చేతులు కాల్చుకుంటున్న జగన్

తెలియక చేస్తే పొరపాటు. తెలిసి చేస్తే తప్పు.  కానీ పొరపాటు అయినా తప్పు అయినా గ్రహపాటుగా మారకుండా చూసుకోవడం విజ్ఞుల లక్షణం. కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఈ లక్షణం…

తెలియక చేస్తే పొరపాటు. తెలిసి చేస్తే తప్పు.  కానీ పొరపాటు అయినా తప్పు అయినా గ్రహపాటుగా మారకుండా చూసుకోవడం విజ్ఞుల లక్షణం. కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఈ లక్షణం అంతగా వున్నట్లు కనిపించడం లేదు.

మొండివాడు రాజుకన్నా బలవంతుడు కావచ్చు. కానీ జగన్ మొండివాళ్లకే మొండివాడు. కానీ ఆ మొండితనం ఎక్కడకు దారితీస్తోందన్నది ఆయన గమనించుకున్నట్లు కనిపించడం లేదు. అలా గమనింపు వున్నట్లు అయితే జరుగుతున్న వ్యవహారాలు అన్నీ ఇలా వుండేవి కాదు.

రంగుల లోకం

తెలుగుదేశం పార్టీ వ్యవహారం పరమ హీనంగా వుంటోంది. అది వాస్తవం ఎందుకంటే తన పాలనలో అన్న క్యాంటీన్లకు పసుపు రంగులువేసిన వైనాన్ని, కరెంట్ స్తంభాలకు పసుపు రంగు పూసిన సంగతిని, ప్రకటనల్లో సైతం పసుపు రంగు వాడిన వ్యవహారాన్ని మరిచిపోయి, పంచాయతీ భవనాలకు వైకాపా జండాల రంగులు వేయడాన్ని రచ్చకీడ్చింది. పక్కనే వున్న తమిళనాడులో ఇలాంటి వ్యవహారం ఏనాడో వుందన్న సంగతి కూడా చాలా మందికి తెలుసు. కానీ కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పులు వచ్చాయి.

సరే జగన్ కు ఎందుకు అంత పట్టుదల? పంచాయతీలకు ఏ రంగు వేయాలన్నదాని మీద ఏనాడూ ఒక నియమం ఏమీ లేదు. స్థానిక ప్రజలు గ్రామ సభ పెట్టుకుని ఏ రంగు వేసుకోవాలన్నది డిసైడ్ చేసుకోవచ్చు అని ఓ జీవో ఇచ్చేస్తే పోయే కదా? వాళ్లు నిర్ణయించుకుని పార్టీ రంగులు వేయాలా? వేరే రంగులు వేయాలా? అన్నది చూసుకుంటారు. అప్పుడు కోర్టుల ముందు కూడా ఓ వాదన అనేది సిద్దంగా వుంటుంది కదా? ఇలా ఉభయకుశలోపరి లాంటి మార్గాలు అనేకం వున్నాయి. ఆ దిశగా జగన్ ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు.

అసలు పార్టీ రంగులు వాడడం అన్నది ఇవ్వాల్టి వ్యవహారం కాదు. ఏనాడో కాంగ్రెస్ నాయకులు పలువురు, కరెంటు స్థంభాలకు, టెలిఫోన్ స్థంభాలకు జెండా రంగులు వేసేవారు. తరువాత తెలుగుదేశం పసుపు రంగు పూసేది. ఇదంతా లోకల్ గా జరిగేది. స్టేడ్ వైడ్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కాదు. అన్న క్యాంటీన్ల దగ్గర మాత్రం నిర్ణయం తీసుకోకుండానే సైలంట్ గా అమలు చేసేసారు. ఆనాడు ఎవ్వరూ కోర్టుకు వెళ్లలేదు. వెళ్లినా అప్పట్లో కోర్టులు ఏమని చెప్పేవో ఇప్పుడు ఊహించేది కాదు.

