ఓ గిరిజన సంస్కృతి కనుమరుగు…!

ఓ ప్రాచీన గిరిజన సంస్కృతి కనుమరుగు కాబోతోంది. శతాబ్దాలుగా సజీవంగా ఉండి, ఆధునిక ప్రపంచ పోకడలు విస్తరిస్తున్నా ఉనికిని నిలబెట్టుకున్న ఓ గిరిజన జీవన విధానం అంతర్థానం కాబోతోంది. పచ్చని పంట పొలాలు గోదావరిలో…

ఓ ప్రాచీన గిరిజన సంస్కృతి కనుమరుగు కాబోతోంది. శతాబ్దాలుగా సజీవంగా ఉండి, ఆధునిక ప్రపంచ పోకడలు విస్తరిస్తున్నా ఉనికిని నిలబెట్టుకున్న ఓ గిరిజన జీవన విధానం అంతర్థానం కాబోతోంది. పచ్చని పంట పొలాలు గోదావరిలో కలిసిపోబోతున్నాయి. కొన్ని వందల గిరిజన గ్రామాలు ‘ముంపు ప్రాంతం’గా మారబోతున్నాయి. గిరిజనులు సహా లక్షలాది మంది  ప్రజల బతుకులు అధ్వానం కాబోతున్నాయి. ఇదంతా ఎక్కడ? ఏ విదేశంలోనో కాదు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో. సమీప భవిష్యత్తులోనే ఈ దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని భద్రాచాలం, పాల్వంచ డివిజన్‌లలోని ఏడు గిరిజన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు తాజాగా రాజ్యసభ కూడా ఆమోదముద్ర వేయడంతో ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లయింది. ఖమ్మం జిల్లాలో గిరిజనులు అత్యధికంగా ఉన్న కొంతప్రాంతం తెలంగాణ మ్యాప్‌ నుంచి తెగిపోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో ఆంధ్రప్రదేశ్‌ సంతోషిస్తుండగా, తెలంగాణ మూగగా రోదిస్తోంది. ఈ ప్రాజెక్టు ఒకరికి వరంగా, మరొకరికి శాపంగా మారింది. 

తీవ్రంగా ప్రతిఘటించిన తెలంగాణ

రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ‘పోలవరం ప్రాజెక్టు’ సమస్య ప్రజల్లో నలుగుతూనే ఉంది. జాతీయ హోదా సాధించిన ఈ బహుళార్థసాధక ప్రాజక్టు జాతీయ స్థాయిలోనూ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ ప్రాజెక్టు కేవలం ఆంధ్ర`తెలంగాణ సమస్య కాదు. పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో ముడిపడిఉంది. తెలంగాణతో పాటు ఆ రెండు రాష్ట్రాల్లోని కొంత ప్రాంతం పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోతుంది. పోలవరం ప్రాజెక్టు కథాకమామీషు చాలా మందికి తెలిసేవుంటుంది కాబట్టి ప్రస్తుతం ఈ వివాదం, చరిత్ర వివరించాల్సిన పనిలేదు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలపడాన్ని భద్రాచాలం డివిజన్‌లోని ప్రజలే కాకుండా తెలంగాణ ప్రభుత్వం సహా అన్ని పార్టీలూ వ్యతిరేకించాయి. రెండుసార్లు రాష్ట్ర వ్యాప్త బంద్‌ కూడా జరిగింది. ఇక భద్రాచలం డివిజన్‌లోనైతే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేవరకూ నిరంతర పోరాటం జరిగింది. అయితే బిల్లు ఆమోదంతో వారి పోరాటం నిష్ఫలమైంది. ఇప్పుడిరక చేసేదేమీ లేదు. రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. అయినప్పటికీ పోలవరం ప్రాజెక్టును విభజన బిల్లులో ప్రతిపాదించి, దానికి కట్టుబడిన కాంగ్రెసు, ప్రాజెక్టును కట్టితీరుతామని ప్రతిజ్ఞ చేసిన తెలుగుదేశం పార్టీ మద్దతుతో మోడీ సర్కారు బిల్లును సునాయాసంగా నెగ్గించుకుంది. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో తెలంగాణ కొంత భాగాన్ని కోల్పోయింది. ఇప్పుడు దాని భౌగోళిక రూపురేఖలు కూడా మారాయి. 

