్పుకోవడం కరక్టయితే, హైటెక్ సిటీ బిల్డింగు చూపించి రాష్ట్రమంతా వెలిగిపోయిందని, పటేల్ విగ్రహం చూపించి దేశమంతా మిరిమిట్లు గొల్పుతోందని చెప్పుకోవడమూ కరక్టే.
ప్రయివేటు సెక్టార్, పబ్లిక్ సెక్టార్ పోటీపడుతూ వైట్ రివల్యూషన్, గ్రీన్ రివల్యూషన్ వంటివి సాధిస్తూ, దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమతి చేయగలిగే స్థితికి రావడం అభివృద్ధిగా గతంలో అనుకునేవారు. ప్రపంచీకరణ తర్వాత దిగుమతి చేసుకోవడాన్ని ఘనతగా చెప్పుకోసాగాయి ప్రభుత్వాలు. షేర్ మార్కెట్ సెన్సెక్స్ పెరిగితే భారత్ గర్జించింది, గాండ్రించింది అని ప్రకటనలిచ్చారు. మెట్రోలు, బుల్లెట్ రైళ్లు, ఫార్ములా వన్ కారు రేసులు, ప్రపంచ స్థాయి అందాల పోటీలు యివన్నీ అభివృద్ధికి సూచికలుగా చూపిస్తున్నారు. దారిద్ర్య రేఖ కింద కొట్టుమిట్టులాడుతూన్న పేదలు వీళ్ల కంటికి ఆనరు. కరోనా కాలంలో అంబానీ, అదానీల ఆస్తులు పెరిగితే మనం మురిసి చప్పట్లు కొట్టాలిట. మరి వలస కార్మికులూ భారతీయులే కదా వారి గతేమిటి?
కరోనా టైములో పరిశ్రమలు మూతపడ్డాయి, ఉద్యోగాలు ఊడాయి, భవిష్యత్తు అగమ్యగోచరమై పోయింది అని బాధపడుతూంటే ‘బాధెందుకు, కొత్త సెక్రటేరియట్ కడుతున్నాంగా, కొత్త పార్లమెంటు కడుతున్నాంగా, గర్వంగా తలెత్తుకుని కాలరెగరేయండి’ అని చెప్తున్నారు పాలకులు. భౌతికంగా మనది ఒక దేశమే అయినా స్థాయిపరంగా రెండు భిన్నధృవాలు పక్కపక్కనే వసిస్తున్నాయి. పాతాళలోకవాసి సంవత్సరాదాయాన్ని, నచ్చిన డాన్సర్‌కు దిష్టితీసి పారేయగలిగిన స్వర్గలోకవాసులూ యిక్కడే వున్నారు. ఆకాశాన్నంటే హర్మ్యాల పక్కనే, మరుగుదొడ్లు కూడా లేని మురికివాడలుంటున్నాయి. దేశస్థూలాదాయం పెరుగుతున్నా ధనిక, పేద వ్యత్యాసం విపరీతంగా పెరిగిందని ఆర్థిక శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. ఆ వ్యత్యాసం పెరిగినకొద్దీ సమాజంలో అశాంతి, అలజడి, తీవ్రవాదం పెరిగే ప్రమాదం వుందని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అయినా మన పాలకులు షోబిజినెస్‌నే నమ్ముకున్నారు. పెద్దపెద్ద భవంతులు కట్టడం, పెద్దపెద్ద విగ్రహాలు నిలబెట్టడం, చుట్టూ పార్కులు నిర్మించడం, స్మార్ట్ సిటీలంటూ వేలకోట్లు గుమ్మరించడం. అదేమిటంటే టూరిజం వ్యాప్తికై చేస్తున్నాం, పర్యాటకుల నుంచి వచ్చే ఆదాయంతో యీ ఖర్చు రాబట్టేస్తాం అంటున్నారు. నగరాలలో పరిశుభ్రమైన తాగునీరు యివ్వలేకపోతున్నారు, కిట్టుబాటు ధరలు లేక రైతులు, చేనేత పనివారు ఆత్మహత్య చేసుకుంటున్నారు, యువతులు అక్రమరవాణా బారిన పడుతున్నారు, గ్రామీణులు పొట్టగడవక నగరాలకు వలస వచ్చి, కాలుష్యాన్ని పెంచి, రోగాల పాలవుతున్నారు. వీటి గురించి పట్టించుకుని, ఖర్చు పెడితే ఏమొస్తుంది అనే ఆలోచనలో పాలకులు పడ్డారు. ఏదైనా భారీగా కట్టాలి, పబ్లిసిటీకి ఉపయోగించుకోవాలి.
