మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తనే గెలుస్తానంటున్నాడు మంచు విష్ణు. తన మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, బాలకృష్ణలాంటి పెద్దలు కూడా తనకే ఓటేస్తారని చెబుతున్నాడు. చిరంజీవి-మోహన్ బాబు ఇప్పటికీ-ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ అంటున్నాడు విష్ణు.
“చిరంజీవి అంకుల్, బాలకృష్ణ అంకుల్, నాగార్జున అంకుల్, వెంకటేష్ అంకుల్ ఎప్పుడూ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. ఈసారి కూడా ఆ జోక్యం ఉండదు. చిరంజీవి అంకుల్ కు, మా నాన్నగారికి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. వాళ్ల ఫ్రెండ్ షిప్ గురించి ఎవ్వరు ఏం కామెంట్ చేసినా చివరికి అందరం ఫూల్స్ అయిపోతాం. వాళ్ల ఫ్రెండ్ షిప్ అలాంటిది. ఇక నా విషయానికొస్తే.. నామినేషన్ తర్వాత మేనిఫెస్టో చెబుతాను. అది చూసి పవన్ కల్యాణ్ అంకుల్, చిరంజీవి అంకుల్ కూడా నాకే ఓటేస్తారు.”
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్, మంత్రి కేటీఆర్ పేర్లు చెప్పడాన్ని సమర్థించుకున్నాడు మంచు విష్ణు. కొంతమంది ఎమ్మెల్యేలు, చిన్న స్థాయి మంత్రులు అసోసియేషన్ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని, వాళ్లకు చెక్ పెట్టేందుకు తన పరిచయాల్ని పైకి చెప్పాల్సి వచ్చిందంటున్నాడు.
“జగన్, కేటీఆర్ పేర్లు చెప్పి నేను ఎవ్వర్నీ బెదిరించడం లేదు. ఇంకా చెప్పాలంటే నా ప్యానెల్ లో ఎంఐఎం తప్ప అన్ని పార్టీల ప్రాతినిధ్యం ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఉంది. ఎమ్మెల్యేలు, చిన్న స్థాయి మంత్రుల ప్రమేయం ఉంది. అందుకే నేను జగన్, కేటీఆర్ పేర్లు చెప్పాను. కొంతమంది ఇగోల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి.”
ఈసారి అసోసియేషన్ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ ఉంటుందంటున్నాడు మంచు విష్ణు. చాలామంది తనకే ఓటేస్తామని చెబుతున్నారని, కానీ ఆ విషయాన్ని పైకి మాత్రం చెప్పమని తనతో అంటున్నారని అన్నాడు. గెలిచిన తర్వాత అసోసియేషన్ కు తన సొంత డబ్బుతో బిల్డింగ్ కడతానంటున్న విష్ణు.. ఎన్నికల టైమ్ లో లోకల్-నాన్ లోకల్ అంశాన్ని లేవనెత్తితే తప్పేంటని ప్రశ్నిస్తున్నాడు.