విశాఖపై జగన్ విజన్

విభజన ఆంధ్రప్రదేశ్‌కు ఆశాకిరణం లాంటి విశాఖ మహానగరం మీద జగన్ చూపు పడింది. అహల్య లాంటి విశాఖకు శాప విముక్తి  జరిగింది. అభివృద్ధి వైపుగా చకచకా పరుగులు పెడుతోంది. విజన్ ఉన్న నేతగా జగన్…

విభజన ఆంధ్రప్రదేశ్‌కు ఆశాకిరణం లాంటి విశాఖ మహానగరం మీద జగన్ చూపు పడింది. అహల్య లాంటి విశాఖకు శాప విముక్తి  జరిగింది. అభివృద్ధి వైపుగా చకచకా పరుగులు పెడుతోంది. విజన్ ఉన్న నేతగా జగన్ విశాఖను చూస్తున్నారు. విశాఖ సామర్ద్యాన్ని ఆయన సరిగ్గానే అంచనా వేస్తున్నారు. 

చంద్రబాబులా బయటకు చెప్పకపోయినా 2050 నాటికి విశాఖ ఎలా ఉంటుందో  ఎలా ఉండాలో కూడా ఆయన లెక్కలు వేస్తున్నారు. అందుకే ఆయన పాలనా రాజధానిగా విశాఖను ప్రతిపాదించారు. 

విశాఖ వంటి నగరాలకు ఉన్న గొప్ప సుగుణం ఏంటి అంటే ఎంత అయినా అభివృద్ధి చేసుకోవచ్చు, ఆకాశమే హద్దుగా ప్రగతి దారులను వెతుక్కుంటూ సాగిపోతుంది. ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఉన్నారు. ఆయన చాలా ప్రణాళికాబద్దంగానే ఆలోచనలు చేస్తున్నారు. 

విశాఖ ప్రస్తుత జనాభా ఇరవై  లక్షలు. ఇది మరో ముప్పయి ఏళ్ల నాటికి కచ్చితంగా అరకోటికి పైగా పెరుగుతుంది. ఆనాటికి విశాఖ అవసరాలు ఏంటన్నది కూడా ఇప్పటి నుంచే దూరదృష్టితో   చూస్తున్నారు. అందుకే ఎవరూ అడగకుండానే విశాఖకు మెట్రో రైలును తీసుకువస్తున్నారు. ఓ విధంగా విశాఖ వాసులు మరచిపోయిన ప్రాజెక్టు అది. 

విశాఖకు మెట్రో రైలు అన్నది ఎపుడో పుష్కరకాలం క్రితం వైఎస్సార్ హయాంలో వినిపించిన మాట. ఆ ఫైల్ బూజులు దులిపి విశాఖను హైదరాబాద్‌తో ధీటుగా మెట్రో రైలులో తిప్పడానికి వైసీపీ సర్కార్ కంకణమే కట్టుకుంది. 

విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ అంటే దాదాపుగా 75 కిలోమీటర్ల దూరం, పైగా రెండు జిల్లాల కలయిక. ఇదంతా ఇపుడు అనవసరం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి విశాఖ రాజధానిగా ప్రకటించాక ట్రాఫిక్ బాగా పెరుగుతుంది. అపుడు జిల్లాల సరిహద్దులు కూడా మారిపోతాయి.  

జగన్  మార్క్ విజన్ చూస్తే మూడు జిల్లాలుగా కూడా ఉండవు. ఉత్తరాంధ్ర అంతటా అభివృద్ధి ఫలాలు కనిపిస్తాయి. ఆ విధంగానే ఆయన ప్రతీ  ప్రాజెక్ట్‌ను డిజైన్ చేస్తున్నారు.

తాజాగా మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను 14 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్నారు అలాగే, ఏడు వేల కోట్ల రూపాయలతో మోడ్రన్ ట్రామ్ ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఇందుకోసం ఏకంగా విజయవాడలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు ప్రాంతీయ బోర్డును విశాఖపట్నానికి తీసుకువచ్చారు. 

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను ఈ ఏడాది చివరిలో ప్రభుత్వం అందుకుంటుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్లు ఖరారు చేసి నిర్మాణం పనులను చేపడతారు. 2025 నాటికి తొలిదశ పనులు పూర్తి అవుతాయని చెబుతున్నారు. 

ఇదే సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పూర్తి అవుతుంది. అపుడు రోడ్, రైల్, ఎయిర్ కనెక్టివిటీ కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చి వందల కిలోమీటర్ల దూరం కూడా చెరిగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖను రాజధానిగా చేసిన ప్రభుత్వం రానున్న రోజులలో మూడు జిల్లాలూ ఆ అభివృద్ధిని అందుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఎక్కడికక్కడ ప్రాజెక్టులను చేపడుతోంది. 

శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టును ఏర్పాటుచేయడం ద్వారా ఆ జిల్లాలో ఉపాధి అవకాశాలను పెంచాలన్నది కూడా వైసీపీ సర్కార్ ఆలోచనగా ఉంది. భావనపాడు కూడా ఈ జిల్లావాసుల దశాబ్దాల కల అన్నది ఈ సందర్బంగా గమనించాలి. 

ఇదిలాఉంటే విశాఖ మీద జగన్ ఆలోచనల మీద నగరంలో మేధావులు, విద్యావంతుల మధ్య కూడా చర్చ సాగుతోంది.  ఓ వైపు ఆక్రమణలను తొలగిస్తూ మరో వైపు భూకబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న వైసీపీ సర్కార్ అదే సమయంలో ప్రభుత్వ భూమి విలువ ఎంతో చెప్పకనే చెబుతోంది. 

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి నాటి టీడీపీ సర్కార్ మూడు వేల ఎకరాలు సేకరిస్తే అందులో నుంచి అయిదు వందల ఎకరాలను వెనక్కు తీసిపెట్టి మిగిలిన దాంట్లో నుంచే ఎయిర్ పోర్టును నిర్మించేలా ఒప్పందం కుదుర్చుకోవడంలోనే వైసీపీ సర్కార్ పరిణతి, ముందు చూపు కనిపిస్తున్నాయని అంటున్నారు.. ఈ అయిదు వందల ఎకరాల భూమి అక్షరాల ఇరవై వేల కోట్ల రూపాయల విలువ చేస్తుంది. 

భవిష్యత్తులో రాజధాని  ఏర్పాటైతే ఈ భూమి ఎన్నో విధాలుగా అక్కరకు వస్తుంది. అదే విధంగా కబ్జాలకు గురైన వేలాది ఎకరాలను వెనక్కు రప్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల వెనక కారణం కూడా భూమి విలువ తెలియచెప్పడమే. ఇక, విశాఖకు ఏం అభివృద్ధి చేశారు అని టీడీపీ నేతలు తరచూ వైసీపీని ప్రశ్నిస్తారు. 

కానీ కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే విశాఖ సమగ్రమైన అభివృద్ధికి ప్రణాళికలను రూపకల్పన చేయడం ద్వారా చేతల ప్రభుత్వంగా వైసీపీ నిరూపించుకుంది. అదే సమయంలో గత టీడీపీ పాలనను కూడా వైసీపీ నేతలు ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. 

నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నెలకు కనీసం రెండు సార్లకు తక్కువ కాకుండా వచ్చేవారు. ఆ విధంగా అయిదేళ్లలో వందకు పైగా విశాఖలో పర్యటనలు చేశారు. అలాగే, పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులను కూడా నిర్వహించారు. కానీ విశాఖకు పెట్టుబడులు అయితే రాలేదు, అదే సమయంలో విశాఖ అభివృద్ధికి సంబంధించి కనీసం బ్లూ ప్రింట్‌ను కూడా రూపకల్పన చేయలేకపోయారన్న  విమర్శలు ఉన్నాయి. 

ఇక, జగన్ తీరు చూస్తే ఆయన విశాఖకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చినది ఈ ఏడాదిన్నరలో చూస్తే నాలుగైదు సార్లు మాత్రమే. కానీ ఆయన విశాఖ అభివృద్ధి గురించి చాలా శ్రద్ధ కనబరుస్తున్నారని  వైసీపీ నేతలు చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న కార్యక్రమాలను కూడా పేర్కొంటున్నారు. 

విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల సర్వతోముఖాభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్ చెబుతున్నారు. తమ ప్రభుత్వం పర్యాటకరంగ పరంగా కూడా విశాఖకు పెద్ద పీట వేస్తుందని వారు చెబుతున్నారు. 

మొత్తానికి విశాఖ విషయంలో ఇపుడిపుడే వాస్తవాలు జనాలకు తెలుస్తున్నాయి, ఆశలు కూడా పెరుగుతున్నాయి. అనుకున్నది  అనుకున్నట్లుగా జరిగితే మాత్రం విశాఖ దేశంలో మరే నగరంతోనూ పోలిక పోటీ లేకుండా దూసుకుపోవడం ఖాయమని మేధావులు అంటున్నారు.

పెట్టుబడి దారుల విష పుత్రికలు మన పత్రికలు.. శ్రీశ్రీ