ఇన్నాళ్లూ జాతీయవాదులు, దేశభక్తులు.. అలా అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ 370వ అధికరణం యొక్క దుర్మార్గం గురించి దురపిల్లుతూ వచ్చారు. వారందరి మనఃక్లేశాన్ని తొలగిస్తూ… నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ అధికరణాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతం పరిపూర్ణంగా భారత్ లో అంతర్భాగమైంది. అలాంటి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణం వల్ల గత 70 ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, అందుకే దీనిని రద్దు చేస్తున్నామని మోదీ సర్కారు ప్రకటించింది. సంతోషం.
ఆరోజు నుంచి కూడా సోషల్ మీడియాలో రకరకాల జోకులు వెల్లువగా వస్తున్నాయి. ‘కాశ్మీర్ లో శ్రీచైతన్య, నారాయణ కాలేజీ శాఖలు ప్రారంభిస్తున్నారు, 12 నుంచి అడ్మిషన్లు’ అని, ‘రెండేళ్ల తరువాత ఐఐటీ లో కాశ్మీర్ నారాయణ విద్యార్థుల ర్యాంకుల పంట’ అని, ‘కాశ్మీరులో ఆంధ్రా మెస్ ప్రారంభం’ అని.. రకరకాల జోకులు వ్యాపిస్తున్నాయి. మూడు రోజులుగా ఈ నిర్ణయంతో ఆనందిస్తున్న వారందరూ కూడా.. ఈ జోకులకు మరింతగా నవ్వుకుంటున్నారు.
కానీ ఒక రకంగా ఆలోచిస్తే… ఇవి సీరియస్ గా చోటు చేసుకోవాల్సిన అంశాలే అనిపిస్తోంది. ఆంధ్రా మెస్ లు, చైనా కాలేజీలు అని కాదు గానీ… 370 అధికరణం రద్దును హర్షించే వాళ్లంతా, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ను own చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో బడా పారిశ్రామిక వేత్తలకు, బడా విద్యా సంస్థలకు కొదువ లేదు. అలాంటి వారంతా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో అడుగు పెట్టాలి. ‘ఈ అధికరణం వల్ల వాళ్లు వెనుకబాటుతనంలోనే ఉండిపోతున్నారు. వాళ్లకు దేశం అనుభవిస్తున్న అభివృద్ధి తెలియడం లేదు’ అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు తెలియజెప్పాలి.
ఇప్పుడిక జమ్మూకాశ్మీర్ లో భారతీయులు ఎవరైనా ఆస్తులు కొనుక్కోవచ్చు, అక్కడి చిరునామాతోనే పౌరసత్వం కూడా పొందవచ్చు. వ్యాపారాలు చేయవచ్చు. పరిశ్రమలు పెట్టవచ్చు. నిందలు వేయడానికి ఆస్కారం లేదు.
ఇక ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి దేశంలోని ప్రముఖులు, వ్యాపార- పారిశ్రామిక వేత్తలు, జాతీయవాదులూ అందరూ ముందుకు రావాలి. అక్కడ పారిశ్రామికీకరణ జరగడం లేదని, ఉపాధి అవకాశాలు ఉండడం లేదని, అందుకే యువత పెడదారి పడుతున్నారని వాదించే వారున్నారు. కొంత నిజముండొచ్చు. ఇప్పుడికి వారికి ఉపాధి మార్గాలు చూపిస్తే.. అక్కడ ఉగ్రవాదం ఎంతగా తగ్గుముఖం పడుతుందో ఇలాంటి దేశభక్తులు నిరూపించాలి.
కేంద్రంలో కాంగ్రెసున్నా… భాజపా ఉన్నా.. ఆ ప్రభుత్వాలతో పనులు చక్కబెట్టుకుని తమ సొంతానికి వందల కోట్ల లాభాలు పొందుతూ ఉండే ప్రముఖులు ఎందరో ఉంటారు. అలాంటి వారు.. ఈ ప్రభుత్వానికి మద్దతుగా వీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అని జాతి గుర్తించడానికి.. కొన్ని త్యాగాలకు సిద్ధపడి అయినా అక్కడ పరిశ్రమలు గట్రా స్థాపించాలి. ఏ ఇండస్ట్రీలకు అనుకూలంగా ఉంటుందో… అలాంటి వాటిని తక్షణం ప్రారంభించాలి. పైగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం కూడా పరిశ్రమలకు ఒక వెసులుబాటే.
నిజానికి జమ్మూ కాశ్మీర్ లో నైపుణ్యంగల యువతకు, ప్రతిభకు కొరతేం లేదు. ఆ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్ కూడా ఎంపికవుతున్నవారు కూడా ఏటా ఉంటున్నారు. గత ఏడాదిలో ఏడుగురు, అంతకుముందు ఒక ఏడాదిలో తొమ్మిది మంది సివిల్స్ కు ఎంపికయ్యారు. సివిల్స్ అనేది కేవలం ఒక కొలబద్ధ. తతిమ్మా రంగాల్లో కూడా ప్రతిభావంతులు అనేకులు అక్కడ ఉంటారు. వారందరూ తమ ప్రతిభకు తగిన ఉపాధులు దొరకడానికి ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లవలసిన అగత్యం లేకుండా.. ఎక్కువ భాగం స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తూ పరిశ్రమలు రావాలి. దేశభక్త పారిశ్రామికవేత్తలు చొరవ తీసుకోవాలి.
జోకులుగా సోషల్ మీడియాలో పేలుతున్న విషయాలన్నీ వాస్తవంలోకి వస్తేనే.. 370వ అధికరణం రద్దు ద్వారా ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. మోదీ సర్కారు కూడా కాస్త ముందడుగు వేయాలి. అక్కడ పరిస్థితులు మామూలుగా కావడానికి… పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రత్యేక కార్యచరణతో ముందుకు రావాలి. రాష్ట్రపతి నోటిఫికేషన్ రాగానే పండగ చేసుకుని, మిఠాయిలు పంచేసుకుని, ఆ తర్వాత ఎవరికి వారు తమ తమ సొంత వ్యాపారాల్లో తలమునకలైపోతే ప్రయోజనం లేదు.
–కె.ఎ. మునిసురేష్ పిళ్లె (సీనియర్ పాత్రికేయుడు)