ఎవరీ వారసురాలు? ఇది మన తెలుగు రాష్ట్రాల వ్యవహారం కాదులెండి. ఇదంతా తమిళ బయోపిక్‌ల గోల. ఈ బయోపిక్‌లు ఆషామాషీ బయోపిక్‌లు కావులెండి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్‌ల వ్యవహారం. ఈ బయోపిక్‌లు విడుదల కాకుండా ఆపాలని తనను తాను జయలలిత వారసురాలిగా ప్రచారం చేసుకున్న దీపా జయకుమార్ ప్రయత్నించింది. మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఇంతకూ ఈ దీపా జయకుమార్ ఎవరో గుర్తుందా? జయలలిత మేనకోడలు. అంటే జయలలిత అన్న కూతురు. ఆమె వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు బయోపిక్‌ల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇంతకూ కథ ఏమిటంటే…జయలలిత బయోపిక్‌లకు సంబంధించి కోర్టులో కేసు వేసింది జయలలిత మేనకోడలు దీపా జయకుమార్.
జయలలిత తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉన్నప్పుడు దీప తమిళ రాజకీయ తెర మీదికి వచ్చి జయ పార్టీ అన్నాడీఎంకేకు, ఆస్తులకు వారసురాలిని తానేనని హంగామా చేసింది. అన్నాడీఎంకేకు అధ్యక్షరాలిని కావాలని ఆశ పడి, అది వీలుకాకపోవడంతో సొంత పార్టీ పెట్టి హడావుడి చేసింది. చివరకు నిస్సహాయురాలిగా రాజకీయాలకు స్వస్తి చెప్పింది. రాజకీయాలకు స్వస్తి చెప్పిన దీప జయలలిత బయోపిక్‌లపై కేసు వేయడం ద్వారా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జయలలిత వ్యక్తిగత, రాజకీయ జీవితాల ఆధారంగా తమిళంలో 'తలైవి' పేరుతో, హిందీలో 'జయ' పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇవి ఎఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్నాయి. ఈ సినిమాల్లో జయలలిత పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటి రంగనా రౌనత్ పోషిస్తోంది. ఇవి కాకుండా 'క్వీన్' అనే వెబ్ సిరీస్ తయారవుతోంది. క్వీన్ గౌతమ్ మీనన్ నిర్మించారు. ఇందులో జయ పాత్రను రమ్యకృష్ణ పోషించింది.
ఇది ఈ నెల 14న విడుదల కాబోతుండగా మద్రాసు హైకోర్టు ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలను ఆపాలని డిమాండ్ చేసిన దీపా జయకుమార్ ప్రధానంగా చెప్పిన కారణం దర్శక నిర్మాతలు తనను సంప్రదించలేదని. అలాగే సినిమాలో తన పాత్రను ఎలా చిత్రీకరించారోననే ఆందోళన వ్యక్తం చేసింది. జయలలిత జీవితంపై సినిమాలు నిర్మించే చట్టపరమైన హక్కు దర్శక నిర్మాతలకు లేదని వాదించింది. తాను జయలలిత కుటుంబ సభ్యురాలినని, ఆమె జీవితంలోని ముఖ్య ఘటనలు తనకు తెలుసునని, వాటికి తాను సాక్షినని అన్నది. సినిమాలు తీసేముందు దర్శక నిర్మాతలు తనను సంప్రదించకుండా, చర్చంచకుండా వారి సొంత ఆలోచనలతో సినిమాలు నిర్మించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మద్రాసు హైకోర్టు జయపై నిర్మించిన సినిమాలు, వెబ్ సిరీస్ చూడటానికి, దీప అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోవడానికిగాను రిటైర్డ్ జడ్జిని నియమించింది.
ఆయన ఈ సినిమాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారేమో హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాల్లో పిటిషనర్ దీపా జయకుమార్‌కు కళంకం తెచ్చే, ఆమె పరువుకు భంగం కలిగించే దృశ్యాలు ఉండకూడదని న్యాయస్థానం కండిషన్ పెట్టింది. ఈ సినిమాల, వెబ్‌సిరీస్ దర్శక నిర్మాతలు తమ వాదనలు వినిపించారు. విష్ణువర్ధన్ ఇందూరి తన సినిమా తలైవిని అదే పేరుతో పబ్లిషైన పుస్తకం ఆధారంగా నిర్మించానని తెలిపాడు. తలైవి పుస్తకానికి అభ్యంతరం చెప్పని దీప సినిమాకు ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించాడు. గౌతమ్ మీనన్ కూడా తాను ఇంగ్లిషులో వెలువడిన క్వీన్ పుస్తకం ఆధారంగానే అదే పేరుతో వెబ్‌సిరీస్ నిర్మించినట్లు చెప్పాడు.
దర్శక నిర్మాతల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నిజానికి జయలలిత రాజకీయ జీవితంలోగాని, ఆమె వ్యక్తిగత జీవితంలోగాని దీప పాత్ర ఏమీ లేదు. జయకు ఆమె సోదరుడి కుటుంబంతో బంధం ఏనాడో తెగిపోయింది. ఈ విషయం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో దీపాయే చెప్పింది. ఇక జయలలిత ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో దీప వారసురాలిగా ఎంటరైంది. ఆమెకు జయలలిత దర్శనభాగ్యం కూడా కలగలేదు. కాబట్టి దీప పరువుకు భంగం కలిగించే దశ్యాలు ఈ సినిమాల్లో ఉండకపోవచ్చు. దీప తనను తాను ప్రముఖురాలిగా భావించకుంటున్నదేమో…!