వంద మందికి మాత్రం ఉద్యోగాలివ్వగలిగిన ఐటీ కంపెనీకి నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టి, చూశారా, మీ పిల్లలందరూ అమెరికా వెళ్లడానికి రహదారి ఏర్పరచాను అని చెప్పుకోవాలి. అదే అదే నాలుగు వందల ఎకరాల్లో వంద చిన్న కంపెనీలకు వసతులు కల్పిస్తే వెయ్యి మందికి ఉద్యోగాలు రావచ్చు, కానీ అవి చిన్నా చితకా ఉద్యోగాలు, ఘనంగా చూపించుకోవడానికి ఏముంటుంది? ఆ ఉద్యోగులు అమెరికా వెళ్లరు, రియల్ ఎస్టేటు ధరలు పెరగడానికి ఉపయోగపడరు. ఇంకేం లాభం? – ఇదీ నేటి పాలకుల ఆలోచనా ధోరణి.
దీన్ని అభివృద్ధికి సూచికగా జగన్ అనుకోవటం లేదని తోస్తోంది. సామాన్యుడి స్థితిగతులు పెంపొందించి, అతనికి ఉన్న ఊళ్లోనే సౌకర్యాలు ఏర్పరచి, తన బతుకు తను బతికేట్లా చూస్తే అదే నిజమైన అభివృద్ధి అని జగన్ అభిప్రాయం అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ పనుల్లో భారీతనం కనబడదు. అట్టహాసం కనబడదు. అన్నీ చిన్న తరహా ప్లాన్లే. పథకాల రూపంలో యిచ్చేది చిన్నచిన్న మొత్తాలే. గ్రామ వాలంటీర్లకు యిచ్చే మొత్తాలూ చిన్నవే. చంద్రబాబు అంటే భారీతనం. బంగారు బాతుని నిర్మిస్తే అది పెట్టే గుడ్లతో తరతరాల పాటు రాష్ట్రాన్ని పోషించవచ్చు అనే ఫిలాసఫీ ఆయనది. ఆ బంగారు బాతుని సృష్టించడానికి ఎంత బంగారం అవసరం పడుతుంది, ఎన్ని తరాలు పడతాయి అనేది జగన్ ప్రశ్న. అందుకే అంతర్జాతీయ నగరం, అద్భుతనవ నగరసముదాయం అంటూ అమరావతికి బాబు రూపకల్పన చేస్తే ‘అంతొద్దు, ఇంత చాలు’ అంటూ వైజాగ్‌లో యిప్పటికే ఉన్న సౌకర్యాలతో సర్దుకుందాం అంటున్నాడు జగన్. అన్నీ ఒక చోటే పెట్టి మహానగరం కడితే నిర్మాణభారం, నిర్వహణాభారం, అక్కడి జీవనవ్యయం ఎక్కువై సామాన్యులు ఉండలేని పరిస్థితి వస్తుంది కాబట్టి, దాన్ని ముక్కలు చేసి, వేర్వేరు జిల్లాలలో పెడితే సూక్ష్మంలో పోతుంది కదా అని జగన్ వ్యూహం.
