పవన్ కల్యాణ్ తిట్టారు, తిట్టించుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పవన్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా అంతా పవన్ చుట్టూనే తిరిగింది.
పవన్ ని సమర్థించేవారు కొందరు, వ్యతిరేకించేవారు ఇంకొందరు.. ఇలా రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు, ప్రతి విమర్శలు, ట్రోలింగ్ తో సోషల్ మీడియాలో సెగలు పొగలు రేగాయి. అయితే ఈ ఎపిసోడ్ లో టీడీపీ మౌనంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. పవన్ కల్యాణ్ ని వైసీపీ మంత్రులు చెడామడా తిడుతున్నా టీడీపీ నుంచి కనీసం స్పందన లేకపోవడం విశేషం.
పవన్ ని సమర్థించేందుకు నోరు రాలేదా..?
జనసేన మద్దతుతో మూడు చోట్ల ఎంపీపీ స్థానాలు దక్కించుకున్న టీడీపీ.. కనీసం పవన్ కి మద్దతుగా ఎందుకు మాట్లాడలేదు. సినిమా టికెట్ల ఆన్ లైన్ వ్యవహారంలో గతంలో చాలామంది టీడీపీ నేతలు గొంతు చించుకున్నారు.
వైసీపీ ప్రభుత్వానికి సినిమా టికెట్ల వ్యవహారం ఎందుగంటూ నసిగారు, విమర్శించారు. అలాంటి వారంతా పవన్ వ్యాఖ్యలు చేసిన తర్వాత మాత్రం సైలెంట్ గా ఉండటం విశేషం. కనీసం పవన్ కి మద్దతుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న టీడీపీ సానుభూతిపరులు కూడా మాట్లాడకపోవడం మాత్రం నిజంగా ఆశ్చర్యకరం.
పవన్ ఎపిసోడ్ జరిగిన తర్వాత, వైసీపీ మంత్రుల తిట్లు మొదలయ్యాక కూడా టీడీపీ సైలెంట్ గానే ఉంది. తన మానాన తన సోషల్ మీడియాలో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమాన్ని మొదలు పెట్టింది.
డ్రగ్స్ రాకెట్ తో ఏపీకి సంబంధాలున్నాయని, వైసీపీ నేతలు డ్రగ్స్ దందాను ప్రోత్సహిస్తున్నారంటూ.. ఏవేవో లింకులు వెదికారు. చివరకు చిన్న స్థాయి నేలతంతా జూమ్ మీట్ లతో హడావిడి చేశారు. కానీ ఎక్కడా ఎవరూ పవన్ ఎపిసోడ్ ని టచ్ చేయలేదు.
ఎందుకొచ్చిన గొడవ..?
పవన్ కల్యాణ్ పై అధికార వైసీపీ విమర్శలు చేస్తున్న సందర్భంలో గతంలో కూడా టీడీపీ నింపాదిగా స్పందించేది. కానీ ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో పొత్తులు బాగానే కుదిరాయి కదా, ఇప్పుడు కూడా ఆలస్యంగా స్పందించడం ఏ వ్యూహంలో భాగమో అర్థం కావడంలేదు.
టీడీపీ మాత్రం ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సైలెంట్ గా ఉంది. పవన్ కి నేరుగా మద్దతిస్తే తమ లాలూచీ బయపడిపోతుందనే ఆలోచనలో ఉంది టీడీపీ.
అందులోనూ సినిమా ఇండస్ట్రీలో టీడీపీతో సంబంధాలున్నవారిని దూరం చేసుకోవడం ఇష్టంలేక, పవన్ కి దగ్గరకాలేకపోయిందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తమ్మీద.. ఎక్కడెక్కడి సమస్యలపైనో రెచ్చిపోయే టీడీపీ నేతలు, పవన్ ఎపిసోడ్ లో మాత్రం నోటికి తాళం వేసుకోవడం విశేషం.