1000 రోజుల పాలన.. సోషల్ మీడియా Vs రియాలిటీ

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్నారు. కుర్చీ ఎక్కిన మొదటి రోజు నుంచి ఈ 1000వ రోజు వరకు ఆయనపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు, దిగజారుడు వ్యాఖ్యలు, లేనిపోని కథనాలు..…

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్నారు. కుర్చీ ఎక్కిన మొదటి రోజు నుంచి ఈ 1000వ రోజు వరకు ఆయనపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు, దిగజారుడు వ్యాఖ్యలు, లేనిపోని కథనాలు.. అయితే ఇవన్నీ ఎక్కువగా ఎల్లో మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రమే కనిపించాయి. 

వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో జగన్ పై జరుగుతున్న ప్రచారం, క్షేత్రస్థాయిలో జగన్ పై ఉన్న అభిప్రాయం.. ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం

పథకాల అమలు..

అధికారంలోకి వస్తూనే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను పట్టాలెక్కించారు జగన్. ఇదో పెద్ద సాహసం అనే చెప్పాలి. అయితే ఎన్నికల ముందు హామీ ఇచ్చినవాటినే కాకుండా, హామీలో లేని వాటిని కూడా ఇచ్చుకుంటూ పోతున్నారు. సంక్షేమ పథకాల ఖర్చు తడిసి మోపెడవుతున్నా.. ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారే కానీ పథకాలను మాత్రం అపలేదు, తగ్గించలేదు. 

దీనిపై సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో రకరకాల కథనాలొస్తున్నాయి. రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని, ఖజానా ఖాళీ అవుతోందని చెబుతున్నారు. అప్పులు తెస్తున్నారని, అయినా సరిపోవడంలేదని విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం జగన్ పేదల కడుపు నింపుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. 

ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సంక్షేమ పథకంలో భాగం చేస్తూ వారికి న్యాయం చేస్తున్నారు జగన్. ఆ మేరకు ఆయన పేదల గుండెల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

రోడ్ల స్థితిగతులు..

చంద్రబాబు దిగిపోయే నాటికి ఏపీలో రోడ్ల పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. అయితే అప్పటికే నిధులన్నీ స్వాహా చేయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసేదేం లేకపోయింది. కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేక, కొత్తగా వారు పనులకు ముందుకు రాక రోడ్ల మరమ్మతులు ఆలస్యమయ్యాయి. 

సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో గుంతల రోడ్లతో ఫోటోలు, జనసేన కార్యకర్తల ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ప్రభుత్వాన్ని కాదని తామే రెండు తట్టల మట్టి వేయడం, దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకోవడం.. ఇలా సాగింది జనసేన సినిమా. 

కానీ జనం దాన్ని పట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో మాత్రం వర్షాలు, వరదల వల్ల పనులు కొంత ఆలస్యమైనా.. ఇప్పుడిప్పుడే దీనిపై ప్రభుత్వం చర్యలకు సమాయత్తమైంది. హుటాహుటిన టెండర్లు పిలిచారు, నిధులు విడుదలయ్యాయి, పనులు మొదలయ్యాయి. కాస్త ఆలస్యమైనా.. పనుల్లో నాణ్యత కోసం ప్రభుత్వం తాపత్రయపడుతోంది.

కరోనా పై పోరాటం

సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో పారా సెట్మాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ జగన్ పై సెటైర్లు పేలాయి. చివరకు ఆ పారాసెట్మాల్ కే ఎక్కడలేని డిమాండ్ పెరిగే సరికి జగన్ మాటే కరెక్ట్ కదా అనుకున్నారంతా. 

దేశవ్యాప్తంగా కరోనా కట్టడిలో వివిధ రాష్ట్రాలు వణికిపోగా ఏపీ మాత్రం ధైర్యంగా ఎదుర్కొంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు మేలు చేశారు జగన్. అన్ని జిల్లా కేంద్రాల్లో 16 హెల్త్ హబ్స్ ఏర్పాటు చేశారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ, అన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ ప్లాంట్స్, పడకల పెంపు.. ఇలా.. కరోనాని ఎదుర్కోవడంలో జగన్ ముందుచూపు ఇతర రాష్ట్రాలకు మేలు కొలుపుగా మారింది. కరోనా టైమ్ లో పరీక్షల నిర్వహణ, స్కూళ్ల నిర్వహణలో జగన్ ధైర్యం మిగతా వారికి ఆదర్శంగా మారింది.

విద్యారంగంలో సమూల మార్పులు

సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో.. ఇంగ్లిష్ మీడియంపై అవాకులు-చవాకులు పేల్చారు. నాడు-నేడు పెడుతుంటే ఇది కుదిరే పనికాదని ఎగతాళి చేశారు. మరుగుదొడ్లను టీచర్లతో కడిగిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. క్షేత్రస్థాయిలో నాడు-నేడు సూపర్ హిట్ కార్యక్రమం. దీంతో మారుమూల ప్రాంతాల్లో కూడా సర్కారు బడుల రూపురేఖలు మారిపోయాయి. 

ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గదులు, మౌలిక వసతులు, పుస్తకాలు, అమ్మ ఒడి, ల్యాబులు, ల్యాప్ టాప్ లు.. ఇలా ఒకటేంటి అన్నిట్లోనూ జగన్ తన మార్కు చూపించారు. పిల్లల మనసులో మేనమామగా చెరగని ముద్ర వేసుకున్నారు. దశలవారీగా ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతూ పేదలకు కూడా పెద్ద చదువులను దగ్గరకు చేర్చారు. జిల్లాకో మెడికల్ కాలేజీతో మరో ముందడుగు వేశారు.

గ్రామ-వార్డు సచివాలయాలు..

సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థపై సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో ఎంత రాద్ధాంతం చేశారో అందరికీ తెలుసు. అసలు సచివాలయాల సృష్టికర్త తానేనన్నారు చంద్రబాబు, సచివాలయాలు ఎందుకు దండగ, పంచాయతీ కార్యాలయాలు ఉన్నాయి కదా అన్నారు. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవం ఎలా ఉందో అందరికీ తెలుసు. 

సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం ప్రజల ముందుకొచ్చింది. ప్రభుత్వ సేవలన్నీ ప్రజల చెంతకు చేరాయి. ప్రతి చిన్న పనికీ మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక వాలంటీర్లతో పింఛన్ల పంపిణీతో పాటు.. సర్వేలు సులభతరం అయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది. ఇతర ప్రాంతాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు.

చెప్పుకుంటూ పోతే నవరత్నాల కార్యక్రమాలన్నిటినీ ప్రతిపక్షాలు అవహేళన చేశాయి. డ్రైవర్లకు డబ్బులెందుకు, చేనేతలకు సాయమెందుకు, దర్జీలకు నగదు బదిలీ అవసరమా, రైతు భరోసాలో కేంద్రం వాటా ఉంది కదా అంటూ విమర్శలు ఎక్కుపెట్టాయి. కానీ దేనికీ వెరవలేదు జగన్. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్లడం వల్లే జగన్ జనంలో బలపడుతున్నారు. ప్రతిపక్షాలు మీడియా విమర్శలతో పండగ చేసుకుంటున్నాయి. 

ఈ వెయ్యి రోజుల పాలనతో జగన్ తన మార్క్ చూపించారు. తన దారి, ఆలోచన దృక్పథాన్ని ప్రజలకు చాటిచెప్పారు. ఎన్నికల కోసం కాదు, సంక్షేమం కోసం పనిచేసే నాయకుడినని చేతలతో నిరూపిస్తున్నారు.