లోకసభలో తొలిసారి మాట్లాడుతూ మోదీ ''1200 సంవత్సరాల బానిస పాలన..'' అంటూ మాట్లాడారు. మనందరికీ తెలిసి మన సంపదను దోచుకుని తమ దేశాలకు పట్టుకుని పోయిన ఆంగ్లేయుల పాలన మహా అయితే 200 సం||లు సాగింది. మరి తక్కిన వెయ్యి సంవత్సరాలు ఎక్కణ్నుంచి వచ్చాయి? అంటే ముస్లిము పాలన కూడా కలిపి చెప్పాడన్నమాట. గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా మొన్న ఆగస్టు 15 న స్వాతంత్య్రదినోత్సవ ఉపన్యాసం యిస్తూ ''గత 1000-1200 సం||రాలుగా భారతదేశం బానిసగా పడి వుంది'' అన్నాడాయన. రెండిటికి మధ్య రెండు వందల ఏళ్లు తేడా వుంది. ప్రధానమంత్రి అయ్యేటప్పటికి ఒక నిర్ధారణకు వచ్చేశాడు – 1200 ఏళ్లు అని. అంటే ముస్లిములు భారతదేశానికి వచ్చినప్పటి నుండి మనకు బానిసత్వం దాపురించింది అని నూరిపోయడమన్నమాట. ఇది ఆరెస్సెస్ భావజాలం. తరతరాలుగా భారతదేశం అనేక రాజ్యాలుగా విడిపోయి వుంది. ఒకరిపై మరొకరు దండయాత్రలు చేసుకుంటూ వుండేవారు. కొన్ని ప్రాంతాలు కొంతకాలం పాటు ఒక ప్రాంతపు రాజు అధీనంలో వుంటే, మరి కొంతకాలం అవతలి రాజు అధీనంలో వుండేవి. తరతరాలుగా అనేకమంది దండెత్తి వచ్చారు. శకులు, హూణులు, కుషానులు, యవనులు.. యిలా! అందరి కంటె ముందు ఆర్యులు వచ్చారు. ఆరెస్సెస్ వాదులు 'అబ్బే ఆర్యులు యిక్కడివారే, ఎక్కణ్నుంచీ రాలేదు' అంటారు. మరి జర్మనీ, లాటిన్ వంటి అనేక యూరోపియన్ భాషలకు ఆర్యభాషతో లింకు ఎలా వున్నట్టు? జర్మన్లు తాము ఆర్యన్లు అని ఎలా చెప్పుకున్నారు? అంటే ఆర్యన్లే యిక్కణ్నుంచి వెళ్లి వాళ్లపై దండయాత్ర చేసి బానిసలు చేసుకున్నారా?
ఆర్యుల మాట వదిలేసినా తక్కినవాళ్లు వచ్చారని అందరికీ తెలుసు కదా! వాళ్లెవరూ పరాయివాళ్లు కారు, సంఘ్ దృష్టిలో! ముస్లిములు మాత్రమే పరాయివారు, మనలను బానిసలు చేసి పీడించిన దుర్మార్గులు. ముస్లిము పాలకులు యిక్కడే స్థిరపడ్డారు, రాజ్యాలు ఏలారు. యీ సంపదను ఎక్కడకూ తరలించుకు పోలేదు. రాజ్యవిస్తరణలో భాగంగా సాటి ముస్లిము రాజులతో కూడా యుద్ధాలు చేశారు. హిందూ రాజులు కూడా డిటోడిటో. ఏక సమయంలో హిందూ రాజులు, ముస్లిము రాజులు ప్రజలను పాలించారు. అప్పటినుండీ మొత్తం భారత ఉపఖండమంతా బానిసత్వంలోకి నెట్టబడిందనడం హాస్యాస్పదం. సాక్షాత్తూ ప్రధానమంత్రి నోట యిది వినబడడం శోచనీయం. 2002 గోధ్రా అల్లర్ల గురించి మాట ఎత్తినప్పుడల్లా మోదీ 'గతం గతః, పాతవిషయాలను వదిలేసి ముందుకు సాగాలి అంటూ వుంటారు. 12 ఏళ్ల క్రితం దాన్ని మర్చిపోవాలి కానీ ఎప్పుడో మధ్యయుగాల నాటి యుద్ధాల గురించి మాత్రం మనం మరువకూడదట. ప్రజలను హిందూ, ముస్లిములుగా విడగొట్టి, ముస్లిములు పక్కన వున్నంతకాలం మనం బానిసలుగా బతుకుతున్నట్టే అనడం అన్యాయం, అక్రమం.
