కళ తగ్గిన కాషాయం

ఢిల్లీ దెబ్బకు కమిలిన కమలం ఏపీలో ఆగిన వలసలు టీఆర్‌ఎస్ దోస్తీ వార్తలతో జోరు తగ్గిన బీజేపీ Advertisement ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ జోరు తగ్గింది. గత ఏడాది కాలంగా వలసలతో హుషారుగా ఉన్న బీజేపీలో…

ఢిల్లీ దెబ్బకు కమిలిన కమలం
ఏపీలో ఆగిన వలసలు
టీఆర్‌ఎస్ దోస్తీ వార్తలతో జోరు తగ్గిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ జోరు తగ్గింది. గత ఏడాది కాలంగా వలసలతో హుషారుగా ఉన్న బీజేపీలో ఇపుడు స్తబ్దత ఆవరించింది. వరుస విజయాలను ఇంతవరకూ నమోదు చేసుకుని దేశంలో ఎదురులేని రాజకీయ శక్తిగా బలోపేతమవుతున్న కమలదళానికి ఢిల్లీ ఫలితాలు షాక్ ఇచ్చాయి. కనీసం ఏడు అసెంబ్లీ సీట్లయినా గెలుచుకుని ప్రతిపక్షంగా నిలిచే అవకాశాలు లేకుండా గుండు కొట్టించుకున్న కాషాయ పార్టీకి ఏపీలో అంత ఆశాజనకంగా కనిపించడంలేదు. 2019 నాటికి ఏపీలోనూ పాగా వేయాలని గత కొంతకాలంగా ఆశలు పెంచుకున్న బీజేపీకి ఢిల్లీ ఫలితాలు నోట్లో వెలక్కాయగా మారాయి. మోడీ హవా తగ్గుతోందన్న ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టలేక సతమతమవుతోంది. మరో వైపు మిత్రపక్షం టీడీపీ కూడా గుర్రుగా ఉండడం, కాంగ్రెస్ సమరభేరీ మోగించడం, వైసీపీ కూడా తనదైన బాణిలో ప్రజా పోరుకు సిద్ధం కావడంతో ఏపీలో తన స్ధానాన్ని వెతుక్కోవాల్సివస్తోంది. నిన్నటివరకూ టీడీపీ తరువాత మేమే అన్నట్లుగా ఉన్న బీజేపీ నేతల ధీమా మెల్లమెల్లగా సడలుతోంది. మోడీ మంత్రం, అమిత్‌షా తంత్రం గెలిపించదన్న చేదు నిజం వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ పదమూడు జిల్లాల ఏపీలో సంస్ధాగతంగా బీజేపీ బలపడలేదు, మరో వైపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, హరిబాబు, మరో ఇద్దరు తప్ప బలమైన నాయకులు లేరు. ఈ పరిస్థితులలో ఏపీలో మళ్లీ మొదటికేనా అన్న అనుమానాలు ఆ పార్టీ నేతలలో కలుగుతున్నాయి.. దీనికి తోడు అన్నట్లుగా టీఆర్‌ఎస్‌లో దోస్తీ వార్తలు కూడా అతలాకుతలం చేస్తున్నాయి. విభజనకు కారకుడైన కేసీఆర్‌తో అంటకాగితే ఆంధ్రప్రదేశ్‌లో పుట్టగతులు ఉండవన్న భయం కూడా ఇక్కడ నేతలలో ఉంది. అంతే కాదు, విభజన చట్టంలోని ప్రధాన అంశాలను తొక్కి పెట్టడం, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ప్యాకేజీలను అటెకక్కించడం కూడా బీజేపీని ఇబ్బందులలోకి నెడుతోంది. మొత్తం మీద బీజేపీ జోరు తగ్గడంతో టీడీపీతో పాటు, ఇతర పక్షాలు ఆనందంగా ఉన్నాయి. 