బాబు కలలు కన్నారు, వాటిని నిజం చేస్తానని ప్రజలను నమ్మించారు. వాళ్లు ఐదేళ్లపాటు ఛాన్సిచ్చి చూశారు. కలలు కల్లలని తేలడంతో ఆయన్ని దింపేసి జగన్‌కు ఛాన్సిచ్చారు. బాబులా తలకు మించిన భారాన్ని తలకెత్తుకుని బోర్లపడదలచుకోని జగన్, మొత్తమంతా స్కేల్‌డౌన్ చేసేశారు. బాహుబలి లాటి సినిమా తీసి, మొదటి రోజు టిక్కెట్టును 500 రూ.లకు అమ్మి, కొంతమంది ధనికులని అలరించేబదులు, మీడియం బడ్జెట్‌లో సినిమా తీసి 100 రూ.ల టిక్కెట్టుతో సామాన్యు లెక్కువమందిని అలరిద్దామని చూస్తున్నారు. బాబు ఉన్నంతకాలం మనకు ప్రపంచంలోని దేశాలన్నిటి పేర్లూ వినబడేవి. ఆ దేశాల వాళ్లందరూ యిక్కడికి వచ్చి మన అమరావతి చూసి తెల్లబోతారని చెప్పేవారు. మన రైతుల్ని సింగపూరుకి పంపించారు. జగన్ వచ్చాక అదేమీ లేదు, అంతా దేశవాళీ సరుకే.
ఈ రోజుల్లో గ్రామానికి వెళితే అక్కడ గ్రామ సచివాలయం కనబడుతోంది, ‘నో వేకెన్సీ’ బోర్డు వేళ్లాడుతూన్న సకల సౌకర్యాల ప్రభుత్వ పాఠశాల కనబడుతోంది, డాక్టర్లు, మందులు లభిస్తున్న విలేజి క్లినిక్ కనబడుతోంది, నాణ్యమైన విత్తనాల పంపిణీ నుంచి రైతులకు అన్ని రకాలుగా సహాయపడే రైతుభరోసా కేంద్రం కనబడుతోంది. ఇది కాదా అభివృద్ధి అని జగన్ చెవిలో అడుగుతున్న ట్లనిపిస్తోంది. ఏ జాతినైనా అభివృద్ధి చేయాలంటే నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించాలి అనేది అందరికీ తెలిసిన సూత్రమే అయినా ప్రభుత్వాలు ఆ పనిని ప్రయివేటు రంగానికి అప్పగించి కూర్చున్నాయి. వాటి ద్వారా ప్రయివేటు రంగం నిలువుదోపిడీ చేస్తోంది.
ఈ రోజు ఏ తలిదండ్రులనైనా చూడండి, పిల్లలకు చదువు చెప్పించి ప్రయోజకుల్ని చేయడానికి ఎంత కష్టానికైనా, ఎంత ఖర్చుకైనా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లు నిరర్థకమై పోయాయి. వెళితే ఏ నిమిషాన కప్పు కూలి నెత్తినపడుతుందో తెలియదు. టీచర్లు స్వయంగా రారు, తమ బదులుగా ఎవరినో పంపుతారు. స్థాయి పడిపోవడంతో ఓ మాదిరి స్తోమత వున్నవారెవరూ పిల్లల్ని పంపడం మానేశారు. దాంతో టీచర్లను నిలదీసేవారు లేకుండా పోయారు. టీచర్ల దగ్గర్నుంచి తమ పిల్లలను ప్రయివేటు స్కూళ్లకే పంపసాగారు. పైగా ఇంగ్లీషు మీడియం కావాలంటే అవే గతి. ఈ విధంగా విద్యపై ప్రభుత్వం పెట్టే ఖర్చంతా వృథాగానే పోయేది. జగన్ వచ్చి ఆ వృథా ఖర్చును ప్రయోజనకరంగా మార్చేశారు, భవిష్యత్తుకి పెట్టుబడిగా మార్చారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా స్కూళ్ల రూపురేఖల్నే మార్చేశారు. టాయిలెట్ల దగ్గర్నుంచి అన్ని సౌకర్యాలూ అమర్చారు. టీచర్లకిచ్చే జీతం నుంచి పూర్తి ఫలాన్ని పొందేలా రూపకల్పన చేశారు.
