టీడీపీ అధినేత చంద్రబాబు బాటలోనే నడవాలని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర పరిధిలోని అత్యున్నత చట్టసభలకు హాజరు కాకూడదని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించారు. ఈ మేరకు పొలిట్‌బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. ‘ఈ అసెంబ్లీ గౌరవ సభ కాదు…. కౌరవ సభ’ అని చంద్రబాబు ప్రకటించిన తర్వాత, ఆ సభలకు వెళ్లడం సబబు కాదని టీడీపీ ప్రజాప్రతినిధులు తీర్మానించారు.
గతంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు పదవులను అంటిపెట్టుకుని, ప్రతినెలా జీతాలు తీసుకుంటూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై నాటి అధికార పార్టీ టీడీపీ తీవ్రస్థాయిలో తప్పు పట్టింది. మరి ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్నదేంటి? ప్రజాసమస్యలపై చర్చించే చట్టసభల సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకోవడం ఎంత వరకు సమంజసమని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.
నాడు అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జగన్ నేతృత్వంలో వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఆ తర్వాత మహాపాదయాత్ర పేరుతో ఎన్నికల వరకూ జగన్ ప్రజల్లోనే ఉన్నారు. తాజాగా అసెంబ్లీ, శాసనమం డలి సమావేశాలను బహిష్కరించడానికి ప్రధాన కారణం ….ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును అవమానించడం. చట్టసభలో తన భార్య భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అధికార పార్టీ సభ్యులు వ్యవహరించారనేది చంద్రబాబు ఆరోపణ.
తన భార్యకు అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని చెబుతూ చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చారు. ఈ సందర్భంలో ఏపీ అసెంబ్లీని కౌరవ సభగా ఆయన అభివర్ణించారు. తిరిగి ముఖ్యమంత్రిగానే తాను అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి… శాశ్వతంగా బహిష్కరించారు.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో… వెళ్లాలా? వద్దా? అని టీడీపీ తర్జనభర్జన పడింది. చివరికి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతిపక్షం లేని చట్టసభల సమావేశాలను చూడాల్సిన దుస్థితి ఏపీ ప్రజానీకానికి ఏర్పడింది. వీరిని చట్టసభలకు పంపిన ప్రజలే పిచ్చోళ్లు అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.