తగ్గుతున్న విశ్వాసం

గత ఏడాదికీ, ఇప్పటికీ ఏపీలో బీజేపీ పట్ల జనంలో బాగానే మార్పు కనిపిస్తోంది. బీజేపీని నాడు అక్కున చేర్చుకున్న వారే ఇపుడు అదోలా ముఖం పెడుతున్నారు. ఢిల్లీ ఫలితాలు తారుమారు కావడానికి కూడా ఏపీ తెలుగు వారి హస్తం బాగానే పనిచేసిందన్నది వాస్తవం. అధికారంలోకి రాగానే ఏపీని స్వర్గధామం చేస్తామని, ప్రత్యేక ెదా కల్పిస్తామని, ఢిల్లీ కంటే పెద్ద రాజధాని నిర్మిస్తామని స్వయంగా మోడీ తిరుపతి సభలో చెప్పిన మాటలు చెవిలోనే ఉన్నాయి. ఇక, ఏపీ బీజేపీకి సర్వం సహా అయిన కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు కూడా పదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని రాజ్యసభలో గట్టిగా నొక్కి వక్కాణించారు. ఇపుడు అదే వెంకయ్యనాయుడు అసాధ్యమంటున్నారు. ఈ ఫలితాన్ని బీజేపీ ఇప్పటికే ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో చవి చూసింది. అక్కడ తెలుగు వారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో కసిగా బీజేపీని ఓడించి ఆప్‌కు ఓటు వేశారు. ఇది ఓ లిట్మస్ టెస్ట్ మాత్రమే. రానున్న రోజులలో బీజేపీ ఇదే తీరుగా వ్యవహరిస్తే తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల తరువాత బీజేపీ వైపు మొగ్గు చూపిన నేతల పరిస్థితి ఇపుడు అయోమయంగా ఉంది. దేశంలో మారిన రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి కమల శిబిరంలో చేరిన వారంతా తమ గతేం కానని ఆందోళన చెందుతున్నారు. వీరితో టచ్‌లో ఉంటున్న కాంగ్రెస్ నాయకులకు కూడా పార్టీలోకి రావద్దని వారే ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు. దాంతో, మహామహులంతా బీజేపీ వైపు చూడడం మానుకున్నారు. మోడీ అంటే ఫీవర్ పెంచుకున్న వారంతా కూడా ఇపుడు వేరేగా ఆలోచన చేస్తున్నారు. గడచిన తొమ్మిది నెలల మోడీ పాలనలో దేశంలో ధరల నియంత్రణ జరగకపోవడం, యూపీఏ  మూసగానే పాలన ఉండడం పట్ల కూడా సగటు జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా, విభజన తరువాత నానా రకాలుగా నష్టపోయిన ఏపీని ఆదుకోవడంలో మొండి చేయి చూపిస్తున్న మోడీ పట్ల కూడా ప్రజలలో నానాటికీ అసహనం పెరిగిపోతోంది. దీంతో, బీజేపీ బలపడాల్సిన చోట మరింతగా ఇబ్బందులు పడుతోంది.

