ఓ పాతికేళ్ళ కుర్రాడి కథ.. కాదు, వ్యధ ఇది. 'హైటు తక్కువ..' అంటూ ఫ్రెండ్స్ వేసిన సరదా కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకుని, హాస్పిటల్‌కి వెళితే, 'మీకెందుకు, మేమున్నాం..' అంటూ లక్షలు గుంజి, కాళ్ళను నరికేశారంతే. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. తల్లిదండ్రులకు చెప్పకుండా ఆ యువకుడు డాక్టర్లను ఆశ్రయిస్తే, నైతిక విలువలకు తిలోదకాలిచ్చేసి, డబ్బుని బొక్కడమే వైద్య వృత్తికి పరమార్థం అన్నట్లు సదరు డాక్టర్లు, సదరు ఆసుపత్రి వ్యవహరించింది.
ఈ కేసులో సర్జరీ చేసిన డాక్టర్‌పై రెండేళ్ళపాటు సస్పెన్షన్ వేటు వేసింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. ఇది సంచలన నిర్ణయంగానే భావించాల్సి వుంటుంది. అయితే, రెండేళ్ళు కాదు, జీవితకాలం సస్పెన్షన్ వేటు వేసి వుంటే బాగుండేదన్న వాదనలూ విన్పిస్తున్నాయి. కుర్రాళ్ళు.. ఉడుకురక్తం.. తెలిసీ తెలియక ప్రాణమ్మీదకు తెచ్చుకుంటున్నారనే ఇంగితం ప్రదర్శించని డాక్టర్‌కి ఎలాంటి శిక్ష విధించినా అది తక్కువే అవుతుంది.
బాధితుడు నిఖిల్‌రెడ్డి ఇంకా కోలుకోలేదు. మంచానికే పరిమితమైపోయాడు. జస్ట్ నాలుగైదు రోజులు మాత్రమే.. మూడు నెలల్లో మామూలుగా నడుస్తావ్.. ఆరు నెలల్లో పూర్తిగా నడిచేసి, జంపింగ్స్ కూడా చేసెయ్యొచ్చని డాక్టర్లు చెప్పినా.. అవన్నీ వట్టిమాటలే అయ్యాయి. ఎముకల్ని కత్తిరించి, వాటికి స్టీల్ రాడ్స్‌ని ఫిక్స్ చేసి, స్క్రూల సహాయంతో హైట్ పెంచడం, ఈలోగా ఎముకలు పెరిగేందుకు ఉపయోగించే మందులతో ఆ గ్యాప్ ఫిల్ అవడం.. ఇదంతా అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ.
నిజానికి ఇలాంటి శస్త్ర చికిత్సలు అంగవైకల్యంతో పుట్టినవారికి, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారికి మాత్రమే చేయాల్సి వుంటుంది. కానీ డబ్బుకి కక్కుర్తిపడి, వైద్య వృత్తికే కళంకం తెచ్చిన డాక్టర్ చంద్రభూషణ్.. చివరికిలా సస్పెండ్ అయ్యాడు. డాక్టర్ మీద చర్యలు సరే, ఆసుపత్రి మాటేమిటి.? ఆసుపత్రి మీద చర్యలు తీసుకునేంత ధైర్యం ప్రభుత్వానికి వుందా.? లేదంటే, సదరు ఆసుపత్రి ప్రలోభాలకు ప్రభుత్వం తలొగ్గిందా.?
కొసమెరుపు: తెలంగాణ వ్యాప్తంగా పలువురు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేస్తూ తెలంగాణ వైద్య మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో అనవసరంగా అపెండిసైటిస్ శస్త్ర చికిత్సలు చేసినవారు, పిల్లల కోసం అవసరం లేపోయినా శస్త్ర చికిత్సలు చేసిన డాక్టర్లు వున్నారండోయ్. ముందే చెప్పుకున్నాం కదా, ఇలాంటోళ్ళకి సస్పెన్షన్‌తో సరిపెట్టడం కాదు, క్రిమినల్స్‌గా గుర్తించి, శిక్షలు విధించాలేమో.!