దీపావళి అంటే వెలుగుల పండగ.. టపాసుల పండగ.. వేల కోట్లు ఖర్చయ్యే పండగ.. దండుగ పండగ.. అని పెద్దలు సరదాగా అంటుంటారుగానీ.. ఏమో, నిజంగానే దండుగ పండుగేనేమో.. అమావాశ్య వేళ వచ్చే పండుగ.. చాలామంది జీవితాల్ని శాశ్వతంగా చీకట్లో ముంచేస్తోంది గనుక అన్పిస్తుంటుంది. కారణం, దీపావళి వస్తోందంటే ఏటా మృత్యువు, చాలామందిని కబళించేస్తుండడమే.
ప్రజలు సరదాగా దీపావళి పండుగ జరుపుకోవడానికోసం ఏడాదంతా కష్టపడ్తుంటారు టపాసుల తయారీ పరిశ్రమల్లోని కార్మికులు. పరిశ్రమ కాకుండా, అనధికారికంగా టపాసుల తయారుచేసే కర్మాగారాలూ తక్కువేం కాదు. కోట్ల రూపాయల పరిశ్రమల సంగతేమోగానీ, లక్షల పెట్టుబడితో నడిచే కుటీర పరిశ్రమలూ చాలానే వున్నాయి. అవీ ఇవీ అని తేడా లేదు.. అన్నీ ప్రమాదాల బారిన పడ్తూనే వున్నాయి.
ఒకరిద్దరు చనిపోయే పేలుళ్ళ నుంచి.. పది మందికి పైగా మృత్యువాత పడే పేలుళ్ళు కర్మాగారాల్లో చోటుచేసుకోవడం సర్వసాధారణమైపోయింది. ఏదన్నా ఘటన జరిగాక ప్రభుత్వాలు హడావిడి చేస్తాయి. ఆ తర్వాత చేష్టలుడిగి చూస్తుంటాయి. అధికార గణం లంచాలు మరిగి, అనధికారిక పరిశ్రమలకు అవకాశం కల్పిస్తున్నారనే విమర్శలకు కొదవే లేదు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బాణా సంచా తయారీ కేంద్రంలోని పేలుడు ఘటన 11 మందిని మింగేసింది. మరికొంతమంది తీవ్రంగా గాయపడేలా చేసింది. ఇలాంటివి ఇదివరకూ జరిగాయి.. జరుగుతూనే వున్నాయి. భవిష్యత్‌లో జరగవా.? అంటే ఎందుకు జరగవ్.. అనే సమాధానం వస్తుందే తప్ప, జరగవు.. అని ఖచ్చితంగా ఎవరూ చెప్పని పరిస్థితి. ‘విచారణకు ఆదేశించాం’ అన్న మాట ప్రభుత్వం నుంచి రొటీన్‌గా వినిపించేదే.
చనిపోయాక ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది.. భారీ ఎక్స్‌గ్రేషియా డిమాండ్ చేయడం రాజకీయ పార్టీలు ఓ ట్రెండ్‌గా మార్చేసుకున్నాయి. అంతే తప్ప, ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా మాత్రం ఎవరూ చిత్తశుద్ధితో పనిచేయరు. ఇంకోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోకుండా వున్న కఠిన చట్టాల్ని పక్కాగా అమలు చేయాల్సి వుంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?