తెలంగాణ నాయకులు కొందరు ‘తెలంగాణ తల్లిలోని ఒక అవయవం తెగిపోయింది’ అని ఆవేదన చెందుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోఉన్న మండలాల్లో వేలేరుపాడు , కుక్కునూరు మండలాలు పూర్తిగా, బూర్గంపాడు, చింతూరు, విఆర్‌పురం, భద్రాచలం , కూనవరం మండలాలు పాక్షికంగా  (ఇవన్నీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవేనని చేస్తున్న వాదనకు పెద్ద కథ ఉంది) ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయ్యాయి. మొత్తం 324 రెవిన్యూ గ్రామాలు, దాదాపు 2 లక్షల జనాభా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైంది.  ఈ మొత్తం జనాభాలో కొండరెడ్ల జనాభా పదివేలు. కొద్దిమందే కదా వీరి గురించి ఆలోచించాల్సింది ఏముంది? అని మనం అనుకోవచ్చు. జనాభా తక్కువే కావొచ్చు. కాని ఓ గిరిజన సంస్కృతి అంతర్థానమవుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రస్తుత ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని తెలంగాణవారు కోరుతున్నారు. ఇదే మాట ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వారూ చెప్పారు. ప్రాజెక్టు డిజైన్‌ మారిస్తే ముంపు ప్రాంతం తగ్గుతుందని, తద్వారా గిరిజనులకు నష్టం తక్కువగా ఉంటుందని మేధావులు, జల నిపుణులు చెబుతున్నారు. కాని కేంద్ర ప్రభుత్వం ఈ అభ్యంతరాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ నుంచి ఆంధ్రకు గ్రామాల బదిలీ కారణంగా ఈ మండలాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. చెప్పుకుంటూపోతే అదో పెద్ద కథ. 

కొండరెడ్ల ఉనికి ప్రశ్నార్థకమే…!

పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో నివసిస్తున్న గిరిజనుల్లో కొండరెడ్లు ప్రధానమైనవారు. శతాబ్దాలుగా సజీవంగా ఉన్న గిరిజన తెగ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థమైంది. విలక్షణమైన వీరి జీవనవిధానం, సంస్కృతి, సంప్రదాయాలు ఇక కాలగర్భంలో కలిసిపోతాయని చరిత్రకారులు, ఆంత్రోపాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం పచ్చటి అడవుల్లో, కొండల్లో  ప్రశాంతంగా జీవించిన కొండరెడ్లు పోలవరం ప్రాజెక్టు కారణంగా చెల్లాచెదురైపోతారని, వారి బతుకులు అధ్వానమైపోతాయని అంటున్నారు.     

పోలవరం కారణంగా కూనవరం మండలంలోని ఏరువాడ గట్టుపై ఉన్న మూడు కొండరెడ్ల గ్రామాలు, కూనవరం నుంచి చింతూరు వరకూ ఉన్న కూనూరుగడ్డ గుట్టలపై ఉన్న 12 గ్రామాలు, రేఖపల్లి నుంచి తుమ్మలేరు వరకు ఉన్న కొండరెడ్ల గ్రామాలు కనుమరుగవుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్న 33 ఆదివాసీ తెగల్లో కొండరెడ్ల తెగ ఒకటి. ఈ తెగ రాతి యుగానికి చెందిందని పరిశోధకులు చెబుతున్నారు. తూర్పు కనుమల్లో ముఖ్యంగా గోదావరికి ఇరు పక్కలా గుట్టలపై దట్టమైన అరణ్యాల్లో నివసించే అరుదైన గిరిజనులు కొండరెడ్లు. కొండరెడ్డి అంటే కొండలపై నివసించే మనిషి అని అర్థమట…! తాము సూర్యవంశానికి చెందినవారమని చెప్పుకునే కొండరెడ్లు స్వాభావికంగా అమాయకులు. నిగర్వంగా, నిరాడంబరంగా, ఆధునిక సమాజానికి దూరంగా గుట్టలపై జీవిస్తుంటారు. వీరి గ్రామాల్లో ఈనాటికీ మౌలిక సౌకర్యాలు లేవు. రహదారులు, విద్యుత్తు, విద్య, వైద్య మొదలైనవి కరువే. మూఢ నమ్మకాలు, బహు భార్యత్వం, బాల్య వివాహాలు, మంత్రతంత్రాలు ఇలాంటివెన్నో వీరి జాతిలో ఈనాటికీ ఉన్నాయి. విచిత్రమేమిటంటే ఆధునికులుగా, నాగరికులుగా చెప్పుకునే గిరిజనేతరులు వీరి నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. కొండరెడ్లను ప్రధాన జన జీవన స్రవంతిలో కలపాలని ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తున్నా ఈనాటికీ అది పూర్తి ఫలితాలు ఇవ్వలేదు. 