ఇలాంటపుడు ఎందుకు ఇలాంటి చిల్లర విషయంలో జగన్ పట్టుదలకు పోవడం, జనాలకు అధికారం ఇచ్చి, జనాల చేత చేయించుకోవచ్చు కదా? ఎన్నికలు అయిన తరువాత పంచాయతీలు తీర్మానం చేసుకుని, వాటికి నచ్చిన రంగులు వేసుకుంటాయి. అప్పుడు ఏ కోర్టు అయినా అంత సులువుగా అభ్యంతరం పెడుతుంది అని ఊహించడం కష్టం.

మద్యం ధరలు…బ్రాండ్లు

మద్యనిషేధం విధించాలి అన్న దానిపై జగన్ కృతనిశ్చయంతో వున్నారు. దుకాణాలు తగ్గించడం, సిండికేట్లను లేకుండా చేయడం, బార్ల సంఖ్య తగ్గించడం వంటివి ఇందుకు సాక్ష్యాలుగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది. జనాలకు మద్యం అందుబాటులో లేకుండా చేయాలని ధరలు పెంచుతున్నారు. కానీ ఇక్కడే కాదు తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ ల్లో ఇదే పరిస్థితి. అయితే ప్రతిపక్షం దీన్ని నెగిటివ్ గా ప్రచారం చేస్తోంది. జనాలకు ఓ చేత్తో డబ్పులు ఇస్తూ, మరోచేత్తో మద్యంరేట్ల పేరతో లాక్కుంటోందని ప్రచారం సాగిస్తున్నారు. జనాల్లోకి ఈ ప్రచారం బలంగా వెళ్లోంది.

మందు కోసం పెళ్లాం పిల్లలను తన్నే జనాలు వున్న రోజులు ఇవి. మందు తాగి విచక్షణారహితంగా ప్రవర్తించే జనాలున్న దేశం మనది. ఇలాంటి వారికి మద్యనిషేధం కోసం ఇలా చేస్తున్నా అంటే అర్థం అవుతుందా? సమస్యే లేదు. నిజంగా జగన్ కు మద్యనిషేధం చేసేయాలని వున్నపుడు ఒక్క స్ట్రోక్ తో చేసేయడమే. మహా అయితే రెండు, మూడేళ్లు వచ్చే ఈ ఆదాయం ఇప్పుడే పోతుంది. లేదూ అంటే ఇప్పుడు మామూలుగా వదిలేసి, మూడేళ్ల తరువాత నేరుగా మద్యనిషేధం అమలుచేసేస్తే సరి.

కానీ ఇప్పుడు అయితే జగన్ అనుసరిస్తున్న మద్యం ధరల విధానం వల్ల జనంలో విపరీతమైన నెగిటివ్ ప్రచారంసాగుతోంది. ముఖ్యంగా లిక్కర్ సిండికేట్లు ఈ విషయంలో తమ వంతు పని తాము చేస్తున్నాయి. తమ వ్యాపారాలు పోయాయి. కోట్ల ఆదాయం పోయింది. అందుకే అవి ఈ విషయంలో ప్రభుత్వాన్ని జనం దృష్టిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పరోక్షంగా తనకృషి తానుచేస్తోంది.

అదే కనుక మద్యనిషేధం అమలు చేస్తే ఏ గొడవా లేదు. ప్రతిపక్షాలు మాట్లాడలేవు. ప్రతిపక్ష అనుకూల మీడియా నొరెత్తలేదు. ముఖ్యంగా మహిళలు సంతోషిస్తారు. తాగుబోతులు ఎలాగూ అప్పడూ సంతోషించరు, ఇప్పుడూ రేట్లు పెంచినా సంతోషించరు. కానీ ఈ రేట్ల వల్ల, బ్రాండ్ల వల్ల నెగిటివ్ చాలా ఎక్కువ వుందని జగన్ గమనించాలి.

