అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ నిమిత్తం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమని, ఈ విషయంలో వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని ఇప్పటికీ ఏపీ మంత్రులు స్పష్టం చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా అమరావతి రాజధానిపై తుది తీర్పు నేపథ్యంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
“రాష్ట్ర రాజధానుల ఏర్పాటు నిమిత్తం చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదు. రాజధాని నగరాన్ని మార్చే, లేదా విభజించే, లేదా మూడు రాజధానులుగా ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదు. ఒకవేళ రాష్ట్రం రాజధానిని మార్చాలనుకుంటే కేంద్రానికి లేదా పార్లమెంట్‌కు విజ్ఞప్తి చేసి, ఏపీ పునర్విభజన చట్టానికి సవరణ కోరవచ్చు” అని త్రిసభ్య ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది.
అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ చట్టం చేసింది చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వమే. అది కూడా అసెంబ్లీలో అందరి ఆమోదంతోనే జరిగిపోయింది. రాజధాని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేకపోతే, మరి చంద్రబాబు చేసింది మాత్రం ఎలా ఒప్పు అవుతుందని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
మరోవైపు రాజధాని ఎంపిక, అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ హక్కుకు సంబంధించిన వ్యవహారమని ఒకటికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ వేసింది. అసలు రాజధాని అంశం తన పరిధే కాదని కేంద్ర ప్రభుత్వం నెత్తీనోరూ కొట్టుకుని చెబుతుంటే, మరోవైపు అలా కాదు, మీకే సర్వహక్కులున్నాయని న్యాయస్థానం చెప్పడం ఏంటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఒకసారి, ఒక రాజధాని మాత్రమే చట్టంలో లేదని కేంద్రప్రభుత్వం గతంలోనే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో సహజంగానే పెద్ద చర్చకే తెరలేపాయి. అసలు చట్టం చేయడానికే హక్కులేనప్పుడు శాసన వ్యవస్థ ఏ ప్రయోజనాల కోసం ఏర్పాటైందో స్పష్టత ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్లు లేకపోలేదు.