ఇంగ్లీషు మీడియం కూడా పెట్టడంతో పిల్లలు ఆకర్షితులయ్యారు. ఉన్న వూళ్లోనే ప్రభుత్వ స్కూలుకి ఎగబడసాగారు. చదువు కోసం వేరే వూళ్లోని ప్రయివేటు స్కూళ్లకి పంపి, హాస్టల్లో పెట్టే ఖర్చంతా మిగిలిపోయింది కదా. ఆ మేరకు వాళ్లకు అదనపు ఆదాయం కలగచేసినట్లే కదా! సమాజానికి పలురకాలుగా అనర్థదాయకమైన బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలంటే ఏకైక మార్గం, స్కూలు డ్రాపౌట్లను తగ్గించడం. అందుకే అమ్మ ఒడి పథకం పెట్టడం జరిగింది. 70% అటెండెన్సు వుండి తీరాలి అనే నిబంధనను కోవిడ్ కారణంగా అమలు చేయలేక పోయారు కానీ, స్కూళ్లు పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాక అమలు చేస్తారట. చదువు పెరిగితే సమాజంలోని అనేక రుగ్మతలు ఆటోమెటిక్‌గా తగ్గుతాయి. అక్షరాస్యత జాతీయ స్థాయిలో 73% ఉంటే ఆంధ్రలో 67% వుంది. మరి యిన్నాళ్లూ ఆంధ్ర అభివృద్ధిలో దూసుకుపోయిందని చెప్పుకునేవారికి యీ అంకెలు కనబడవా? ఈ రోజు విద్యార్జనను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పథకం పెడితే, వాళ్లు వెళ్లే స్కూళ్ల స్థితిగతులను మెరుగుపరచడానికి ‘నాడు-నేడు’ పెడితే దాన్ని సంక్షేమం అందామా? అభివృద్ధికి పెట్టుబడి అందామా?
ఇక వైద్యరంగానికి వస్తే ప్రయివేటు రంగం ఎలా దోపిడీ చేస్తోందో తెలుసు. కరోనా టైములో బాగుపడినదెవరైనా వున్నారా అంటే ఆసుపత్రుల యజమానులే. చిత్తం వచ్చినట్లు దోచేశారు. మెడికల్ ఇన్సూరెన్సు కూడా పనికి రాదు, క్యాష్ యివ్వాల్సిందే అన్నారు. అయినా ప్రజలు ప్రాణాలు నిలుపుకోవడానికి సరేనన్నారు. దీనికి ముఖ్యకారణం, దశాబ్దాలుగా ప్రాథమిక వైద్యకేంద్రాలను నిర్లక్ష్యం చేయడం. అక్కడ శుచీశుభ్రం వుండవు, మందులుండవు, వైద్యులు దొరకరు. తరతరాలుగా చేసిన నిర్లక్ష్యానికి మూల్యం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. వాటిలో అవకతవకల గురించి అందరికీ తెలుసు. ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసిన రోజున ఆరోగ్యశ్రీని కుదించి వేయవచ్చు. జగన్ యిప్పుడు ఆ పనిలోనే వున్నారు.
విలేజి క్లినిక్‌ల ద్వారా రోగాలను తొలిదశలోనే గుర్తిస్తే సామాన్యుడు వైద్యంపై పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అదీ అదనపు ఆదాయంగానే లెక్క వేయాలి. ఒక జిల్లాలో మెడికల్ కాలేజి వుంటే ఆ జిల్లా మొత్తమంతా మెడికల్ వాతావరణం ఏర్పడుతుంది. చిన్న చిన్న ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఆల్టర్నేటివ్ మెడిసిన్.. యిలా ఎన్నో పుట్టుకుని వస్తాయి. జగన్ 13 మెడికల్ కాలేజీలు పెడతానంటున్నారు. అది దీర్ఘకాలిక ప్రణాళికే. అంతమంది ఫ్యాకల్టీ ఎక్కణ్నుంచి వస్తారో కూడా డౌటే. అయినా ఆ దిశగా అడుగులు పడడం అభివృద్ధివైపు నడిచినట్లే కదా! విలాసాలకై క్లబ్బులు పెట్టించడం జరిగిన అభివృద్ధికి సంకేతంగా చెప్పుకోవచ్చేమో కానీ, మెడికల్ కాలేజీలు పెట్టించడం జరగబోయే అభివృద్ధికి సంకేతం.