ఇసుక సంగతులు

ఈ దేశంలో దేన్నయినా అరికట్టవచ్చు కానీ అవినీతిని కాదు. ఇసుక ను కోట్ల రూపాయలుగా ఎలా మార్చుకోవచ్చో గత అయిదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుసుకున్నారు. విచ్చలవిడిగా దోచుకున్నారు. ఫ్రీ ఇసుక అనే పేరు బయటకు వచ్చి, ఎవరికి వారు మెషినరీలు పెట్టి మరీ ర్యాంపులు నడిపి, పోస్టర్లు వేసి మరీ మార్కెటింగ్ చేసి వందల కోట్లు కొల్లగొట్టేసారు.

ఇప్పుడు జగన్ ప్రభుత్వం దాన్ని సరిచేయాలని కిందా మీదా అవుతోంది. ప్రభుత్వ ర్యాంపులు పెట్టి ఒక కొలిక్కి తెచ్చింది. ఇలాంటి టైమ్ లో కరోనా వచ్చింది. వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇలాంటి టైమ్ లో నాయకుల చిలక్కొట్టుళ్లు, అధికారుల సహకారాలు అక్కడక్కడ తప్పలేదు. కానీ తెలుగుదేశం అనుకుల మీడియా అదే భూతద్దంలో చూపిస్తోంది. ఇసుక లభ్యత వున్నచోట జనాలు హ్యాపీగానే వున్నారు. కానీ ఈ మీడియాకు అది కనిపించడం లేదు.

ఇలాంటి సమయంలో జగన్ తన పార్టీ జనాలను కట్టడి చేయాల్సి. నిర్మొహమాటంగా ఇసుక అవినీతిని ఏరిపారేయాలి. ఈ విషయంలో అధికారులను కూడా జగన్ చూసీ చూడనట్లు వదిలేసినట్లు కనిపిస్తోంది. పైగా రాక రాక అధికారం చేతిలోకి వచ్చింది. ఎన్నికల ఖర్చులు కిట్టుబాటు కావాలి. దాంతో లోకల్ పార్టీ జనాలకు కూడా ఇసుకనే ఆసరాగా కనిపిస్తోంది.

ఇప్పుడు ఈ టైమ్ లో దాన్ని సెట్ చేయకుంటే పరిస్థితి విషమించే ప్రమాదం వుంది. జగన్ తరచు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులు అంకెలు చూపిస్తున్నారు. ఆయన చెప్పాల్సింది చెబుతున్నారు. సాక్షిలో రాయాల్సింది రాస్తున్నారు. అక్కడితో అంతా బాగుంది అనుకుంటున్నారు. కానీ కిందకు వెళ్లి జనాల్లో చూస్తే తెలుస్తుంది అసలు సంగతి.

రాజకీయ పరామర్శ

రాజకీయాల్లో అతి కీలకమైనది పలకరింపు. వైఎస్ కు ఎక్కువ పేరు తెచ్చింది ఇదే. ఎంతో మందిని ఆయన పేరు పెట్టి పలకరించేవారు. జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్రలో అమలు చేసింది ఇదే. ఎంతో మందిని పలకరించారు. దగ్గరకు తీసారు. అధికారం అందిన తరువాత మాత్రం ఆయన తన పనిలోతాను పడిపోయారు. రోజుకు ఒక్క ఎమ్మెల్యేకు అయిదు నిమషాలు అపాయింట్ మెంట్ ఇచ్చినా, అయిదు నెలల్లో అందరినీ కవర్ చేసేయవచ్చు.అంటే ఏడాదికి రెండుసార్లు అన్నమాట. కానీ జగన్ ఎందుకో ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను, ఇలా చాలా మందిని దూరంగా వుంచి, తన పని తాను చేసుకుంటున్నారు.