పోడు వ్యవసాయమే జీవనాధారం

గుట్టలపై నివసిస్తున్న కొండరెడ్లకు పోడు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. కొండలపై వాగులకు దగ్గరగా ఉన్న భూములను చదును చేసుకొని పోడు వ్యవసాయం చేస్తుంటారు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు మొదలైన వర్షాధార పంటలు పండిస్తారు. వీరు నిరక్షరాస్యులు కావడం, నాగరిక సమాజానికి దూరంగా ఉండటంతో ఆధునిక వ్యవసాయ విధానాలు తెలియవు కాబట్టి ప్రకృతి కరుణిస్తేనే పంట చేతికొస్తుంది. అయితే ఆధునిక పోకడలు సంతరించుకున్న కొందరు కొండరెడ్లు  సాధారణ రైతులతో పోటీ పడి పంటలు పండిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలాంటివారు తమ పిల్లల్ని  పాఠశాలలకు పంపి పట్టుదలగా చదవిస్తున్నారు కూడా. అయితే మొత్తం మీద చూస్తే ఇలాంటివారి శాతం చాలా తక్కువ. పోడు వ్యవసాయంతో పాటు వెదురుతో తట్టలు, బుట్టలు, చాపలు, తడికెలు మొదలైనవి తయారుచేసి వారపు సంతల్లో అమ్ముతారు. అడవుల్లో లభ్యమయ్యే తేనె, జిగురు, చింతపండు తదితరాలూ విక్రయిస్తారు. వర్షాకాలంలో పనులు దొరక్క ఆకలితో అల్లాడుతుంటారు. శనగగడ్డలు,  జీలుగుచెక్క, మామిడి టెంకలు వీరికి ఆహారం. కొండరెడ్లలో 30 శాతం మంది అడవుల్లో లేదా వాటికి దగ్గరగా నివసిస్తుంటారు. వీరు ఇళ్లలోనే అనేక పండ్ల చెట్లు పెంచుతుంటారు. చింతచెట్లను ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తారు.     అనేక గిరిజన జాతుల్లో మాదిరగానే కొండరెడ్లకు కూడా వేట ప్రధాన వ్యాపకం. మగవారు ఎప్పుడూ విల్లంబులతో తిరుగుతూ జంతువులను వేటాడుతుంటారు. వేటాడిన జంతువుల మాంసాన్ని సమష్టిగా పంచుకుంటారు. చేపల వేట కూడా ఉమ్మడిగానే సాగిస్తారు. 

సంప్రదాయాలు…వేషధారణ

కొండరెడ్ల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. వారు వీటిని కట్టుబాట్లు అంటే, ఆధునికులు మూఢ నమ్మకాలు అంటారు. ప్రధానంగా చెప్పుకోవల్సినవి బాలికలు రజస్వల లేదా పుష్పవతి (మెచ్యూర్‌) కాగానే ఇళ్లకు దూరంగా ‘కీడుపాక’ పేరుతో ఓ చిన్న ఇల్లు తయారుచేసి వారం రోజులు అక్కడే ఉంచుతారు. గర్భవతులను కూడా ప్రసవ సమయంలో అక్కడే ఉంచి ప్రసవమయ్యాక వారం రోజుల తరువాత ఇంటికి తీసుకొస్తారు. ముత్యాలమ్మ, గంగానమ్మ, భూదేవి, గండమ్మ మొదలైన దేవతలను కొలుస్తారు. వీరిని కొండ దేవతలంటారు. భూత వైద్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. అనారోగ్యం కలగ్గానే భూతవైద్యుడిని తీసుకొచ్చి వైద్యం చేయిస్తారు. అంటురోగాలొస్తే రకరకాల పూజలు చేస్తుంటారు. వీరిలో ఎక్కవమంది కొండలు దిగి ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇష్టపడరు. దానికితోడు డబ్బు లేకపోవడం, రహదారులు, బస్సులు కరువువడంతో స్థానకంగానే నాటు వైద్యం చేయిస్తుంటారు. ఇళ్ల దగ్గర ఉన్నప్పుడు పురుషులు ఎక్కువమంది చొక్కా లేకుండా గోచీలతో కనబడతారు. ఆడవారు చినిగిన, మాసిన బట్టలతో ఉంటారు. శుభకార్యాలకు వెళ్లేటప్పుడు మగవారు నిక్కర్లు, చొక్కాలు వేసుకుంటారు. ఆడవారు చీరలు కట్టుకుంటారు. మహిళలు చెవులకు వెండి దిద్దులు, ముక్కుపుడకలు పెడతారు. మెడలో రకరకాల కడియాలు వేసుకుంటారు. కాళ్లకూ కడియాలు, పట్టలు ధరిస్తారు. సంతల్లో దొరికే గిల్టు నగలు ఎక్కువగా కొంటారు. కొండరెడ్ల యువతులు, యువకులు ఫ్యాషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 

