బాబు ఆదేశాలతో కలసిపోయినట్లుగా నటిస్తున్నారు
ఇద్దరు మంత్రుల మధ్యలో అధికారులు సతమతం
రెండుగా చీలిన పార్టీ
విశాఖ తెలుగుదేశంలో అంతర్గత సమరం
విశాఖ జిల్లా తెలుగుదేశం రాజకీయం ఇపుడు రసవత్తరంగా మారింది. ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు కాస్తా పార్టీని రెండుగా చీల్చగా, అధికార యంత్రాంగం సైతం సతమతమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు మంచి స్మేహితులుగా ఉన్న జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు గత పదేళ్లుగా రాజకీయ విరోధులుగా మారారు. వారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈ ఇద్దరు ఆమాత్యుల ధోరణులు వేరు కావడంతో గత కాంగ్రెస్ హయాంలో సాగిన తీరుగానే జిల్లాలో అంతర్గత సమరం సాగుతోంది. ఇది అభివృద్ధిపైనా ప్రభావం చూపుతోంది. అయితే, బయటకు మాత్రం కలసిపోయినట్లుగా నటిస్తున్న ఈ ఇద్దరు మంత్రులు అంతర్గత కత్తులు దూసుకుంటున్నారు. అవకాశం వస్తే ఒకరిని ఒకరు దెబ్బ తీసుకునేందుకు సైతం వెనుకాడని పరిస్థితి ఉంది. దాంతో, జిల్లా తెలుగుదేశం పార్టీ సైతం వీరి వైఖరి కారణంగా గ్రూపు రాజకీయాలలో బోరు మంటోంది.
గంటా రూటే సెపరేటు
జిల్లాకు చెందిన మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రూటే సెపరేటు. ఆయన చేయాల్సిదంతా చాలా మౌనంగా చేసుకుంటూ పోతారు, బయటకు ఒక్క మాట కూడా మాట్లాడరు. సొంత పార్టీ అయినా, బయట పార్టీ అయినా ఆయన ప్రత్యర్ధులను బహిరంగంగా పల్లెత్తు మాట అనరు. కానీ, గురి చూసి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడం ఆయనకు బాగా తెలుసు. దాంతో, ఆయన మౌనమే ప్రత్యర్ధులకు ఎపుడూ ఒకింత దడ పుట్టిస్తూ ఉంటుంది. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ అరంగేట్రం చేసిన గంటా తొలి దఫాలోనే అనకాపల్లి ఎంపీగా నెగ్గి లోక్‌సభ ముఖం చూడగలిగారు. ఆయనను పార్టీలోకి తీసుకువచ్చింది సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. మొదట్లో అయ్యన్న, గంటా కవల పిల్లలు మాదిరిగానే జిల్లా రాజకీయాలను నడిపారు. 2004 నాటికి గంటా ఏకంగా అధినేత చంద్రబాబు వద్ద ప్రాపకం సంపాదించేశారు. దాంతో, ఆయనను తిరిగి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలనుకున్న అయన్న పథకం పారలేదు. చోడవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాంతో, తన మంత్రి పదవికి ఆయన ఎక్కడ అడ్డు వస్తారోనని నాటి నుంచే గంటా అంటే అయ్యన్న గరం గరం అయ్యే పరిస్థితి ఉండేది., 2004లో తెలుగుదేశం పరాజయం పాలు కావడంతో గంటా, అయ్యన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మారిపోయారు. అయినా వారి మధ్య వైరం పెరిగిందే కానీ తరగలేదు.
2008 నాటికి ప్రజారాజ్యం పార్టీలో చేరిన గంటా 2011 కల్లా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని మంత్రి అయిపోయారు. దాంతో, ఆయన చిరకాల కోరిక అయిన మంత్రి పదవి దక్కినట్లైంది. ఇక, తాజా ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోవడంలోనూ తనదైన రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శించారు. దాంతో, ఆయన రాకను అడ్డుకున్న అయ్యన్నకు భంగపాటే మిగిలింది. ఏది ఏమైనా అయ్యన్న కంటే కూడా జిల్లా రాజకీయాలలో దూకుడు ప్రదర్శిస్తూ టీడీపీలో మళ్లీ పున ప్రవేశం చేసినా కూడా తనదైన శైలితో గంటా దూసుకుపోతున్నారనే చెప్పాలి. జిల్లాలోని కలెక్టర్ సహా, ముఖ్య అధికారులందరితోనూ సత్సంబంధాలను నెరుపుతూ జిల్లా యంత్రాంగాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడంలో గంటా ఈసరికే సఫలీకృతులయ్యారు. రోజుకు కనీసం నాలుగుకు తక్కువ కాకుండా అధికార కార్యక్రమాలను నిర్వహిస్తూ అటు అధికారులనే కాదు, ఇటు ప్రజలతోనూ మమేకం అవుతున్నారు. అదే సమయంలో పార్టీ రాజకీయాలలోనూ తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. జిల్లా పార్టీలో ఎవరైనా సంప్రదించాలనుకుంటే గంటానే ముందు కలిసేలా ఆయన తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దాంతో, ఇప్పటికైతే అయ్యన్నపై జిల్లా రాజకీయాలలో గంటా పై చేయి సాధించినట్లుగానే కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీలో నుంచి తాను తీసుకువచ్చిన ఎమ్మెల్యేలతో పాటు, పార్టీలో గతంలో తనకు సన్నిహితంగా మెలిగిన వారిని కూడా కలుపుకుపోవడం ద్వారా జిల్లాలో టీడీపీకి ఉన్న డజను మంది ఎమ్మెల్యేలలో అత్యధిక శాతం తన వైపు ఉండేలా గంటా జాగ్రత్త పడ్డారు. జిల్లాకు రెండవ మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రున్ని నర్శీపట్నానికే పరిమితం చేయడంలో గంటా విజయవంతమయ్యారనే చెప్పుకోవాలి.