వెంకయ్య టార్గెట్

ఏపీ బీజేపీలో పేరు మోసిన నేతగా ఉన్న వెంకయ్యనాయుడు ఇపుడు అందరికీ టార్గెట్ అయ్యారు. ఆయన చేసిన ఓ ప్రకటన వల్లనే ఇదంతా జరిగిందని కూడా అంటున్నారు. విజయవాడ నడిబొడ్డున జరిగిన ఓ వాణిజ్య సదస్సులో వెంకయ్యనాయుడు ప్రత్యేక ప్రతిపత్తి ఏపీకి రాదంటే రాదని తేల్చేశారు. దాని గురించి మరచిపోవడం మంచిదని కూడా హితవు పలికారు. దేశ రాజ్యాంగాన్ని మార్చాల్సినంత తతంగం దాని వెనక ఉందని, దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ప్రత్యేక ప్రతిపత్తికి ఒప్పుకోవాలని, అందువల్ల అది కుదిరేది కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మిత్రపక్షం టీడీపీతో సహా, అన్ని రాజకీయ పార్టీలకు ఆయనే గురి అయిపోయారు. ప్రధాని మోడీ తెలివిగా ఏపీ వ్యవహారాలన్నీ వెంకయ్యనాయుడు ద్వారానే మాట్లాడిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ఆర్ధిక సాయం, విభజన హామీల అమలు గురించి ప్రధానిని కలిసినా ఆయన నివేదికలు తీసుకోవడానికే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీకి సంబంధించి ఏం కావాలన్నా వెంకయ్యనాయుడుతోనే మాట్లాడాలంటూ ప్రధానే సూచించడంతో వెంకయ్య పని అడ కత్తెరలో పోక చెక్కలా మారింది, మొదట్లో తనకు ఈ గౌరవం బాగానే ఉందని వెంకయ్యనాయుడు అనుకున్నా చివరికి అది ఆయనేక ఇబ్బంది పెట్టేలా మారిందని బీజేపీలో గుసగుసలు పోతున్నారు. ఇక, ప్రభుత్వానికి సంబంధించినంతవరకూ వెంకయ్యనాయుడు అనుభవాన్ని బాగానే వాడుకుంటున్న ప్రధాని మోడీ ఏపీ వ్యవహారాలలో తెలివిగానే ఆయనను ఇరికించారని అంటున్నారు. దీంతో, ప్రత్యేక ప్రతిపత్తి గుదిబండ వెంకయ్య మెడకు బాగానే చుట్టుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదేళ్లుగా పదవులు అనుభవించి చివరికి గత ఏడాది ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయినా కాంగ్రెస్ నాయకులు సైతం ఇపుడు వెంకయ్యను విమర్శలతో వేధిస్తున్నారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అయితే, ప్రతీ రోజూ నాయుడునే లక్ష్యంగా చేసుకుని ఘాటైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఇపుడు ఆ జాబితాలోకి తాజాగా అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్ కూడా చేరారు. ఆయనైతే వెంకయ్యను ఏకంగా పొలిటికల్ బఫూన్ అంటూ నిందించారు. ఇదే తీరులో వామపక్షాలు, ఇతర పార్టీల నుంచి కూడా విమర్శలు వస్తూండడంతో వెంకయ్య గుక్క తిప్పుకోలేకపోతున్నారు. మరో వైపు మిత్రపక్షం టీడీపీ కూడా లోలోపల బీజేపీ తీరుపై గుర్రుగా ఉంటోంది, దాంతో, ఎవరి మాట సాయం దక్కక వెంకయ్య అతలాకుతలం అవుతున్నారు. దీంతో, ఆయన తరచూ మాటలు మార్చుతూ మరింతగా నవ్వులపాలు అవుతున్నారు.

అధ్యక్షుని నిర్లిప్తత

ఏపీ బీజేపీ అధ్యక్షునిగా డాక్టర్ కె హరిబాబు వ్యవహరిస్తున్నారు. ఆయన స్వతహాగా మృదు స్వభావి. ఆంధ్ర విశ్వవిద్యాలయం అధ్యాపకునిగా పనిచేసిన ఆయన వెంకయ్యనాయుడు సహచరునిగా రాజకీయాలలో ఉన్నారు. గతంలో ఓ మారు శాసనసభ్యునిగా గెలిచిన ఆయన ఇపుడు విశాఖ పార్లమెంటు సభ్యునిగా గెలిచారు. ఆయనను ఏరీ కోరీ వెంకయ్య ఏపీ బీజేపీ అధ్యక్షునిగా నియమించారు. అయితే, హరిబాబు రాజకీయాలలో ఉండాల్సిన దూకుడును కనబరచడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మోడీ హవా బాగా ఉన్న సమయంలో ఆయన పార్టీని పదమూడు జిల్లాలలో బలోపేతం చేయడంలో పెద్దగా కృషి చేయలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా కోస్తా, రాయలసీమలలో పార్టీ బలాన్ని విస్తరించాల్సిన సమయంలో టీడీపీతో అనవసర మొహమాటాలో, మరే కారణాలో తెలియదు కానీ స్తబ్దుగా ఉండిపోయారు. అంతెందుకు విశాఖ జిల్లాలో పేరు మోసిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఆయన శిష్య గణాన్ని బీజేపీకి రప్పించడంలోనూ హరిబాబు చొరవ చూపించలేకపోయారన్నది కూడా కమలదళంలో చర్చగా ఉంది. విశాఖ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనా కూడా ఇంకా టీడీపీపైనే ఆధారపడడం రాష్ట్ర అధ్యక్షుని సంస్ధాగత నిర్వహణా లోపాన్నే తెలియచేస్తోంది. విశాఖ కార్పొరేషన్‌లో బీజేపీకి ఇప్పటికీ తగినంత బలం లేదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే పార్టీకి పటిష్ట పునాదులు వేయలేకపోయారన్న అపకీర్తిని కూడా ఆయన మూటకట్టుకున్నారు. ఇక, విశాఖకు రైల్వే జోన్ సాధించే విషయంలోను, హుధ్‌హుధ్ తుపాను నిధులను కేంద్రం నుంచి విరివిగా రాట్టే విషయంలోనూ కూడా హరిబాబు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన సామాజిక వర్గానికే చెందిన టీడీపీని నష్టపరచకూడదన్న ఏకైక అజెండాతోనే పార్టీ విస్తరణకు హరిబాబు నడుం బిగించలేదని, మనస్పూర్తిగా కృషి చేయలేదని పార్టీలోని మిగిలిన వారి ఆరోపణగా ఉంది. ఏది ఏమైనా ఇటీవల కాలంలో ఏపీలో పర్యటించిన జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా పార్టీ పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది.  ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇపుడు బీజేపీ లోకి రమ్మని ఎవరిని పిలిచినా స్పందన అంతంత మాత్రంగా ఉంది.