యావన్మంది బిజెపి సైన్యం దండెత్తి వచ్చినా దిల్లీలో కేజ్రీవాల్ నిలదొక్కుకోవడానికి కారణం ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దడం, మొహల్లా క్లినిక్స్ పేర పేటపేటనా ఆసుపత్రులు పెట్టడం. కేరళలో విజయన్ ప్రభుత్వం కూడా గతంలో కంటె ఎక్కువగా సీట్లు సంపాదించడానికి కారణం, ప్రభుత్వ విద్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రులు. దిల్లీలో, కేరళలో మహానిర్మాణాలు తలపెట్టలేదు వాళ్లు. చూడబోతే జగన్‌కు వాళ్లే ఆదర్శమనిపిస్తోంది. ఇప్పుడు వాలంటీరు వ్యవస్థ వుంది. నిరుద్యోగ భృతి ఊరికే యిచ్చే బదులు, కొంత యిచ్చి వారి నుంచి సేవలు పొందడం మేలు కదా! కరోనా సమయంలో వాలంటీరు వ్యవస్థను అందరూ మెచ్చుకున్నారు. దాన్ని పెట్టుబడిగా చూడాలా? ఖర్చుగా చూడాలా?
నిజానికి సంక్షేమ పథకాల వెచ్చిస్తున్న నిధులను ఖర్చుగానూ చూడవచ్చు, పెట్టుబడిగానూ చూడవచ్చు. రాష్ట్రజనాభాలో 84% మంది ప్రభుత్వం నుంచి ఏదో ఒక పథకం లబ్ధి పొందుతున్నారు. ఆ విధంగా వచ్చిన 60 వేల కోట్ల డబ్బును వారు మార్కెట్లో ఖర్చుపెడుతున్నారు, వస్తూత్పత్తికి, వ్యాపారాభివృద్ధికి, మొత్తంగా ఎకనమిక్ యాక్టివిటీకి దోహదపడుతున్నారు. దానిలో సుమారు 70% దాకా పన్నుల రూపేణా ప్రభుత్వానికి మళ్లీ వచ్చి చేరుతోంది. ఈ మనీ సర్క్యులేషన్ చాలా ముఖ్యం. రాజుల కాలంలో వాళ్లు గుళ్లు కట్టించడం, రోడ్లు వేయించడం ప్రజలకు పని కల్పించడానికే. చేతిలో డబ్బాడక పోతే మొత్తం మాన్యుఫేక్చరింగ్ యిండస్ట్రీ మూతపడుతుంది. కరోనా సమయంలో అమెరికా ప్రభుత్వం ఉద్యోగాలు తీసేయద్దంటూ కంపెనీ యజమానులకు ఉద్యోగులకివ్వాల్సిన ఏడాది జీతాలను అందించింది. ప్రతీ ఉద్యోగికీ విడిగా 3 వేల డాలర్లిచ్చింది. ఆ విధంగా వస్తూత్పత్తి ఆగిపోకుండా చూసింది.
ఆంధ్రకు వచ్చేసరికి పథకాల కారణంగా డబ్బు చేతులు మారుతూ వచ్చింది. అందుకే సంక్షోభ సమయంలో జాతీయ జిడిపి మైనస్ 7.2% వుంటే, ఆంధ్రలో అది మైనస్ 2.0% గానే వుంది. కరోనా తగ్గుముఖం పట్టిన కొద్దీ అన్ని రాష్ట్రాలలాగానే ఆంధ్రకు కూడా ఆదాయం పెరుగుతుందని అంచనా వేయడం అసహజం కాదు. ఈలోగా ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడాలు, పెన్షన్లు బకాయి పెట్టడాలూ తప్పవు. ఉద్యోగికి జీతం ఓ పదిరోజులు ఆలస్యంగా వచ్చినా అతను తన పరపతితో బండి లాక్కుని రాగలడు, కానీ ఒక పెన్షనరుకి అలా కుదరదు కదా, అందుకని పెన్షనర్లకు ఒకటో తారీక్కే డబ్బు అందించాలి అనే ఊహతో కాబోలు జగన్ ఉద్యోగుల పట్ల తాత్సారం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వమన్నాక ఆలస్యాలుంటాయి. ఆదాయం పెరిగాక ఏ కమిషన్లు లేకుండా బిల్లులు పే చేసేస్తాంగా, అప్పటిదాకా వాళ్లు ఓర్చుకోవాలి అన్న ధీమా కాబోలు జగన్‌ది.