ఇది పార్టీలో అసంతృప్తికి దారి తీస్తోంది పని చేసినా చేయకున్నా, 'అలాగే చూద్దాం. చేద్దాం' లాంటి మాటలు నాయకులకు హుషారుగా వుంటాయి. జగన్ ఇలాంటివి అలవాటు చేసకోవాల్సిన అవసరం వుంది. ఒక్కో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే సంబంధీకులు అసంతృప్తి రాగాలు వినిపించడం ప్రారంభించారు. ప్రతిపక్షాలకు ఇది అస్త్రంగా మారుతోంది. జనాల్లోకి నెగిటివ్ వెళ్తోంది. జగన్ ఎప్పుడు పట్టించుకుంటారో? ఆయనకే తెలియాలి. ఎందుకంటే జగన్ కు ఎవ్వరూ చెప్పలేరు. చెప్పేసాహసం చేయలేరు. సాహసం చేసినా, ఆయన వినరు.

డబ్బులు పంచేస్తే సరికాదు

ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు,. బాబు ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ ఖజానా ఖాళీచేసి, బిల్లులుపెండింగ్ పెట్టి పోయింది. జగన్ అయిన కాడిగా అప్పులు తెస్తున్నారు. ప్రతి నెలా ఏదో పేరు చెప్పి, జనాలకు డబ్బులు పంచేస్తున్నారు. బాగానే వుంది. కానీ అభివృద్ది సంగతేమిటి? దానికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? పల్లెల్లో రోడ్లు వేసి ఏడాది  దాటుతోంది. పంచాయతీ భవనాలు కొత్తవి కేటాయించి ఏడాది దాటుతోంది. ఏ పనికీ నిధులు ఇవ్వడం లేదు.

అన్ని నిదుల జనాలకు పంచడానికే సరిపోతున్నాయి. అయిదేళ్ల తరువాత మా ఊరికి ఏం చేసారు? అని అడిగితే ఏం చెబుతారు? డబ్బులు పంచాం కదా? అంటారా? డబ్బులు అందరికీ పంచుతున్నారా? కేవలం తెల్లకార్డుల వాళ్లకే. మరి మిడిల్ క్లాస్ దృష్టిలో ప్రభుత్వం పనితీరు ఎలా వుంటుంది? ఈ దిశగా జగన్ ఆలోచించడం లేదు.

గోటితో పోయేదానికి

ప్రతీదీ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు. రంగుల వ్యవహారం కావచ్చు, స్కూళ్లలొ ఇంగ్లీష్ మీడియం కావచ్చు, విశాఖ రాజధాని కావచ్చు. అన్నీ అంతే. సింపుల్ గా మధ్య మార్గాలు ఆలోచించి ముందుకు వెళ్లిపోకుండా, ముక్కుసూటిగా వెళ్తున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నారు. కోర్టులకెక్కే చాన్స్ ఇస్తున్నారు. సైలంట్ గా పని చక్కపెట్టుకునే పద్దతుల కేసి దృష్టి సారించడం లేదు. ఆయన చెప్పింది వినడమే తప్ప అధికారులు చేయగలిగింది లేదు. నాయకులు. చెప్పే అవకాశం లేదు.

ఇలా అయితే కష్టమే.

రాబోయే నాలుగేళ్లు కనుక జగన్ ఇదే వ్యవహారశైలితో వుంటే మాత్రం ఎన్నికల వేళ చాలా కష్టపడాల్సి వుంటుంది. డబ్బులు తీసుకున్న జనాలు ఓట్లు వేస్తారు అన్నది తప్పు అని చంద్రబాబు పసుపు కుంకుమతోనే రుజువు అయిపోయింది. అందువల్ల జగన్ తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చుకోవాల్సి వుంది. ఇటు పార్టీ జనాలతో వ్యవహరించడం కావచ్చు, లేదా అటు జనాల దృష్టిలో వ్యవహారాల శైలి కావచ్చు.. లేదూ అంటే ఆకుల కోసం వెదుక్కోవాల్సిన ప్రమాదం వుంది.

చాణక్య
[email protected]