జిల్లా రాజకీయాలపై గురి పెట్టిన అయ్యన్న
తన రాజకీయ. ప్రత్యర్ధి సొంత పార్టీలో చేరి తనపైనే సవాల్ విసురుతున్న తరుణంలో సీనియర్ రాజకీయ వేత్త అయిన మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. విశాఖ నగరాన్ని మాత్రమే గంటాకు వదిలిపెట్టి జిల్లా రాజకీయాలపై పెత్తనం చేసేందుకు అయ్యన్న ఆరాటపడుతున్నారు. ఇదంతా ముందుచూపుతూనే ఆయన చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను ఇరవై అయిదు జిల్లాలుగా చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. దాంతో, విశాలమైన విశాఖ జిల్లా కూడా రెండుగా మారే అవకాశాలు ఉన్నాయి. దాంతో, రూరల్ జిల్లాకు తానే అధిపతి కావాలన్న దూరాలోచనతోనే అయ్యన్న జిల్లాను వదిలిపెట్టడంలేదని అంటున్నారు. ఎటూ అర్బన్ జిల్లాలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో పొసగని కారణంగా తన ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందోనని జిల్లానే అయ్యన్న అట్టిపెట్టుకున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. జిల్లా రాజకీయాలలో నిన్నటివరకూ తనతో పెద్దగా పొసగని వారిని కూడా ఇపుడు ఓ చోటకు చేర్చి తన వైపుకు తిప్పుకోవడంలో అయ్యన్న నిమగ్నమై ఉన్నారు. అయితే, గంటా మాదిరిగా దూకుడు రాజకీయాలు చేయలేకపోవడం అయ్యన్నకు మైనస్‌గా మారిందని అంటున్నారు. దానికి విరుగుడుగా ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడునే తన వైపుకు తిప్పుకోవడం ద్వారా జిల్లా రాజకీయాలు గుప్పిట ఉంచుకోవాలని కూడా అయ్యన్న భారీ పధకమే వేశారు. దాంతో, చంద్రబాబు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కడ పర్యటించినా అయ్యన్న తప్పకుండా హాజరవుతూ అధినేత కనుసన్నలలో ఉంటున్నారు. అటు వైపు నుంచి నరుక్కు వస్తే గంటా ఏమీ చేయలేరన్న వ్యూహంతోనే అయ్యన్న ఇలా చేస్తున్నారని అంటున్నారు.
అధికారులకు సంకటం
ఇదిలా ఉండగా, ఇద్దరు మంత్రులు జిల్లా అధికారులపై పెత్తనం చేసేందుకు పోటీ పడుతూండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అభివృద్ధి పనుల విషయంలో సిఫారసులు చేసేందుకు, ఆదేశాలు జారీ చేసేందుకు ఈ మంత్రులు ఇద్దరూ ఎవరి మటుకు వారు అధికారులను పిలిపించుకుంటున్నారు. దీంతో, ఎవరి మాట వినాలో తెలియని అవస్ధలో అధికారులు ఉంటున్నారు. ఇదిలా ఉండగా, త్వరలో రానున్న ఆగస్టు 15 కూడా ఇపుడు అధికారుల గుండెలలో గుబులు రేపుతోంది. పతాకావిష్కరణ ఎవరి చేత చేయించాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సీనియర్ మంత్రిగా తనేక అవకాశం ఉంటుందని అయ్యన్న భావిస్తూంటే, తననే పిలుస్తారన్న ధీమాలో మంత్రి గంటా ఉన్నారు. ఇక, అభివృద్ధి పనులు సైతం గత నెలన్నర పాలనలో ఎక్కడా ముందుకు సాగని పరిస్థితి ఉంది. సమీక్షల పేరుతో హడావుడి తప్పించి మంత్రులు కూడా ఏమీ చేయలేని స్థితి ఉంది.
బాబు ఆదేశాలతో కలసిన చేతులు
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఇద్దరు మంత్రులు తాజాగా ఒక్కటైనట్లుగా పత్రికలకు ఫోజులు ఇచ్చారు. ఇటీవల నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరు మంత్రులు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగారు. తమ మధ్య విభేదాలు లేవని, జిల్లా అభివృద్ధి కోసం ఒక్కటిగా కలసి పనిచేస్తామని కూడా ప్రకటించారు. అయితే, బయటకు ఇలా చెబుతున్నా లోపల మాత్రం ఇద్దరికీ రెండవ వారిపై నమ్మకం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాబు ఆదేశాల మేరకు జిల్లాను ఇద్దరూ ఓ పద్ధతి ప్రకారం పంచుకుని ప్రస్తుతానికి పాలన చేస్తున్నారు. అర్బన్‌లో జరిగే కార్యక్రమాలలో అయ్యన్నపాత్రుడు కనిపించరు, అలాగే, రూరల్ కార్యక్రమాలలో గంటా వేలు పెట్టరు. ప్రస్తుతానికైతే ఇది అమలవుతోంది. అయితే, ఈ పంపకాలు ఎంతవరకూ సాఫీగా సాగుతాయి, పార్టీలో సైతం పెచ్చరిల్లుతున్న గ్రూపు రాజకీయాలు ఎంతమేరకు అణగారిపోతాయన్నది రానున్న కాలమే తేల్చిచెప్పనుంది.
పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం.