కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. దురదృష్టవశాత్తూ కాశ్మీర్‌లో కొంత భాగాన్ని ఇప్పటికే కోల్పోయాం. అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్. కొంత భాగం చైనా ఆధీనంలోనూ వుందిప్పుడు. ఏం చేస్తాం, కొన్ని దురదృష్టకర పరిస్థితులు, ఇంకా దురదృష్టకరమైన నిర్ణయాలు.. కాశ్మీర్‌ని రావణకాష్టంగా మార్చేశాయి.
అప్పటికీ ఎప్పటికీ కాశ్మీర్ తమదేనంటోంది పాకిస్తాన్. ఆక్రమించుకున్నది చాలక, మొత్తం కాశ్మీర్‌ని లాగేద్దామనే దురాలోచనతో, కాశ్మీర్‌లో అశాంతిని రగిలిస్తోంది పాకిస్తాన్, తీవ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా. ప్రపంచమంతా ఏకమై, పాకిస్తాన్‌ని ఈ విషయంలో తప్పుపడ్తున్నా, కుక్కతోక వంకర బుద్ధి మాత్రం మానుకోవడంలేదు పాకిస్తాన్. కాశ్మీర్ విషయంలో భారత్ 'గట్టి' చర్య ఏదన్నా తీసుకోవాలంటే, అది యుద్ధం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
కానీ, పాకిస్తాన్ కూడా భారత్‌లానే అణ్వాయుధాలు కలిగిన దేశం. పైగా, పాకిస్తాన్‌తో యుద్ధమంటూ మొదలు పెడితే, భారతదేశం అదే సమయంలో చైనాతో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. కారణం అందరికీ తెల్సిందే. పాకిస్తాన్‌ని ముందుకు తోసి, వెనకాల కథ నడిపిస్తున్నది చైనానే. పాకిస్తాన్ ఆయుధ సంపత్తిలో మెజార్టీ భాగం చైనా నుంచి దిగుమతి చేసుకున్నదే.
ఇదిలా వుంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ పాకిస్తాన్ – కాశ్మీర్ అంశం తెరపైకి వచ్చింది. డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గనుక అధ్యక్షురాలిగా విజయం సాధిస్తే, కాశ్మీర్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేయాల్సిందిగా భారత్‌పై ఒత్తిడి పెంచుతారట. ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇచ్చేయడానికి హిల్లరీ ఎవరు.? తీసుకోడానికి పాకిస్తాన్ ఎవరు.? గతంలో పాకిస్తాన్ – భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్‌కి మద్దతుగా అమెరికా కూడా రంగంలోకి దిగిన మాట వాస్తవం. అప్పట్లో రష్యానే, భారత్‌కి అండగా నిలిచింది. దాంతో అటు పాకిస్తాన్, ఇటు అమెరికా రెండూ తోకముడిచేశాయి. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. రష్యాతో అప్పటికీ ఇప్పటికీ సంబంధాలు అలాగే వున్నాయి. అప్పటితో పోల్చితే భారత్ తనంతట తానుగా పూర్తిస్థాయి బలం సంతరించుకుంది. పైగా, అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారతదేశం ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు.
సో, హిల్లరీ పాకిస్తాన్ – కాశ్మీర్ అంశంపై అంతగా ఓవరాక్షన్ చేయడానికేమీ వుండదు. అయితే, ఇక్కడ పాకిస్తానీ ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు హిల్లరీనే ఈ పాచిక వేశారా.? లేదంటే ఆమెకు వ్యతిరేకంగా డోనాల్డ్ ట్రంప్ ఈ దుమారాన్ని తెరపైకి తెచ్చారా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒక్కటి మాత్రం నిజం. అమెరికాకి భారత్ అవసరం బాగా పెరిగిపోయింది. అందుకే, గతంలో ఎన్నడూ లేని విధంగా కాశ్మీర్ విషయంలో భారత్‌కే మద్దతుగా వ్యవహరిస్తోంది అమెరికా. ఇది నిజం.