జూనియర్ డాక్టర్లు.. అదేనండీ జూడాలు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కడం సర్వసాధారణంగా మారిపోయింది. తమకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం చెల్లించడంలేదనీ, తమ సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు జూడాలు. ఖచ్చితంగా గ్రామాల్లో ఏడాదిపాటు వైద్యం అందించాలనే నిబంధనను ప్రభుత్వాలు గతంలోనే విధించాయి. జూడాలకి. జూడాలు సైతం ఇందుకు సముఖంగానే వున్నారు. అయితే వారి వాదన తమను టెంపరరీ డాక్టర్లుగా వుంచేయడం వల్ల రోగులతో తమకు అటాచ్‌మెంట్ సరిగ్గా వుండదన్నది వారి ఆవేదన.
జూడాలు, ప్రభుత్వం పరస్పర వాదనలు ప్రతివాదనలు విన్పిస్తున్నా.. మధ్యలో బలైపోతున్నది మాత్రం పేద రోగులే. జూడాలు గత కొన్నాళ్ళుగా చేస్తున్న సమ్మెపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటం సంగతి సరే సరి. అయినా జూడాలు మాత్రం తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గడంలేదు. వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే జూడాలకు మద్దతు పలికాయి. వారి సమస్యలు అలాంటివి మరి.
అయితే, జూడాలు తమ ఆందోళనలో భాగంగా ఈ రోజు హైద్రాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాబ్ డాన్స్ చేశారు జూడాలు. పోరు బాటకు పాట తోడైతే ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో రోగులకు ప్రాణాలు పోయాల్సిన జూడాలు, బాధ్యతల్ని పక్కన పెట్టి డాన్సులు వేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
ఇప్పటిదాకా జూడాల సమస్యల గురించి సామాన్యులూ ఎంతో కొంత ఆలోచించారు. కానీ మాబ్ డాన్సులతో జూడాలు హడావిడి చేయడాన్ని ఎవరూ హర్షించడంలేదు. పిల్లికి చెలగాటం.. ఎలుకకి ప్రాణ సంకటం అన్న చందాన జూడాల ఆందోళన రోగుల ప్రాణంతో చెలగాటమాడుతోందన్నది నిర్వివాదాంశం.