జగన్ వచ్చాక కూలీనాలీ జనం చేతిలో డబ్బులాడుతున్నాయి. పొలాల్లో పనిచేయడానికి రావటం లేదు అనే విమర్శ వుంది. అది వాస్తవం కూడా. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కూలివాళ్ల రేట్లు కూడా మారాలనే దృక్పథం జగన్‌ది. 10 ఏళ్ల క్రిందటి ఆదాయాలతో పోలిస్తే, భూమి రేట్లతో పోలిస్తే రైతుకి ఆదాయం పెరిగింది కదా, మరి కూలీ రేట్లు పెంచనంటే ఎలా? కూలీని పెట్టుకోకూడదంటే యంత్రాలతో పనిచేయించుకోవాలి. లేదా తనే స్వయంగా చేసుకోవాలి. అమెరికాలో పనివాళ్లను భరించలేం కాబట్టి, యంత్రాలతో పని చేయించుకుంటున్నాం. కూలివాళ్లు చౌక రేట్లకు లభ్యం కావాలి కదాని వాళ్లను అలాగే అధోస్థితిలో వుంచడం న్యాయం కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా మన మైండ్‌సెట్ కూడా మారాలి అని జగన్ తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు భోగట్టా.
సమాజంలోని బడుగు వర్గాలనే టార్గెట్ చేసుకుని, వారికోసమే ఖర్చు చేస్తూ, తక్కిన వర్గాలను పట్టించుకోవటం లేదని తనపై వస్తున్న విమర్శలు జగన్‌కు తెలియకుండా పోవు. సమాజంలో అన్ని వర్గాలనూ ఏకకాలంలో తృప్తిపరచడం ఎవరికీ సాధ్యం కాదు. గతంలో చంద్రబాబు ఐటీపైనే దృష్టి పెట్టి గ్రామాలను నిర్లక్ష్యం చేశారు. దాని ఫలితంగా ఇతర రాష్ట్రాలలో, దేశవిదేశాల్లో ఆయనకు పేరు వచ్చింది కానీ 2004 ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. ఆయన డెవలప్ చేసిన కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఓటర్లు కూడా ఆయనకు ఓటేయలేదు. ఇది గమనించి, తర్వాత వచ్చిన వైయస్ గ్రామాలపై దృష్టి పెట్టి, అభివృద్ధి మార్గాన్ని అటు మళ్లించారు. ఎన్ని అవినీతి ఆరోపణలున్నా, 2009లో ఆయన విజయానికి అదే ఉపకరించింది.
ఇప్పుడు జగన్ కూడా సమాజంలో మెజారిటీ ఓటర్లను తృప్తి పరిచే పనిలో వున్నారు. టిడిపి రాజకీయంగా ఎంత బలహీనంగా వున్నా దాదాపు 30% మంది ఓటర్లు వైసిపికి దూరంగానే వున్నారు. ఎంత ప్రయత్నించినా జగన్ దాన్ని ఏ 25శాతానికో తగ్గించగలరంతే. వారిలో మధ్యతరగతి వాళ్లు, ధనికులు ఎక్కువమంది. అవినీతిరహితంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తే జనాభాలో 65% మంది తృప్తి పడతారు, వాళ్లే తనను మళ్లీ అధికారంలోకి తెస్తారనే ధీమా జగన్‌ది. ఇందిరా గాంధీకి, ఎన్టీయార్‌కు వెన్నుదన్నుగా నిలిచినది యీ బడుగు వర్గాలే. వారికి మేలు చేసిన నాయకులు రాజకీయంగా పొరపాట్లు చేసినా క్షమించేగుణం వీరికే వుంది. మధ్యతరగతి వారికి లేదు.
