అమరావతి రాజధాని పరిస్థితి ఇవాళ ఇంత డోలాయమానం గా ఉన్నది అంటే దానికి ప్రధాన కారకుడు, నైతికంగా చూసినప్పుడు ప్రధాన నిందితుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఆయనేదో అపారమైన జ్ఞానం ఉన్న వాడు అనే ఉద్దేశంతో.. వంచనకు గురై కొత్తగా ఏర్పడిన, అనాధ ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నిలదొక్కుకోవడానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే అద్భుతాలు చేస్తాడు అనే ఉద్దేశంతో ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించారు.
రాష్ట్ర అభివృద్ధి సంగతి తర్వాత రాజధాని విషయంలో మాత్రం ఆయన అమరావతిని ఎంపిక చేశారు. రైతుల నుంచి కూడా పొలాలను కూడా సేకరించారు. ఒక కులానికి మాత్రమే మేలు చేయడానికి ఆయన కుట్రపన్నారా.. రాజధాని ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ రియల్ ఎస్టేట్ దందా లను కొనసాగించారా.. అమాయక రైతులను మోసం చేసి దక్కించుకున్న పొలాలతో కోట్లకు పడగలెత్తారా .. ఇలాంటి విమర్శలు అన్నింటిని కూడా పక్కన పెడదాం!
కానీ రాజధానిగా అమరావతి ఎంపికైన తర్వాత, దానికి ఒక రూపం తీసుకురావడానికి చంద్రబాబుకు కనీసం నాలుగు సంవత్సరాల సమయం ఉంది. ఈ నాలుగేళ్లలో ఆయన ఏం చేశారు. కనీసం కొన్ని భవనాలను పూర్తిగా నిర్మించి ఉంటే, రాజధాని గురించి ఇవాళ ఉన్నటువంటి సందిగ్ధావస్థ ఉండేది కాదు కదా!
పొలాలను సేకరించి వాటిని నగరంగా తయారుచేయడం అనేది మాటల్లో చెప్పినంత తేలిక కాదని కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే ప్రక్రియ అని మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు చంద్రబాబు మొదలెట్టారని ఆయనను సమర్ధించేవారు వకాల్తా పుచ్చుకోవడం గాక. అంతమాత్రాన, అమరావతి ఇవాళ ఎదుర్కొంటున్న దుస్థితికి తనకు బాధ్యత లేదని చంద్రబాబు అంటే కుదరదు.
నిజమే రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలో కొన్ని రోడ్లను వేశారు. ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పనులు మొదలయ్యాయి. అయితే ఇక్కడ ప్రస్తావన ఏమిటంటే.. ఎన్ని పనులు మొదలయ్యాయి అనేది కాదు! ఎన్ని పూర్తయ్యాయి అనేది మాత్రమే!!
కొన్ని పనులు చంద్రబాబు తన పదవీ కాలంలో పూర్తి చేసి ఉంటే, రాజధాని గురించి అసలు సందిగ్ధంలో ఉండేదే కాదు. చేయడానికి అవకాశం లేదని, నిధులు లేవని, చేతకాదని అనుకోవడానికి కూడా వీల్లేదు.
ఆ పదవి కాలం లోనే ఆయన వెలగపూడి సచివాలయం నిర్మింపజేశారు. దానికి తాత్కాలికం అని పేరు పెట్టారు. అదే తరహాలో శాశ్వతం అని చెప్పుకోగలిగిన ప్రభుత్వ కార్యాలయాలను భవనాలను కొన్ని పూర్తి చేసి ఉంటే ఎంతో గొప్పగా ఉండేది.
అధికారులు నివాస సముదాయాల నిర్మాణాలను ప్రారంభించిన సంగతి కూడా నిజమే. కానీ అవి కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ కలిపి ఒక్కముక్కలో చెప్పాలంటే.. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ఒక మహా కుట్రకు పాల్పడ్డారు!
తాను మళ్లీ అధికారంలోకి వస్తే తప్ప.. అమరావతి లో రాజధాని నిర్మాణం అనేది జరిగే పని కాదు.. అని ప్రజలను మభ్యపెట్ట తలుచుకున్నారు! అందుకే, ముఖ్యమంత్రిగా తన పదవీకాలం మరి కొద్ది నెలల్లో ముగిసిపోతుందనగా.. అనేక నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
అవే నిర్మాణాలను, రోడ్లు సిద్ధమైన తొలినాళ్ళలో ప్రారంభించి ఉంటే.. పదవీ కాలం ముగిసే లోగా పూర్తి అయి ఉండేవి కూడా!
కానీ ముందే చెప్పుకున్నట్లు, చంద్రబాబు నాయుడు ఒక పెద్ద కుట్ర చేశారు! అమరావతి నగరం సాకారం కావాలంటే.. చంద్రబాబు మాత్రమే మళ్లీ పదవి లోకి రావాలి అనే భావన, భయాన్ని ప్రజలకు కలిగించదలచుకున్నారు. ఇలాంటి మాయోపాయాలు ప్రజలు అసహ్యించుకోవడం వలనే ఆయన ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత అమరావతి పరిస్థితి ఎలా దయనీయంగా మారిపోయిందో అందరికీ తెలుసు. అక్కడ రాజధాని ఉండాలా వద్దా, మూడు రాజధానులు అవసరమా కాదా, ఈ విషయాలన్నీ పక్కనపెడితే కేవలం చంద్రబాబు నాయుడు కారణంగానే అమరావతి సందిగ్ధంలో పడింది అనేది నిజం!
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు! ఆయనకు నైతిక హక్కు ఉన్నదా? తమ పోరాటానికి మద్దతుగా ఉన్నాడు కనుక.. ఇన్నాళ్లు అమరావతి రైతులు చంద్రబాబు నాయుడును భరించి ఉండవచ్చుగాక! కానీ ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిన తరువాత, ఆయన కుట్ర లోతులను గుర్తించకుండా ఉంటారా? మరింతగా అసహ్యించుకోకుండా ఉంటారా అనేది వేచి చూడాలి!