తనను వైసీపీ అధినేత జగన్ వంచించాడని తీవ్ర ఆరోపణలు చేసిన వంగవీటి రాధాకృష్ణ మనసు మారిందా? మళ్లీ జగన్ పంచన చేరనున్నారా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. ఈ ప్రచారానికి నిన్న గుడివాడలో మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ మధ్య సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీనే బలం కలిగిస్తోంది.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో వంగవీటి రాధాకృష్ణ క్రియాశీలకంగా పనిచేశారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. 2019 ఎన్నికల ముంగిట విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో జగన్‌తో వంగవీటి రాధాకు విభేదాలు వచ్చాయి. ఆ స్థానాన్ని మల్లాది విష్ణుకు ఖరారు కావడం, మరోచోటికి వెళ్లాలని రాధాను కోరడంతో సమస్య ఉత్పన్నమైన సంగతి తెలిసిందే.
మచిలీ పట్నం ఎంపీ స్థానానికి పోటీ చేయాలనే పార్టీ ప్రతిపాదనను వంగవీటి తిరస్కరించి…చేజేతులా రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేసుకున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదంతా గతం.
తాజాగా వైసీపీలో చేరేందుకు వంగవీటి రాధా సుముఖంగా ఉన్నారని సమాచారం. గుడివాడలో ఆదివారం మంత్రి కొడాలి నానికి చెందిన అతిథిగృహంలో వంగవీటి రాధా, కొడాలి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్నేహితుడైన వంగవీటి రాధాను ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలనే పట్టుదలతో కొడాలి నాని ఉన్నట్టు సమాచారం.
ఇటీవల కొడాలి నానిపై వంగవీటి రాధాను పోటీలో నిలుపుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాధానే పార్టీలో చేర్చుకుంటే సరిపోతుందని కొడాలి నాని ఎత్తుగడ వేసినట్టు చర్చ జరుగుతోంది.
వంగవీటికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ప్రతిపాదన చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వంగవీటి రాధా వైసీపీలో చేరడం లాంఛనమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా వుండగా 2019లో కొడాలి నానిపై పోటీ చేసిన దేవినేని అవినాష్ ప్రస్తుతం వైసీపీలో కొనసాగడం విశేషం.
దేవినేని, వంగవీటి కుటుంబాలు ఒకే పార్టీలో వుండడం రాజకీయంగా విచిత్ర పరిణామమని చెబుతారు. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం.