కొంత కాలంగా జనసేన-బీజేపీ పొత్తుపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఇటు బీజేపీ, అటు జనసేన స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ సహ ఇన్‌చార్జ్, జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ మాత్రం స్పందించడం గమనార్హం.
ఏపీలో కేవలం జనసేనతోనే తమ పార్టీ ప్రయాణం సాగుతుందని ఆయన అన్నారు. వైసీపీ, టీడీపీలతో పొత్తు ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. జనసేనతో పొత్తు వుంటుందని సునీల్ అరణ్య రోదన చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే జనసేనాని అడుగులన్నీ పొత్తు విచ్ఛిన్నం వైపే పడుతున్నాయని ఏపీలో పెద్ద చర్చ జరుగుతోంది. అధికార పక్షం వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కూడా ఒకే విధంగా జత కట్టి రాజకీయంగా విమర్శిస్తే తప్ప జనసేన-బీజేపీ మిత్రప క్షానికి రాజకీయంగా లాభించదు. కానీ జనసేనాని పవన్‌కల్యాణ్ మాత్రం టీడీపీని విమర్శించడానికి అసలు ఇష్టపడడం లేదు.
పైగా స్థానిక సంస్థల్లో కొన్ని చోట్ల టీడీపీతో కలిసి జనసేన అధికారాన్ని పంచుకుంది. దీన్ని జనసేనాని ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందనే ప్రచారానికి తెరలేచింది. అంతేకాకుండా, జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ఇటీవల ఎల్లో మీడియా ఆకాశానికి ఎత్తేస్తూ కథనాలు ప్రసారం చేస్తోంది.
జనసేనతో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళితే జగన్‌ను ఎదుర్కోవడం కష్టమని ఎల్లో బ్యాచ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తుపై సానుకూల సంకేతాలు వస్తున్నాయి. దీన్ని సునీల్ దేవధర్ కొట్టి పారేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.