ఏవీ సుబ్బారెడ్డి పై హత్యాయత్నం వ్యవహారం అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉంది. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు ఏవీ సుబ్బారెడ్డి. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలు, కర్నూలు జిల్లా అవతలి వారికి భూమా నాగిరెడ్డి మరణానంతరం ఏవీ సుబ్బారెడ్డి గురించి తెలిసి వచ్చింది. నంద్యాల ఉప ఎన్నికల సమయానికే ఏవీ సుబ్బారెడ్డి పేరు బాగా చర్చకు వచ్చింది. అప్పటి వరకూ అఖిలప్రియ కు అనుకూలుడిగానే పేరు పొందారు. ఆ తర్వాతే రచ్చ మొదలైంది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలోనే రెండో గ్రూపుగా ఏవీ సుబ్బారెడ్డి పేరు తెచ్చుకున్నారు.
అలాగే అఖిలప్రియకూ, ఏవీకి మధ్యన ఏవో ఆస్తుల తగాదాలూ ఉన్నాయనే టాక్ మొదలైంది. భూమా నాగిరెడ్డి ఏవీ పేరు మీద అనేక ఆస్తులు పెట్టారని, ఆయన మరణానంతరం సుబ్బారెడ్డి ఆ ఆస్తులన్నీ తనవి చేసేసుకున్నారని, దీంతోనే అఖిలప్రియకు ఆయనంటే బాగా అసహనం కలుగుతూ ఉందని నంద్యాల, ఆళ్లగడ్డ జనాల్లో ఒక ప్రచారం మొదలైంది. అది ప్రజలు అనుకునే మాట. క్రమక్రమంగా ఏవీ సుబ్బారెడ్డితో అఖిలప్రియకు వివాదం తీవ్రం అయ్యింది. ఒక దశలో వీరు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలనే పోటాపోటీగా నిర్వహించారు. తనూ ఎమ్మెల్యే టికెట్ కు పోటీదారుడిని అన్నట్టుగా ఏవీ వ్యవహరించడం, వీళ్ల మధ్యన టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు పంచాయతీ చేయడం.. ఇవన్నీ అప్పట్లో జరిగాయి. తీరా ఎన్నికల సమయానికి ఏవీ సుబ్బారెడ్డి తనూ తెలుగుదేశం అన్నట్టుగా పని చేశారు. ఆ తర్వాత కథలో మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డ నియోజకవర్గాలు భూమా కుటుంబం చేజారాయి. అఖిలప్రియ భర్తపై భూమా అనుకూల కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేయడం మొదలైంది. భూమా కుటుంబీకుల్లో ఒకరు వెళ్లి బీజేపీలో చేరారు. ఈ రాజకీయం మధ్యన ఏవీ సుబ్బారెడ్డి పై హత్యాయత్నం వార్త సంచలనంగా నిలిచింది. ఈ హత్యకు జరుగుతున్న కుట్రను కడప పోలీసులు బయటకు తీయడంతో వ్యవహారం తెర మీదకు వచ్చింది. మొదట్లో ఈ విషయంపై సుబ్బారెడ్డి స్పందించలేదు. అఖిలప్రియ అప్పట్లోనే స్పందించింది. సుబ్బారెడ్డిని హత్య చేసి దాన్ని తమ మీదకు నెట్టాలని చూస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. సుబ్బారెడ్డి తమకు ఆప్తుడని ఆమె చెప్పుకొచ్చారు! అంత వరకూ విబేధాల గురించి మాట్లాడకుండా, ఆయన తమవాడని ఆమె తేల్చి చెప్పారు. తమ రాజకీయ ప్రత్యర్థులు తమపై కుట్రపన్నుతున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఇప్పుడు సుబ్బారెడ్డి తనపై హత్యాయత్నం చేయించింది అఖిలప్రియనే అని అంటున్నారు! అఖిల, ఆమె భర్త భార్గవ్ లు కుట్ర చేసి తనను చంపించాలని చూస్తున్నారని సుబ్బారెడ్డి అంటున్నారు.
మరి ఈ తరం రాజకీయ వారసులపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనమే. ఇంతకీ దీని వెనుక కథేంటో పోలీసులు తేల్చాల్సి ఉంది. సుబ్బారెడ్డిని హత్యచేయించాలని ఎవరు భావించారో పోలీసులు తేలిస్తే.. రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అఖిలప్రియ భర్త పీఏ తదితరులను ఈ వ్యవహారంలో అరెస్టు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అఖిలప్రియ భర్త ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నారట! ఏవీ సుబ్బారెడ్డి కూతురు మీడియా ముందుకు వచ్చి అఖిలప్రియ మీద దుమ్మెత్తిపోస్తూ ఉంది. మొత్తానికి నంద్యాల- ఆళ్లగడ్డ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చాయి ఈ పరిణామాలు.