రోమ్ తగలబడ్తోంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ ఎంజాయ్ చేశాడట. అది నిజమో కాదో నేటి తరానికి తెలియదుగానీ, కాశ్మీర్ తగలబడ్తోంటే భారత ప్రధాని నరేంద్రమోడీ, విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారన్నది మాత్రం నూటికి నూరుపాళ్ళూ నిజం. ఓ సారి విదేశీ పర్యటన ఫిక్సయ్యాక, దేశంలో ఏం జరిగినా వున్నపళంగా ఆ పర్యటనల్ని రద్దు చేసుకుని రాలేరుగానీ, దేశంలో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఏ ప్రధాని అయినా ప్రయత్నించి తీరాలి.
కానీ, నరేంద్రమోడీ సర్కార్ మాత్రం.. కాశ్మీర్ రగిలిపోతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం.. అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తూతూ మంత్రం ప్రకటనలు తప్ప, కాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితుల్ని నెలకొల్పేందుకు మాత్రం తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. పైగా, అక్కడ బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది.. అధికారం పంచుకుంటోంది కూడా.!
కాశ్మీర్ విషయంలో ఏం చెయ్యాలి.? ఏం చెయ్యకూడదు.? అన్న విషయమై దశాబ్దాలుగా ఎవరికీ స్పష్టత లేని పరిస్థితి. కాశ్మీర్, భారతదేశంలో భాగం. కానీ, కాశ్మీర్‌కి దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ప్రత్యేకమైన వెసులుబాట్లు, అధికారాలు, పరిస్థితులు వున్నాయి. అందుకే, కాశ్మీర్ విషయంలో వేలు పెట్టడానికి కేంద్రంలో ఇప్పటిదాకా అధికారం వెలగబెట్టిన ఏ ప్రభుత్వమూ సాహసించిన పాపాన పోలేదు. అక్కడ పాకిస్తాన్ జెండాలు ఎగురుతాయి, ఐసిస్ జెండాలు ఎగురుతాయి.. కానీ, అది భారతదేశంలో అంతర్భాగం. అదే విడ్డూరం.
కాశ్మీర్ వేర్పాటువాదులు పాకిస్తాన్ ప్రభుత్వంలో మంతనాలు జరుపుతారు.. వారికి పాకిస్తాన్ నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందుతుంటాయి. కాశ్మీర్‌లో యధేచ్ఛగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు సంచరిస్తుంటారు. అలా కాశ్మీర్‌ని పాకిస్తాన్ నిత్యం రావణకాష్టంగా మండిస్తూనే వుంటోంది. మళ్ళీ అదే పాకిస్తాన్, కాశ్మీర్‌లో హింస పట్ల ఆవేదన వ్యక్తం చేస్తుంటుంది. భారత ప్రభుత్వం షరామామూలుగానే చోద్యం చూస్తుంటుంది.
'నేను ప్రధాని అయ్యాక దేశంలో పరిస్థితులు మారాయి..' అని పదే పదే చెప్పే నరేంద్రమోడీ, కాశ్మీర్ విషయంలో ఏం మార్పు తీసుకొచ్చారో మాత్రం చెప్పరు. అసలాయన, కాశ్మీర్ విషయంలో ఏం చేయదలచుకుంటున్నారో వెల్లడించరు. అసలు, కాశ్మీర్‌ని ఆయన పట్టించుకోరు. స్వదేశంలో వున్నప్పుడే కాశ్మీర్ విషయాన్ని పట్టించుకోని ప్రధాని, విదేశాలకు వెళ్ళాక కాశ్మీర్ తగలబడిపోతే మాత్రం పట్టించుకుంటారని ఎలా అనుకుంటాం.? పైగా, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడాయె. ఇప్పుడు అదే నవాజ్ షరీఫ్, పాకిస్తాన్‌లో హింస పట్ల ఆందోళన వ్యక్తం చేసేశారు.. వేర్పాటువాదులకు మద్దతు పలుకుతూ, భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు దంచేస్తున్నారు. అయినా, నరేంద్రమోడీ పెదవి విప్పకపోవడం ఆశ్చర్యకరమే.
విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చాక, కాశ్మీర్‌లో పరిస్థితిపై సమీక్షించి, తగు చర్యల్ని తీసుకోనున్నారట నరేంద్రమోడీ. కామెడీకి ఇంతకన్నా పరాకాష్ట ఇంకేముంటుంది.? పొరుగు దేశం పాకిస్తాన్‌కి సరైన సమాధానమిస్తే తప్ప, కాశ్మీర్‌లో కల్లోలం ఆగే పరిస్థితి లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజల దుర్భర పరిస్థితుల్ని చూస్తూ కూడా, కాశ్మీర్‌లో అతి కొద్ది మంది 'ఔత్సాహికులు' కల్లోలం సృష్టిస్తుండడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి.? కాశ్మీర్ ప్రజల్లో భారతదేశంపై అభిమానం పెంచగలగాలి.. తామూ భారతీయులమన్న భావన వారిలో కలిగేలా పాలకులు చర్యలు తీసుకోవాలి. ఇదంతా జరగాలంటే, మిత్రపక్షంతో పార్టీ పరంగా బీజేపీ చర్చలు జరుపుతూనే, ప్రభుత్వాల స్థాయిలో నరేంద్రమోడీ, కాశ్మీర్ ముఖ్యమంత్రితో అత్యవసర చర్చలు జరపాలి. ఇదంతా జరిగేనా.? జరిగినా సత్ఫలితాలు వచ్చేనా.? ఏమో మరి వేచి చూడాల్సిందే.