అభివృద్ధి జపం చేస్తూ అధికారంలోకి వచ్చినా మోదీ హిందూ ఎజెండాను వదలలేదనడానికి యిది తార్కాణం. అంతేకాదు, చరిత్ర తిరగరాయించే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. మోదీ వస్తూనే చేసిన పనుల్లో ఐసిఎచ్‌ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రిసెర్చ్) అధినేతను మార్చడం! ఇదీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ (ఐసిఎస్‌ఎస్‌ఆర్) యివన్నీ వివాదాస్పద సంస్థలే. అధికారంలో వున్నవాళ్లు తమ ఆలోచనలకు అనుగుణంగా ఆలోచించేవారిని వీటిలో నియమిస్తూ వుంటారు. వీరు తయారుచేసిన పుస్తకాల ఆధారంగా పాఠ్యపుస్తకాలు తయారయి, భావితరాలను ప్రభావితం చేస్తాయి. మేధావులందరూ ఒకేలా ఆలోచించరు. దొరికిన చారిత్రక ఆధారాలను తర్కబద్ధంగా ఆలోచించడం సరైన పద్ధతి. అయితే కొందరు తాము ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల కోణంలో నుండి వాటిని చూసి అలా విశ్లేషిస్తూ వుంటారు. మన దేశంలో మొదటి నుండి చరిత్ర పట్ల గౌరవం, శ్రద్ధ లేదు. పాత రచనల్లో చాలాభాగం అతిశయోక్తులే. ఒకదానికి మరొకదానికి పొసగవు. పాశ్చాత్యదేశాలు యీ విషయంలో చాలా మెరుగు. అక్కడ వున్నదున్నట్టు రికార్డు చేసిన సందర్భాలు చాలా వున్నాయి. వారు వారికి తెలిసిన దృక్కోణంలో భారతచరిత్రను వివరించారు. వాటిలో పొరబాట్లు వుండవచ్చు కానీ మొత్తానికి కొట్టి పారేయలేం. అయితే ఆరెస్సెస్ వాదులు పాశ్చాత్యుల కోణాన్ని, వాటిని అనుసరించిన భారతీయమేధావులను తీసిపారేస్తారు. వాళ్లందరిపై కమ్యూనిస్టు ముద్ర కొట్టేస్తారు. వాజపేయి ప్రభుత్వంలో మురళీ మనోహర్ జోషి హ్యూమన్ రిసోర్సెస్ శాఖ చూసేటప్పుడు పై రెండు సంస్థల్లోనే కాక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్వాన్స్‌డ్ స్టడీస్, యుజిసి వంటి సంస్థలను కూడా ఆరెస్సెస్ మేధావులతో నింపేశాడు. ఐసిఎచ్‌ఆర్ అప్పట్లో ''ఫ్రీడమ్ ప్రాజెక్ట్'' అనే పథకం కింద 1937 నుండి 1947 వరకు జరిగిన స్వాతంత్య్రపోరాటంపై ఏడాదికి ఒక సంపుటం చొప్పున 10 సంపుటాలు తెద్దామనుకుంది. కానీ రెండు సంపుటాలు తయారయ్యేసరికి జోషీ అడ్డుపడ్డారు – ''దీనిలో హిందూ మహాసభ వంటి సంస్థల పాత్ర గురించి తగినంతగా రాయలేదు.'' అంటూ!
ఇప్పుడు మళ్లీ అలాటి ప్రయత్నాలే మొదలయ్యాయని అర్థమవుతోంది. ఐసిఎచ్‌ఆర్‌కు చైర్మన్‌గా నియమించబడిన ఎల్లాప్రగడ సుదర్శన రావు పూర్తిగా ఆరెస్సెస్ మనిషే. ఆయన యిప్పటికే మహాభారత ప్రాజెక్టుపై పని చేస్తున్నారు. చరిత్రకారు డెప్పుడూ ఆధారాల కోసం వెతుకుతారు. మన రావుగారికి వాటితో పని లేదు. ఆధారాల కోసం వెతకడం పాశ్చాత్యపద్ధతి అంటాడాయన. ప్రజల నోట్లో ఆడే పుక్కిటి పురాణాలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సిందేట. ''రాముడు భద్రాచలంలో తిరుగాడాడు అని స్థానికులు చెప్తున్నారు అంటే అర్థం ఏమిటి? ఎన్నో తరాలుగా వాళ్లు తమ మెదళ్లలో నిక్షిప్తం చేసుకున్న జ్ఞాపకాలన్నమాట. దానిని కూడా మనం చరిత్రగానే ఆమోదించాలి'' అని ఆయన వాదన. ఇలాటి వాదన వింటే మతి పోతుంది. 'కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకు పోయినది యిక్కణ్నుంచే..' అని చెప్పే చోట్లు కనీసం మూడు, 'రావణుడు శివుని ఆత్మలింగాన్ని పోగొట్టుకున్నది యిక్కడే..' అని చెప్పే చోట్లు మూడు నాకు తెలుసు. అవి వివిధ రాష్ట్రాలలో వున్నాయి. రావు గారి నిర్వచనం ప్రకారం వీటిలో దేన్ని చరిత్ర అనాలి? ఇలాటి మేధావి ప్రచారం చేయబోతున్న చరిత్రను మన పిల్లల పాఠ్యపుస్తకాల్లో పెట్టబోతున్నారు. శభాష్!
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)