అమరావతి రాజధానికి సంబంధించి హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షను పూర్తి చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లడం వలన పైచేయి సాధించగలమా లేదా? అనే అంశం ప్రధానంగా ఎక్కువ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ శ్రీరామ్, అదనపు ఏజీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి బొత్సతో పాటు, మంత్రి బుగ్గన, డిఫాల్ట్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. టెక్నికల్‌గా హైకోర్టు తీర్పులో ఉన్న లోపాల గురించి.. ప్రధానంగా చర్చ జరిగినట్లుగా సమాచారం.
సీఆర్డీయే చట్టం ప్రస్తుతం అమల్లోనే ఉంది. హైకోర్టులో అమరావతి రాజధానిపై రోజువారీ విచారణలు ప్రారంభం అయినప్పుడే.. జగన్ సర్కారు జాగ్రత్త పడింది. సీఆర్డీయే రద్దు చట్టాన్ని ఉపసంహరించుకుంది. అలాగే మూడు రాజధానుల బిల్లును కూడా ఉపసంహరించుకుంది. సాంకేతికంగా చూసినప్పుడు అక్కడితోనే వివాదం సమసిపోయినట్టు లెక్క! రాజధానిపై పిటిషన్లు విచారణార్హత కోల్పోయాయని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే.. ఇంకా కొన్ని విషయాలు పెండింగ్ లో ఉన్నాయని రైతులు డిమాండ్ చేయడం వల్ల ఇన్నాళ్లూ సాగిన కోర్టు విచారణ వ్యవహారంలో ఇవాళ తీర్పు వచ్చింది.
హైకోర్టు తీర్పు పట్ల రాష్ట్రప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదనే అనుకోవాలి. ముఖ్యమంత్రి కీలకమైన సమీక్ష జరిపిన తర్వాత.. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు గానీ.. ఆయన తన సహజశైలిలో ఎవ్వరికీ ఏమీ అర్థం కాకుండా చెప్పుకొచ్చారు. సుప్రీం కోర్టుకు వెళ్లే విషయంమీద కూడా .. నర్మగర్భంగా.. ‘సుప్రీంకు వెళ్లే అవసరం లేదని ప్రస్తుతానికి భావిస్తున్నాం.. న్యాయనిపుణులతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ లాంటి డొంకతిరుగుడు మాటలే చెప్పారు.
సీఆర్డీయే చట్టం విషయంలో హైకోర్టు తీర్పు ఇంతకంటె భిన్నంగా ఉండబోదని జగన్మోహన్ రెడ్డికి కొన్ని నెలల ముందే తెలుసు. అందుకనే ప్రతికూల ప్రభావం పెద్దగా లేకుండా.. ఆయన సీఆర్డీయే రద్దు చట్టాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ.. కోర్టులో మరికొన్ని వాదప్రతివాదాలు సాగి కొత్త మార్గదర్శకాలు వచ్చాయి. కోర్టులో కేసు పోయినందుకు జగన్ షాక్ అయ్యే అవకాశం లేదు.. అయితే సమీక్ష మొత్తం భవిష్య కార్యచరణ గురించి మాత్రమే!
సుప్రీం కోర్టుకు వెళ్లడం వల్ల తక్షణ విజయం, తక్షణ ప్రయోజనం ఉంటుందనే నమ్మకం ప్రభుత్వానికి లేకపోవచ్చు. హైకోర్టు తీర్పులను సుప్రీంలో సవాలు చేసిన అనేక సందర్భాల్లో జగన్ కు ఎదురుదెబ్బలే తగిలాయి. ఆయనలో అసహనం పెరిగింది తప్ప ప్రయోజనం సున్నా. ఈ నేపథ్యంలో తాజా తీర్పుపై సుప్రీంకు వెళ్లడం గురించి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోవచ్చు. సుప్రీంకు వెళ్లకపోయినంత మాత్రాన.. మూడునెలల్లోగా పూర్తిగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అప్పగించేస్తారని, హైకోర్టు తీర్పు యథాతథంగా అమలైపోతుందని అనుకుంటే మాత్రం భ్రమే!
ఎటూ.. కొత్తగా రూపొందించబోయే మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టబోయేదీ లేనిదీ మీరు చూస్తారని బొత్స ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ని ప్రజలకోసం విడిచిపెట్టారు కూడా!