పరిశ్రమలు వచ్చినపుడు మధ్యతరగతితో బాటు అన్ని తరగతుల వాళ్లూ లాభపడతారు. పరిశ్రమల విషయంలో కూడా జగన్ దృక్పథం తేటతెల్లంగా తెలుస్తోంది. బాబు పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లారు, ప్రతీ ఏటా పెట్టుబడులకై భారీ సదస్సులు నిర్వహించారు. జగన్ అటువంటివి అట్టహాసపు కార్యక్రమాలు పెట్టుకోలేదు. నిజానికి మన దేశంలో ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్‌కు వెళ్లారు కనుక? అయినా పరిశ్రమలు రావటం లేదా? భూములిస్తాం, దశాబ్దాల పాటు పన్ను రాయితీలిస్తామంటూ పెద్ద పారిశ్రామికవేత్తల వెంట పడేబదులు, చిన్నవాళ్లకు ఏర్పాట్లు సమకూరిస్తే, గ్రామాల్లో సైతం రోడ్లు, విద్య, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు ఏర్పరిస్తే చిన్న పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి. అందుకే ఆంధ్రకు 35 వేల కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయి.
కియా సంగతే చూసుకుందాం. చెప్పుకోవడానికి గొప్పగా వుంటుందని వందల ఎకరాలు కట్టబెట్టారు, పన్నుల రూపేణా 4 వేల కోట్ల రూ.ల ప్రయోజనం కల్పించారు. ఈ రోజు తమిళనాడు నుంచి ఫోర్డు తప్పుకున్నట్లుగా, పదేళ్లకో, పదిహేనేళ్లకో కంపెనీ మెర్జరో, ఎమాల్గమేషనో జరిగి, లేదా ఆటోమొబైల్ రంగంలో సంక్షోభం వచ్చి కియా వెళ్లిపోదన్న గ్యారంటీ ఏమైనా వుందా? పెద్ద పరిశ్రమలు వస్తే వాళ్లలో కొందరు బ్యాంకు ఋణాలు తీసుకుని, ఆ డబ్బును చాటుగా విదేశాలకు చేరవేసి, తామూ జంప్ అయిపోతున్నారు. ఆ డబ్బు యిక్కడ సర్క్యులేట్ కావటం లేదు. దానికి బదులు పదిమంది చిన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే కనీసం వాళ్లు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడతారు. అయితే చిన్న పరిశ్రమల గురించి గొప్పగా పబ్లిసిటీ చేసుకోవడానికి ఏమీ వుండదు. వాళ్లు విజయ్ మాల్యాలా హంగు చేయలేరు. గాలి జనార్దనరెడ్డిలా ఒంటిచేత్తో ఎయిర్‌పోర్టు కట్టేస్తానని బీరాలు పలకలేరు.
మనం కొద్దికాలంగా అభివృద్ధి అంటే పబ్లిసిటీ, పెద్ద పరిశ్రమలు, విదేశీ పర్యటనలు అనే అభిప్రాయంలో వున్నాం. అందుకే జగన్ ఆ దిశగా ఏమీ చేయటం లేదని అనుకుంటున్నాం. కానీ హంగూ ఆర్భాటం లేకుండా చాపకింద నీరులా క్రమేపీ అభివృద్ధిని పేదవర్గాలకు విస్తరింపచేయడమే అభివృద్ధి అని జగన్ దృక్పథమని తోస్తుంది. దాని ఫలితాలు ఐదేళ్ల లోపున తప్పక చూపిస్తాయని, అవే తనను మళ్లీ గెలిపిస్తాయని ఆయన అంచనా కావచ్చు. అమరావతి, పోలవరం అంటూ హెచ్చులకు పోయి, చంద్రబాబు దెబ్బ తిన్నారు. దానికి యాంటీడోట్‌గా ఉంది జగన్ వ్యవహారం. ఇదే విజయానికి సోపానమని ఆయన భావన కావచ్చు. చూదాం, ఏమౌతుందో!