వివాహాలు

కొండరెడ్లలో వివాహాలు మూడు రకాలుగా జరుగుతాయి. వీటిల్లో బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఒక రకం. దీన్ని ‘మొగనాలు’అంటారు. పురాణాల్లో కనిపించే రాక్షస వివాహం వంటిదే ఇది. అమ్మాయి, అబ్బాయి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం మరోటి. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇంకోటి. వీరి వివాహాల్లో కట్నం ప్రసక్తి ఉండదు. బహుభార్యత్వం, పునర్వివాహాలు వీరిలో సాధారణం. ముఖ్యంగా తమ్ముడు చనిపోతే అతని భార్యను అన్న వివాహం చేసుకునే ఆచారం ఉంది. 

పండుగలు

కొండరెడ్లు మూడు రకాల పండుగలు జరుపుకుంటారు. వానలు కురవగానే జరుపుకునే పండుగను భూదేవి పండుగ అంటారు. వ్యవసాయ పనులు ప్రారంభించేముందు పందిని బలి ఇచ్చి పనులు ప్రారంభిస్తారు. పంటలు చేతికొచ్చే సమయంలో కోతల పండుగ చేస్తారు. మరొకటి మామిడికాయల పండుగ. కొండరెడ్లు నివసించే ప్రాంతాల్లో మామిడికాయలు ఎక్కువగా కాస్తాయి. అవి పక్వానికి వచ్చేవరకూ ఎవ్వరూ ముట్టుకోరు. పక్వానికి వచ్చాక గ్రామ పెద్ద అయిదారు కాయలు కోసి పూజ చేసి (దీన్ని గొందికి పెద్దడం అంటారు) పెద్దలకు పంచుతాడు. అప్పటి నుంచి మామిడి పండ్లు తినడం ప్రారంభిస్తారు. పండుగులు, జాతర్లు సమయంలో ఆటపాటలతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆ సమయంలో ప్రత్యేకంగా వస్త్రధారణ చేస్తారు. జంతువుల కొమ్ములతో, నెమలి ఈకలతో అలంకరించుకుంటారు. పురుషులు కోయడోళ్లు వాయిస్తారు. ఆడవారు గిల్లలు మోగిస్తారు. వీరి గిరిజన నృత్యాలు చూడముచ్చటగా ఉంటాయి.  వీరి డప్పు నృత్యం, కొమ్ము డ్యాన్స్‌ పాపులర్‌. పండుగల సమయాల్లో తెల్లవారేవరకూ ఆడ,మగ కలిసి కల్లు సేవిస్తారు. జీలుగు కల్లు వీరి ప్రత్యేకత.

అంతరిస్తున్న గిరిజన జాతుల్లో ఇదొకటా?

ప్రపంచంలో ఇప్పటికే అనేక ప్రాచీన గిరిజన జాతులు అంతరించిపోయాయి. ఇప్పడు పోలవరం ప్రాజెక్టు ముంపు కారణంగా కొండరెడ్ల జాతి కూడా అంతరించే అవకాశముందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారు కొన్ని శతాబ్దాలుగా  జీవించిన ప్రాంతం మునిగిపోయిన తరువాత కొత్త ప్రాంతంలో కృత్రిమంగా జీవితం సాగించాల్సిందే తప్ప ఆ సహజత్వం ఉండదు. ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలు ఎంత చక్కగా అమలు జరుగుతాయో అందరికీ తెలిసిన విషయమే. ఏదిఏమైనా కొండరెడ్ల ఉనికిని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మీద ఉంది.