జనం ఇలా.. చంద్రబాబు ఎలా.?

ఆంధ్రప్రదేశ్‌ అట్టుడికిపోతోంది.. నివురుగప్పిన నిప్పులా తయారైంది. ప్రత్యేక హోదా కోసం 'ఆంధ్రప్రదేశ్‌ యువత' గళం విప్పుతోంది. ఇదేమీ గొంతెమ్మ కోరిక కాదు. రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన హక్కు. పైగా, ప్రత్యేక హోదా సాధిస్తామంటూ…

ఆంధ్రప్రదేశ్‌ అట్టుడికిపోతోంది.. నివురుగప్పిన నిప్పులా తయారైంది. ప్రత్యేక హోదా కోసం 'ఆంధ్రప్రదేశ్‌ యువత' గళం విప్పుతోంది. ఇదేమీ గొంతెమ్మ కోరిక కాదు. రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన హక్కు. పైగా, ప్రత్యేక హోదా సాధిస్తామంటూ 2014 ఎన్నికల వేళ నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీ ఇచ్చారు. అంతేనా, నరేంద్రమోడీతో కలిసి ప్రత్యేక హోదా సాధించి తీరతామని నినదించారు. కానీ, ఏరు దాటాక తెప్ప తగలేసేశారు. అందుకే, యువత ఇప్పుడు ప్రశ్నిస్తోంది. 

అప్పుడు ప్రత్యేక హోదా సాధించే బాధ్యత తమదేనని చెప్పుకున్న చంద్రబాబు, ఇప్పుడేమో అసలు ప్రత్యేక హోదా ఎందుకు.? అంటూ లేని అమాయకత్వాన్ని పులుముకుని ప్రశ్నిస్తున్నారు. 'చాలా చేసేశాం.. ఇంత అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా.?' అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి విషయంలో రాజీ పడటంలేదు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల విషయంలో రాజీ పడటంలేదు..' అన్న చంద్రబాబు మాటలు కేవలం నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. 

''ప్రత్యేక హోదా గాలి కొదిలేశారు.. ప్రత్యేక ప్యాకేజీ అనే బిచ్చానికి, చట్టబద్ధత కావాలంటూ కేంద్రం వద్ద దేబిరిస్తున్నారు.. ప్రత్యేక రైల్వే జోన్‌ గురించి మాట్లాడటంలేదు.. రాజధాని నిధుల ఊసెత్తడంలేదు. ఎందుకీ దేబిరింత.? రాజకీయంగా చంద్రబాబు, నరేంద్రమోడీ పాదాల వద్ద మోకరిల్లొచ్చేమో.. అది ఆయన వ్యక్తిగతం. కానీ, ఆంధ్రప్రదేశ్‌ అవమానభారంతో కుంగిపోవాలా.? అన్యాయానికి గురవ్వాలా.? ఇదెక్కడి న్యాయం.!'' ఇదంతా ఆంధ్రప్రదేశ్‌ యువత ఆందోళన. 

చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు.. డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీకి ఆయన ఛైర్మన్‌. దానికి సంబంధించిన పనుల మీద ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు, ప్రధానిని కలిశారు.. కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడితో మంతనాలు జరిపారు. అదేదో, తన జీవిత సాఫల్యం.. అన్నట్టు ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు ట్విట్టర్‌ అకౌంట్‌లోనే ఆ ఫొటోల కిందనే ఆంధ్రప్రదేశ్‌ యువత తమ మనోభావాల్ని తెలిపింది.. 'బ్రీఫింగ్‌' అంటూ అసహనం వ్యక్తం చేసింది.

ఏ ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చిందని ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు చంద్రబాబు ఆందోళనలు చేశారు.? నిరాహార దీక్షలు చేశారు.? పాదయాత్రలు నిర్వహించారు.? ఇప్పుడెందుకు యువత విశాఖ వేదికగా చేపడ్తున్న శాంతియుత నిరసనలకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డు తగులులుతుందని యువత ప్రశ్నిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి పీఠమెక్కాక తనకు ప్రజల సెంటిమెంట్లతో సంబంధం లేదని వ్యవహరించడం చంద్రబాబుకి కొత్తేమీ కాదనుకోండి.. అది వేరే విషయం. 

జనవరి 26.. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో అత్యంత కీలకమైన రోజది. దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది.. ఆంధ్రప్రదేశ్‌ కూడా. అదే సమయంలో, దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా, యువత ఆ రోజు శాంతియుత నిరసన.. అదీ ప్రత్యేక హోదా అనే హక్కు కోసం చేపట్టనుంది. ఆ నినాదం అయినా చంద్రబాబు చెవిన పడ్తుందా.? అలాగే, ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్‌ బాధ అర్థమవుతుందా.? వేచి చూడాల్సిందే.