ఆగిన వలసలు

ఏపీలో బీజేపీ పరిస్థితిని ఢిల్లీ ఫలితాలకు ముందు తరువాతగా చూడాల్సిన  అవసరం ఉంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ముందు బీజేపీలో చేరడానికి రాయబారాలు నడిపిన కాంగ్రెస్ మహామహులు ఇపుడు అదే పార్టీపై తిట్ల పురాణం లంకించుకోవడం బట్టే బీజేపీ స్థితి తెలిసిపోతోంది. బీజేపీలో చేరడానికి ఉవ్విళ్లూరిన పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇపుడు ఏపీసీసీ పిలుపు మేరకు ఇచ్చిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో జోరుగా పాలుపంచుకుంటున్నారు. బీజేపీలోకి చేరాలని భావించిన అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్ ఏకంగా వెంకయ్యనాయుడుపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. అదే వరుసలో ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా  ఉన్నారు. బీజేపీ పని తొమ్మిది నెలలలోనే అయిపోయిందని, రానున్న రోజులలో ఏపీలో ఆ పార్టీని నమ్మి ఓట్లు వేయడం కష్టమన్న భావన రావడమే ఈ వలసల బ్రేక్‌కు కారణం. మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా ఓ దశలో బీజేపీ వైపు ఊగిసలాడినట్లుగా వార్తలు వచ్చినా ఇపుడు చిరంజీవి సినిమాలపైనే దృష్టి నిలిపారు. రానున్న రోజులో అప్పటి పరిస్థితి బట్టి రాజకీయంగా నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన భావిస్తున్నట్లుగా మెగా క్యాంప్ చెబుతోంది. ఇక, బీజేపీలో చేరి ఎటూ కాకుండా పోయామని మాజీ కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి విలవిల్లాడుతున్నారు. అలాగే, గుంటూరుకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సైతం కమలం కండువా కప్పుకుని తొందర పడ్డారని ఆయన అనుచర గణం ఆక్రోసిస్తోంది. విశాఖ జిల్లా విషయానికి వస్తే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వర్గీయులు కూడా బీజేపీలో చేరాలనుకున్నా ఢిల్లీ ఫలితాల తరువాత వెనక్కు తగ్గారని వార్తలు వినిపిస్తున్నాయి.  దీనికి తోడు టీఆర్‌ఎస్‌లో బీజేపీ చెలిమి చేస్తుందన్న వార్తలు కూడా ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విభజన కారణమైన కేసీఆర్‌తో దోస్తీ చేస్తే రానున్న రోజులలో మరింతగా మునిగిపోతామని అపుడే కమలదళంలో ఆందోళన మొదలైంది. ఏది ఏమైనా బీజేపీ జోరు తగ్గడం మాత్రం మిత్రపక్షం టీడీపీలో ఆనందాన్ని కలిగిస్తోంది. తమకు పోటీగా తయారవుతుందనుకున్న పార్టీ ఇలా అయోమయంలో పడడం పసుపు పార్టీకి హుషారును ఇస్తోంది. అలాగే, కాంగ్రెస్, వైసీపీలలో కూడా బీజేపీ జోరు తగ్గడంపట్ల హర్షం వ్యక్తమవుతోంది.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,