మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన ఏ-4 నిందితుడు షేక్ దస్తగిరి, వాచ్‌మ్యాన్ రంగన్నకు భద్రత పెంపుపై సీబీఐ తాజాగా దృష్టి సారించింది. ఈ మేరకు వాళ్లిద్దరితో సీబీఐ అధికారులు చర్చించినట్టు సమాచారం. ఈ కేసులో కీలక వ్యక్తుల అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలోనే దస్తగిరి, రంగన్నలకు భద్రత పెంచినట్టు ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా ఏదైనా ఒక ఘటనకు సంబంధించి అరెస్ట్ లాంటి చర్యలు చేపట్టే ముందు, అందుకు కారణమైన వ్యక్తుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా విచారణ వ్యవస్థలు చర్యలు తీసుకుంటుంటాయి. అలాంటి చర్యలే వివేకా హత్య కేసు నాల్గో నిందితుడు దస్తగిరి, కీలక సాక్షి వాచ్‌మ్యాన్ రంగన్న భద్రత విషయంలోనూ సీబీఐ చేపట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు సీబీఐ నోటీసు తీసుకునేందుకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తిరస్కరించినట్లు వార్తలొస్తున్నాయి. అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది. వీరి విచారణ నిమిత్తం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయ ముఖ్య అధికారులు పులివెందులకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అవినాశ్‌తో పాటు భాస్కర్‌రెడ్డిలకు నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ ప్రయత్నించడం, వారు తిరస్కరించిన నేపథ్యంలో విచారణ సంస్థ ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తోంది.
ఇందులో భాగంగా కడప జిల్లా కోర్టును ఆశ్రియించేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారని తెలిసింది. ఇదే కేసులో ఐదో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా త్వరలో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు సీబీఐ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం తెలిసిందే.
అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలకు నోటీసులు, దస్తగిరి, రంగన్నలకు భద్రత పెంపు… తాజా పరిణామాలను పరిశీలిస్తే త్వరలో సంచలనం ఏదో జరగబోతోందనే ప్రచారం జరుగుతోంది.